సాక్షి, చైన్నె : లండన్‌లో చదువుకుంటున్న కోయంబత్తూరు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సమాచారం ఆదివారం కుటుంబీకులకు చేరింది. దీంతో మృతదేహం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. నీలగిరి జిల్లా ఊటీకి చెందిన శివకుమార్ కోయంబత్తూరు జిల్లా నరసింహనాయకన్ పాళయంలో నివాసం ఉన్నారు.
ఆయన కుమారుడు జీవన్(25) గత ఏడాది లండన్‌లో ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సు చదివేందుకు వెళ్లాడు. అక్కడి హాస్టన్ వర్సిటీలో చదువుతున్నాడు. ఈ పరిస్థితులలో రెండు రోజుల క్రితం లైబ్రరీకి వెళ్లిన జీవన్ కనిపించకుండాపోయాడు. అతడి కోసం గాలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో జీవన్ తీవ్ర గాయాలతో బర్మింగ్‌హాం కాలువలో పడి ఉండడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. లైబ్రరీకి వెళ్లిన జీవన బర్మింగ్‌హాం కాలువలో గాయాలతో పడి ఉండడం అనుమానాలకు దారి తీసింది.
అతడి మరణ సమాచారాన్ని ఆదివారం వేకువజామున లండన్‌లోని అధికారులు భారత రాయబార కార్యాలయం వర్గాల ద్వారా కుటుంబీకులకు తెలియజేశారు. దీంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. జీవన్ మృతదేహాన్ని కోయంబత్తూరుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి కుటుంబీకులు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment