సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సామాజిక వ్యవస్థలో సింహభాగం వాటా ఉన్న బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆ కులాల వారిని ఆకట్టుకునేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. సామాజిక వర్గాల వారీగా డిక్లరే షన్‌లు ప్రకటించి, మేనిఫెస్టోలో ఆయా డిక్లరేషన్ల లోని హామీలను పొందుపరిచే ఆలోచనలో ఉన్న హస్తం పార్టీ.. బీసీల కోసం ఏం చేయాలన్న దానిపై ముమ్మర కసరత్తు జరుపుతోంది. కొన్ని ప్రతిపాద నలపై పార్టీలో ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం వచ్చిందని, ఈ మేరకు బీసీ డిక్లరేషన్ ఎజెండా ఖరారైందని సమాచారం.
ఇందులో భాగంగా జనా భా ప్రాతిపదికన బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. కులగణన కోసం జాతీయ స్థాయిలో పార్టీ మద్దతు లభించినందున, ఆయా కులాల జనాభా లెక్కల మేరకు వారికి రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పాలని నిర్ణయించింది. టికెట్ల కేటాయింపులో గతానికి భిన్నంగా.. కనీసం 34 అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా, 50 వరకు టికెట్లు ఇస్తామని భరోసా ఇవ్వనుంది.
లోక్‌సభలో కనీసం రెండు అసెంబ్లీలు వారికే..
బీసీ నేతలకు టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది. 2014 ఎన్నికల్లో 31 స్థానాలను కేటాయించగా, 2018లో పొత్తుల కారణంగా అది 25కు తగ్గింది. అదే సమయంలో 2018 ఎన్నికల్లో ఓసీలకు 41, ఎస్సీలకు 17, ఎస్టీలకు 10, మైనార్టీ లకు 7 స్థానాలను కేటాయించింది. అయితే ఈ ఎన్నికల్లో బీసీ నేతలు కొందరికి ఆఖరి క్షణంలో సీట్లు కేటాయించడంతో సానుకూల ఫలితాలను రాబట్టడంలో విఫలమయ్యింది.
కాగా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రతి లోక్‌సభ స్థానంలో కనీసం రెండు సీట్లు బీసీ నేతలకు ఇస్తామనే హామీని బీసీ డిక్లరేషన్‌లో చేర్చనుంది. అయితే ఈ 34 స్థానాలకే పరిమితం కాదని, అవకాశాలు, సమీకరణలను బట్టి ఆ సంఖ్య 50 వరకు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల మాదిరి ఆఖరి నిమిషం వరకు వేచి ఉండకుండా వీలున్నంత ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని వారు స్పష్టం చేస్తుండటం గమనార్హం.
జీవితాలకు స్థిరత్వం కల్పించే దిశలో..
తాము అధికారంలోకి వస్తే బీసీ కులాలకు ఆర్థికంగా సాయం చేస్తామనే హామీని కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే ఏదో కొంత నగదు ఇచ్చి చేతులు దులుపుకోకుండా.. బీసీ వర్గాలకు చెందిన వారు, ముఖ్యంగా కుల వృత్తుల వారు వారి వారి జీవితాల్లో స్థిరపడి ఆత్మగౌరవంతో బతికే విధంగా చేయూతనిచ్చే పథకాలకు రూపకల్పన చేసి, బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించనుంది. ఇక బీసీల్లో బాగా వెనుకబడిన (ఎంబీసీ) కులాలు, సంచార జాతులను గుర్తించి వారికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
గాంధీభవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. బీసీలకు పార్టీ పదవులు, సీట్ల కేటాయింపులో తగినంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడే అధికారం దక్కుతుందని పలుమార్లు రుజువయ్యిందని.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు, తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది కూడా ఆ సూత్రాన్ని అనుసరించేనన్న అభిప్రాయానికి కాంగ్రెస్ నేతలు వచ్చారు.
మా పార్టీకి ఆ స్పృహ ఉంది..
బలహీన వర్గాలకు న్యాయం చేస్తామంటూ ఎన్నికలకు ముందు ప్రకటనలు చేయడమే కాదు. వాటి అమలు కోసం చర్యలు తీసుకుంటాం. బీసీల అభివృద్ధికి మేం కట్టుబడి ఉంటాం. మేం అధికారంలోకి వచ్చాక వారికి ఏ ఇబ్బంది వచ్చినా జవాబుదారీతనంతో వ్యవహరిస్తాం. లక్ష రూపాయలు ఇచ్చి కొట్లాడుకోండని చెప్పం. వారు ఆత్మగౌరవంతో బతికే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తెలంగాణ ఏర్పడింది సామాజిక కోణంలోననే స్పృహ మా పార్టీకి ఉంది.
– పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ బీసీ ముఖ్య నేత, మాజీ ఎంపీ
బీసీ కోటాతో పాగా..!
Published Wed, Jun 21 2023 12:58 AM | Last Updated on Wed, Jun 21 2023 12:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment