
ఆకాశవాణిలో బద్రి ప్రసంగం
పలాస: మండలంలోని రంగోయి గ్రామానికి చెందిన గిడుగు రామ్మూర్తి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు జానపద కళల పరిశోధకుడు బద్రి కూర్మారావు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో శనివారం ఉత్తరాంధ్ర గిరిజన తెగలు–సంస్కృతి అనే అంశంపై ప్రసంగించారు. సవర, జాతాపు, గదభ, కొండదొర, మన్నెదొర, కొండ రెడ్లు, భగత వాల్మీకి తదితర 20 ఆదివాసీ తెగల ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి, పాటలు తదితర అంశాలను వివరించారు. ఆదివాసీ సంస్కృతి చాలా గొప్పదని, నాగరకత పెరుగుతున్న కొలదీ ఆదివాసీలు తమ భాషను, సంస్కృతిని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాషను కాపాడుకోవాలని కోరారు. కాగా, ఈ నెల 8, 9, 10 తేదీల్లో తిరుపతిలో జరగనున్న భారత జనపద విజ్ఞాన సదస్సులో పాల్గొని ఉత్తరాంధ్ర జానపద కళలు, సాహిత్యంపై పత్రాలు సమర్పిస్తున్నట్టు బద్రి కూర్మారావు చెప్పారు.
ప్రతిభకు ప్రశంసలు
శ్రీకాకుళం క్రైమ్ : ప్రాపర్టీ, చైన్ స్నాచింగ్, దొంగతనాల వంటి కేసులు ఛేదించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అదనపు ఎస్పీలు కె.వి.రమణ, పి.శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షలో సీఐలు, ఎస్‌ఐలకు డీఎస్పీ సీహెచ్ వివేకానంద సమక్షంలో ప్రశంసాపత్రాలను అందించారు. గార మండలం శాలిహుండంలో 17 తులాల బంగారం కేసులో కీలక పాత్ర పోషించిన ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ వీరిలో ఉన్నారు.
‘శిష్టకరణ సంఘానికి
ఎన్నికలు నిర్వహించలేదు’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శిష్టకరణ రాష్ట్ర సంఘానికి ఎటువంటి ఎన్నికలు నిర్వహించలేదని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పోలుమహంతి ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘంలెపి 45 బ్రాంచీల అధ్యక్షులు ఎన్నికలకు ముందుకు వచ్చిన సందర్భంలో తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులుగా, కార్యదర్శిగా పాత వర్గాన్ని కొనసాగించాలని అందరూ తీర్మానించిన సందర్భంలో ఎన్నికలు అవసరం లేదని నిర్ణయించినట్లు తెలిపారు. ఓబీసీ సాధన జరిగిన తర్వాత ఎన్నికల ప్రస్తావన తెరపైకి వచ్చే అవకాశం ఉందన్నారు. స్వలాభం కోసం నలుగురైదుగురు కలిసి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక అని ప్రకటించడం సరికాదన్నారు. తమ దృష్టికి తీసుకురాకుండా ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటే, అటువంటి వారిని రాష్ట్ర కార్యవర్గం నుంచి తప్పిస్తూ క్రమశిక్షణ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
జిల్లా క్రికెటర్లకు సత్కారం
శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడాకారులు ముఖ్యంగా క్రికెట్‌లో అడుగుపెట్టినవారు నిర్దేశిత లక్ష్యాలను ఏర్పాటుచేసుకుని అకుంఠిత దీక్షతో వాటిని అందిపుచ్చుకోవాలని ఏఎస్పీ ఆర్.వెంకటరమణ అన్నారు. 2024–25 సీజన్‌లో వివిధ విభాగాల్లో ఏసీఏ అంతర్ జిల్లాల, అంతర్‌జోనల్, స్టేట్, అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నీల్లో ప్రాతినిధ్యం వహించిన జిల్లా క్రీడాకారులను జిల్లా క్రికెట్ సంఘం ఘనంగా సత్కరించింది. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు హోటల్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏసీఏ గేమ్స్ విభాగం జీఎం ఎంఎస్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా నుంచి త్వరలో మరో ముగ్గురికి రంజీల్లో ప్రవేశం లభించే అవకాశముందన్నారు. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ త్రిపురాణ విజయ్‌కు ఐపీఎల్‌లో ఎంట్రీ లభించడం శుభపరిణామమని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలో 2021–22 తర్వాత జిల్లా క్రికెట్ సంఘం సాధించిన ప్రగతి, క్రికెట్ క్రీడాకారుల ఫలితాలను జెడ్‌సీఎస్ మెంటార్ ఇలియాస్ మహ్మద్ వివరించారు. నిరుపేద క్రీడాకారులకు షూ, బ్యాగ్‌లను అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ క్రికెటర్ వండాన మురళీమోహన్, క్రీడాప్రోత్సాహకులు దుప్పల వెంకట్రావు, జెడ్‌సీఎస్ కోశాధికారి మదీనా శైలానీ, డాక్టర్ సువ్వారి రవికుమార్, గుంట పురుషోత్తమనాయుడు, రవికిరణ్, క్రీడాకారులు త్రిపురాన విజయ్, ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్, ఎన్.హిమకర్, ఆర్.జున్నారావు, నంబళ్ల సుశాంత్, మొదలవలస పూర్ణచంద్ర, శిమ్మ సాత్విక్, సీహెచ్ యోజిత్, జోగేంద్ర, వివేక్‌నందా, న్రత కిరణ్, ఎస్‌వీ ప్రేరణ్, కె.హిమచంద్ర, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

ఆకాశవాణిలో బద్రి ప్రసంగం

ఆకాశవాణిలో బద్రి ప్రసంగం
Comments
Please login to add a commentAdd a comment