రైతులు మార్కెట్ యార్డుకు పంటను తీసుకెళ్తే.. అక్కడి వ్యాపారులు, నిపుణులు ఆ పంటను పరిశీలించి, వాసన చూసి, తేమ ఎంత ఉంటుందో అంచనా వేసి ధర కడతారు. అలా కాకుండా కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే యంత్రాలే.. కాస్త శాంపిల్ చూసి పంట నాణ్యత, తేమశాతం కచ్చితంగా చెప్పేస్తే రైతులకు ఎంతో ఊరట. పని త్వరగా పూర్తవుతుంది, మోసాలకు తావుండదు. వ్యాపారులు కొర్రీపెట్టి ధర తగ్గించేసే అవకాశం ఉండదు.
ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్), ఏజీనెక్ట్స్ స్టార్టప్ సంస్థల సహకారంతో ఇలా ఏఐతో పనిచేసే మెషీన్లతో మిర్చి పంట విక్రయాలు కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ (ఏఐ4ఏఐ)’కార్యక్రమంలో భాగంగా.. ‘సాగు–బాగు’పేరిట ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. దీనితో మొత్తం ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – ఖమ్మం వ్యవసాయం
మూడు యంత్రాలతో.. మూడు ప్రమాణాల గుర్తింపు
మిర్చి పంట నాణ్యతను తేల్చేందుకు ఏఐ ఆధారిత ‘విజియో బాక్స్, 7స్పెక్‌ఎక్స్ ప్రో, 7స్పెక్‌ఎక్స్ కనెక్ట్’గా పిలిచే మూడు యంత్రాలను వినియోగిస్తున్నారు. దీనిలో విజియో బాక్స్‌లో మిర్చిని పెడితే.. అది కాయ పరిమాణం, రంగు, మచ్చలు ఇతర అంశాలను పరిశీలించి నాణ్యతను నిర్ధారిస్తుంది.
♦ 100 గ్రాముల మిర్చిని పరిశీలించి నాణ్యత, రసాయనాల శాతం, తేమశాతాన్ని పరిశీలించడం కేవలం 20–25 నిమిషాల్లో పూర్తవుతుంది. అదే ప్రస్తుత సాధారణ పద్ధతిలో ఒక రోజు వరకు పడుతుంది.
♦ ఏఐ పరికరాల్లో పరిశీలన పూర్తయిన వెంటనే.. మిర్చికి ఏ, బీ, సీ, డీ అంటూ గ్రేడింగ్ ఇస్తుంది. ఈ వివరాలతో ఆటోమేటిగ్గా రైతుల ఫోన్ నంబర్లకు సంబంధిత ఎస్సెమ్మెస్ కూడా వస్తుంది.
♦ నిపుణులు, రైతుల సహకారంతో మిర్చికి సంబంధించిన వేలాది ఫొటోలను అప్‌లోడ్ చేసి ఏఐ ప్రోగ్రామ్‌ను రూపొందించామని.. దీనితో మంచి నిపుణులతో పోల్చితే 98శాతం కచ్చితత్వంతో ఏఐ యంత్రాలు పనిచేస్తున్నాయని ఏజీ నెక్ట్స్ స్టార్టప్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు.
పొలాల వద్దే మిర్చి కొనుగోళ్లు కూడా..
రాష్ట్ర ప్రభుత్వం ‘సాగు– బాగు’కార్యక్రమాన్ని మిర్చి సాగు మొదలు పంట అమ్మకం వరకు తగిన సాయం అందేలా రూపొందించింది. ఈ పైలట్ ప్రాజెక్టు కోసం.. ఎగుమతులకు పేరున్న ‘తేజ’రకం మిర్చిని సాగుచేసే ఖమ్మం జిల్లా కూసుమంచి వ్యవసాయ డివిజన్‌లోని ఏడు వేల మంది రైతులను ఎంపిక చేశారు. వారికి కొత్త విధానంపై అవగాహన కల్పించేందుకు 25 మంది సీఆర్పీలను నియమించారు.
రైతుల భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించి.. ఎరువులు, పురుగు మందుల వాడకం తదితర అంశాలపై తగిన సూచనలు అందించారు. రైతులు మిర్చి పంటను పొలాల వద్దే విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు. ఇందుకోసం రైతువేదికల్లో పంట నాణ్యత పరిశీలన కోసం ఏఐ మెషీన్లను ఏర్పాటు చేశారు. గత ఏడాది ప్రాజెక్టు అమలు చేసిన మూడు మండలాల్లో 150 టన్నుల మిర్చిని విక్రయించగా.. క్వింటాల్‌కు రూ.19,500 నుంచి రూ.22వేల వరకు ధర దక్కడం గమనార్హం.
పొలం వద్దే పంట విక్రయించా..
మిర్చి తోటలోనే పంటను విక్రయించా. సాగు–బాగు ప్రాజెక్టు ప్రయోజనకరంగా ఉంది. నేరుగా శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇచ్చారు. పంట నాణ్యతను రైతువేదిక వద్దే పరీక్షించి, తోటలోనే విక్రయించాను. మార్కెట్‌లో కంటే మెరుగ్గా క్వింటాల్‌కు రూ.22 వేల ధర లభించింది. కమీషన్, రవాణా చార్జీలు కూడా మిగిలాయి. వెంటనే సొమ్ము చెల్లించారు. – వి.రమేశ్, లింగారం తండా, కూసుమంచి మండలం
Comments
Please login to add a commentAdd a comment