శేఖర్‌బాబు
సాక్షి, చైన్నె: అయోధ్య రామాలయం ప్రారంభాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో అనేక చోట్ల వేడుకలను డీఎంకే పాలకులు అడ్డుకున్నారని, కోర్టు అక్షింతలు వేయడంతోనే కార్యక్రమాలు సజావుగా సాగినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఇందుకు కోర్టుకు కృతజ్ఞతలు అని పేర్కొంటూ, డీఎంకే పాలకులపై శివాలెత్తారు. పోలీసులను ఉసిగొల్పడం, అధికారులను బెదిరించడం తదితర చర్యలకు పాల్పడ్డారని మండి పడ్డారు. అదే సమయంలో టీ నగర్‌లోని కోదండరామాలయాన్ని సందర్శించినానంతరం తన ట్విట్టర్‌లో గవర్నర్ ఆర్‌ఎన్ రవి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఈ ఆలయంలోని సిబ్బంది, అర్చకులు అందరూ తీవ్ర ఆందోళనతో ఉన్నారని, ప్రభుత్వం బెదిరింపులతో అణగదొక్కే పనిలో ఉన్నట్టు ఆరోపించారు. ఈ పరిణామాలు రాజకీయంగా చర్చలకు దారి తీశాయి.
భట్టాచార్యుల వివరణ
కోదండ రామాలయంలో పరిణామాలపై గవర్నర్ ట్వీట్ దుమారానికి దారి తీయడంలో ఆ ఆలయ భట్టాచార్యులు మోహన్ మీడియా ముందుకు వచ్చారు. తాము ఎలాంటి ఆందోళనతో లేమని, ఇక్కడ అన్ని సజావుగానే ఉన్నట్టు వివరించారు. గవర్నర్ భద్రతా సిబ్బంది ఇచ్చిన ప్రోటోకాల్, భద్రతా పరంగా హడావుడి ఏర్పడిందని, అంందుకే తాము టెన్షన్‌కు గురైనట్టు పేర్కొన్నారు. అసలే ప్రత్యేక పూజలు, వేడుకలు జరుగుతున్న సమయంలో గవర్నర్ రాకతో సాధారణంగానే టెన్షన్ ఉంటుందని, అంత మాత్రాన తామేదో తీవ్ర ఆందోళనతో ఉన్నట్టు, తమ మీద ఎవరో ఒత్తిడి తెస్తున్నట్టు పేర్కొనడం సబబు కాదని తెలిపారు.
మంత్రి ఫైర్...
హిందూ దేవాదాయ శాఖ మంత్రి పి.కె.శేఖర్ బాబు మీడియా ముందుకు వచ్చారు. తాము ఎలాంటి వేడుకలను అడ్డుకోలేదని ఇప్పటికే స్పష్టం చేశామన్నారు. అయినా కేంద్ర మంత్రి ఓ వైపు, రాష్ట్ర గవర్నర్ మరో వైపు చూస్తుంటే ఆధ్యాత్మికంలో రాజకీయాన్ని మిళితం చేసినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికత ముసుగులో రాజకీయాలు చేస్తూ, తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని మండి పడ్డారు.
మండి పడ్డ సీఎం
ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం స్టాలిన్ ట్విట్టర్ ద్వారా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శాంతి వనంగా ఉన్న తమిళనాడులో రాజకీయ కుట్రలకు పదును పెట్టే పనిలో పడ్డట్టున్నారని బీజేపీ వర్గాలు, కేంద్ర మంత్రి, గవర్నర్‌పై శివాలెత్తారు. కోదండ రామాలయానికి వెళ్లిన గవర్నర్‌ను ఉద్దేశించి తమరిది భక్తినా... పగటి వేషమా.. అని ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రంలో బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి మొదలు రాష్ట్ర గవర్నర్ వరకు తాజాగా వ్యవహరించిన తీరు అనుమానాలకు దారి తీస్తోందన్నారు. భక్తి కార్యక్రమాలకు తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించకున్నా, సృష్టిస్తున్నట్టుగా నాటకాలను రచించి తమకు వ్యతిరేకంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపించడం సిగ్గు చేటు అని మండి పడ్డారు. బాధ్యత గల గవర్నర్ బీజేపీ నాయకుడిగా మరోమారు మారినట్టున్నారని మండి పడ్డారు. వదంతులు సృష్టించడంలో బీజేపీ ఒక పెద్ద యూనివర్సిటీగా మారిందని ధ్వజమెత్తారు.
శ్రీరాముడి ఆలయ ఆధ్యాత్మిక వేడుక రాజకీయ దుమారానికి దారి తీసింది. వేడుకలను అడ్డుకున్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఓ వైపు, కోదండరామాలయంలోని అర్చకులు, సిబ్బంది ఆందోళనతో ఉన్నారని గవర్నర్ ఆర్‌ఎన్ రవి మరో వైపు చేసిన వ్యాఖ్యలను డీఎంకే పాలకులు తీవ్రంగా పరిగణించారు. వీరి తీరును సీఎం స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. ఇది భక్తేనా...లేదా పగటి వేషమా.. అని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి ,
గవర్నర్ వ్యాఖ్యలపై చర్చ
సీఎం ఆగ్రహం
భక్తా... పగటి వేషమా...
అని వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment