
కిడ్నీ మందులకు కోత
● బాధితులపై తప్పని ఆర్థిక భారం ● బయటే కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ● నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి సర్కారు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
కిడ్నీ బాధితులకు డయాలసిస్ ఎంత ముఖ్యమో.. మందులూ అంతే కీలకం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కిడ్నీ రోగులకు ప్రభుత్వం అవసరమైన కీలక మందులను ఉచితంగా అందిస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ కొరతతో ప్రభుత్వాసుపత్రులకు పూర్తిగా మందులు సరఫరా చేయడం లేదు. కీలకమైన మందులకు కోత పెడుతోంది. అసలే కిడ్నీ రోగంతో చిదికిపోయిన కుటుంబాలకు రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడం, రోజుల తరబడి డయాలసిస్ కోసం వేచి ఉండటం, దానికయ్యే ఖర్చులు భారంగా మారుతుంటే దానికి తోడు ప్రభుత్వం మందులు సరఫరా చేయకుండా చేతులేత్తేయడంతో వారి ఆర్థిక బాధలు రెట్టింపవుతున్నాయి. మందులు కొనుగోలు చేసుకోలేని పరిస్థితిలో రోగులు చనిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సోడియం బై కార్పొనెట్ వంటి కీలక మందులు ఇవ్వడం లేదు. పత్రికల్లో వస్తే అప్పటికప్పుడు ఒక్కో స్ట్రిప్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వారానికి ఒకసారి రక్తం ఇంప్రూమెంట్ కోసం ఇంజక్షన్ వేస్తుంటారు. ఇవి కూడా అప్పుడప్పుడు ఇవ్వడం లేదు. స్టాక్ ఉంటే ఇస్తున్నారు. లేదంటే కొనుక్కోమంటున్నారు. వేలాది రూపాయల విలువైన ఐరన్ ఇంజక్షన్ పరిస్థితి కూడా అంతే. బయట కొనుగోలు చేసుకోమని చెబుతున్నారు.
టెస్టుల కోసం భారీగా ఖర్చు..
కవిటి, సోంపేట, పలాస డయాలసిస్ సెంటర్లలో రోగులకు ఆర్థిక భారం తప్పడం లేదు. డయాలసిస్ చేసుకోవాలంటే చేతికి, మెడకు, గుండెకు, తొడలకు వేయాల్సిన ఎక్విప్‌మెంట్‌ను రూ.4 వేల నుంచి రూ.30 వేల వరకు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. బ్లడ్ ఇన్‌ఫెక్షన్ కల్చర్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రభుత్వాసుపత్రుల్లో చేయకపోవడంతో బయ ట రూ.1000 నుంచి రూ.2వేల వరకు వెచ్చించాల్సి న పరిస్థితి. యూరిన్ ఇన్‌ఫెక్షన్ కల్చర్ టెస్ట్ కోసం శ్రీకాకుళం, విశాఖపట్నం పంపించాల్సి వస్తోంది. ఇందుకు రూ.2వేలు వరకు ఖర్చవుతోంది.
జీవనాధారంపై దెబ్బ..
కుటుంబంలో ఒకరికి డయాలసిస్ చేయించుకోవాల్సివస్తే ఆ కుటుంబంలో మరొకరికి జీవనాధారం కరువవుతోంది. రెండురోజులకు ఒకసారి రోగితో పాటు ఆస్పత్రికి వచ్చి నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇచ్ఛాపురం నుంచి సోంపేటకు ఆటోలో వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్న వారు టోకున రూ.1200 చెల్లించాల్సిన పరిస్థితి. గతంలో 108 ద్వారా రోగులను డయాలసిస్ సెంటర్‌కు తరలించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రోగులు సొంత ఖర్చులతో వెళ్లాల్సి వస్తోంది.
మందులు బయటే..
ఏడాదిన్నర నుంచి కవిటి డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ చేయించుకుంటున్నాను. గతంలో డయాలసిస్ కేంద్రాల్లో పూర్తి స్థా యిలో మందులు ఇచ్చేవారు. ప్రస్తుతం చాలా వరకు బయటనే కొనుక్కోవాల్సి వస్తోంది. నెఫ్రాలజిస్ట్ డాక్టర్ లేకపోవడంతో ఇక్కడ డయాలసిస్ రోగులంతా నెలకు ఒకసారి విశాఖపట్నం వెళ్లి అక్కడ చూపించాల్సి వస్తోంది.
– బినాయిక్ బిసాయి, కుసుంపురం,
కవిటి మండలం
ప్రతిసారీ రూ.4వేలు ఖర్చు..
పదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాను. కవిటి ప్రభుత్వ డయాలసిస్ సెంటర్‌కు వెళితే బెడ్‌లు ఖాళీ లేవన్నారు. దీంతో పలాసలో ఓ ప్రైవేట్ సెంటర్‌లో మూడుసార్లు వెళ్లా. ఒక్కసారికే రూ.4000 ఖర్చయింది. దీంతో శ్రీకాకుళంలోని జెమ్స్‌లో ప్రస్తుతం డయాలసిస్ ఆరోగ్యశ్రీలో చేయించుకుంటున్నాను. ఆస్పత్రి బస్‌కు కవిటి నుంచి తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. బస్సు తప్పిపోతే ట్రైన్‌కు వెళ్లొస్తున్నాను. కవిటి ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేస్తేనే రూ.10,000 పెన్షన్ వస్తుందంటున్నారు.
– కె.తిరుపతిరావు, మధ్యపుట్టుగ, కవిటి మండలం
●
ఇంజక్షన్లు సరఫరా చేయాలి
కొండి పుట్టుగ గ్రామానికి చెందిన మా అమ్మ శాంతమ్మ సోంపేట డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ చేయించుకుంటుంది. ప్రస్తుతం ఐరన్ ఇంజక్షన్లు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. అవి కొనలేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రక్తశుద్ధి ఇంజక్షన్లు ఒక్కొక్క సారి కొరత వస్తోంది.
– నర్తు దుర్యోధన, కొండిపుట్టుగ,
కవిటి మండలం
లక్షన్నర ఖర్చు..
మాది తీరప్రాంతం సీహెచ్ కపాసుకుద్ధి. కష్టపడే కుటుంబంలోనే పుట్టాను. ఎందుకో ఈ అంతుచిక్కని వ్యాధి సోకింది. రెండునెలలుగా డయాలసిస్ చేస్తున్నారు.ఆరోగ్యశ్రీలో భాగంగా శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రిలో డయాలిసిస్‌లు అయ్యాయి. వైద్యం కోసం ఇప్పటి వరకు రూ.1.5 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. కవిటిలో డయాలసిస్ అయితే మా కష్టాలు తీరుతాయి.
– ఆర్.ముకుందరావు, సీహెచ్.కపాసుకుద్ధి, కవిటి మండలం

కిడ్నీ మందులకు కోత

కిడ్నీ మందులకు కోత

కిడ్నీ మందులకు కోత

కిడ్నీ మందులకు కోత

కిడ్నీ మందులకు కోత

కిడ్నీ మందులకు కోత
Comments
Please login to add a commentAdd a comment