
డీఎస్‌ఓ కార్యాలయంలో వసూళ్ల పర్వం
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఇటీవల అవినీతి పెచ్చు మీరింది. ధాన్యం సేకరణ అదనపు లక్ష్యాల సమయంలో మిల్లర్ల నుంచి టార్గెట్లు, ఆర్బీకే నుంచి మిల్లులకు ట్యాగింగ్ పేరిట పెద్ద ఎత్తున వసూళ్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి కావడంతో.. అదనపు కొనుగోళ్ల కోసం ప్రభుత్వానికి అనుమతులు కోరారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక్కో మండలానికి 600 మెట్రిక్ టన్నుల వంతున జిల్లాకు 18,000 మెట్రిక్ టన్నులు అదనపు కొనుగోళ్లకు అనుమతి వచ్చింది. అయితే ఈ సమయంలో డీఎస్‌ఓ కార్యాలయం నుంచి ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. రైతు భరోసా కేంద్రం నుంచి మిల్లర్లకు ట్యాగింగ్ చేయాలి. అందుకు గాను ఆ కార్యాలయంలో నరసన్నపేటకు చెందిన ఒక క్లర్క్ భారీగా మిల్లర్స్ నుంచి వసూలు చేస్తున్నట్టు సమాచారం. నేరుగా ఆయన మిల్లర్స్ నుంచి డబ్బులు వసూలు చేయకుండా ఆ ఉద్యోగి అన్నయ్య ఫోన్ పేకు అమౌంట్ వేసి, ఆ స్కీన్‌షాట్ పెట్టిన వారికి మాత్రమే ట్యాగింగ్ చేస్తున్నట్లు మిల్లర్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కార్యాలయ ఖర్చు కోసం ఉన్నతాధికారులకు అందజేయాల్సి ఉంటుందని, ప్రతి మిల్లు నుంచి రూ. 40,000 నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నట్లు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నగదును ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని వారు చెబుతుండడం విశేషం.
కూటమి ప్రభుత్వానికి అనుకూల వర్గాల మిల్లులకు ఒక రేటు, అనుకూలంగా లేని మిల్లులకు ఒక రేటు తీసుకుని ఇబ్బందులు పెడుతున్నారు. టార్గెట్లు నిర్ణయాల్లో కూడా వివక్ష పాటిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 260 రైస్ మిల్లుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. సగటున ఒకరిద్దరు మిల్లర్ల నాయకుల మినహా అందరి నుంచి అధిక మొత్తంలో వసూలు చేసినట్టు మిల్లర్ల అసోసియేషన్ బాహటంగానే విమర్శిస్తోంది. ఈ వసూళ్లు ప్రధానంగా మిల్లర్లకు ఇచ్చే ధాన్యం ఏసీకే ఆధారంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. డీఎస్‌ఓ కార్యాలయంలో నరసన్నపేటకు చెందిన ఆ కా ర్యాలయం కేంద్ర బిందువుగా ఈ వసూళ్లన్నీ చేస్తు న్నారని, ఆయనకు కూటమి ప్రభుత్వంలో ప్రధాన నాయకులతో బంధుత్వం ఉన్నందు వల్ల ఆగడాలు చెల్లుబాటు అవుతున్నాయని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యాలయంలో ఈ ఉద్యోగి అవినీతిపై ఇప్పటికే జాయింట్ కలెక్టర్ దృష్టికి కొంతమంది మిల్లర్లు తీసుకువెళ్లినట్టు తెలిసింది. అయితే ఆయన ఇంతవరకు చర్యలు తీసుకోలేదని మిల్లర్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment