మండుటెండలో మత్స్యకారుల నిరసన
కవిటి: తరతరాలుగా ఇద్దివానిపాలెం పొగురు రేవులో బోట్లు, తెప్పలు నిలిపి అక్కడి నుంచే సముద్రంలో వేటకు వెళుతున్న తమను ఆ గ్రామస్తులు అడ్డుకుంటున్నారని పెద్దకర్రివానిపాలెం మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం కవిటి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండుటెండలో బైఠాయించి నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బెహర మురళీమోహనరావు పెద్దకర్రివానిపాలెం గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ కర్రి గోపయ్య, మాజీ ఎంపీటీసీ కర్రి చంద్రశేఖర్‌లతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీఓ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెండు గ్రామాల పెద్దలతో సమావేశం నిర్వహించి గతంలో మాదిరిగా సఖ్యతతో వేట సాగేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై బైండోవర్ కేసులు బనాయించాలని కవిటి ఎస్‌ఐ వి.రవివర్మకు సూచించారు. అనంతరం పెద్దకర్రివానిపాలెం మత్స్యకారులు మాట్లాడుతూ సమస్య పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment