తండ్రి మృతదేహంతో..
వేలూరు: తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని సన్‌ముగం వీధికి చెందిన గోవిందస్వామి(75), మేగలారాణి దంపతుల కుమారుడు అరవిందన్. ఇతను ఓ ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాల క్రితం మేగలారాణి మృతి చెందారు. దీంతో మనో వేదనతో ఉన్న అరవిందన్ విధులకు సక్రమంగా వెళ్లకుండా ఇంటిలోనే ఉంటూ ఏడాది క్రితం వాలంటీర్ రిటైర్డ్‌మెంట్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ఇంటిలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఐదు రోజుల క్రితం తన తండ్రి గోవిందస్వామి ఇంటిలోనే మృతి చెందినప్పటికీ ఈ విషయాన్ని ఎవరికీ తెలపకుండా ఇంటికి తాళం వేసుకొని ఇంటిలోనే ఉండిపోయినట్లు సమాచారం. చుట్టుపక్కల వారు గమనించి ఇంటిలో తరచూ ఏసీ ఆన్‌లోనే ఉందని ఇంటి నుంచి దుర్వాసన వస్తోదని, ఇంటికి లోపల తాళం వేసి ఉందని వందవాసి పోలీసులకు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగలగొట్టి ఇంటిలోకి వెల్లి చూడగా ఇంటిలో గోవిందస్వామి మృతి చెంది ఐదు రోజులు అవుతున్నట్లు ఈ కారణంగానే దుర్వాసన వస్తోందని గుర్తించారు. అరవిందన్ మతి స్థిమితం లేక పోవడంతోనే తండ్రి మృతి చెందిన విషయం కూడా తెలియకుండా అతనితో పాటు ఐదు రోజులు జీవించాడని తెలియవచ్చింది. వీటిపై రెవెన్యూ అధికారులు, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment