సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సభ్యుల నియామకంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించారా? లేదా? అన్నది పునః పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మూడు నెలల్లో కసరత్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆరుగురి నియామకాన్ని రద్దు చేయాలన్న ప్రశ్న ప్రస్తుత దశలో అవసరం లేదని అభిప్రాయపడింది. అలాగే టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 108ను రద్దు చేయలేమని తేల్చి చెప్పింది. ఆ ఆరుగురి నియామకం ప్రభుత్వ తాజా కసరత్తుకు లోబడి ఉంటుందని చెప్పింది.
అయితే టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం ఎలాంటి ఎంపిక ప్రక్రియ నిర్వహించకపోవడం మాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమిస్తూ 2021, మే 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో చేసింది. అయితే నియామకం అయిన వారిలో ఆరుగురు సభ్యులు ధన్‌సింగ్, బండి లింగారెడ్డి, సుమిత్రా ఆనంద్ తనోబా, కారం రవీందర్‌రెడ్డి, అరవిల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్ సత్యనారాయణ నిబంధనల మేరకు అర్హులు కాదని పేర్కొంటూ హైదరాబాద్ చెందిన ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి 2021లో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం 80పేజీల కీలక తీర్పు వెల్లడించింది. ఆరుగురి నియామక తీరును హైకోర్టు తప్పుబట్టింది.
’ఇష్టం వచ్చినవారికి ఎంపిక చేయడం కాదు’
రాజ్యాంగంలోని అధికరణ 316 ప్రకారం చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించి ఎలాంటి అర్హతలు, విధానాన్ని పేర్కొనకపోయినప్పటికీ కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చైర్మన్, సభ్యుల పదవులకు తగ్గట్టుగా అర్హత, సామర్థ్యం ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉన్నత రాజ్యాంగ పదవుల్లో నియామకాలు చేపట్టేముందు వారి పూర్వాపరాలను విచారించడంతోపాటు నిశితంగా పరిశీలన జరపాల్సి ఉందని తెలిపింది.
రాజ్యాంగంలోని అధికరణ 316 ప్రకారం కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం చేసే అధికారం గవర్నర్‌కు ఉందని, నియామక విధానం లేనంత మాత్రాన ప్రభుత్వం తన విచక్షణాధికారంతో ఇష్టం వచ్చినవారికి ఎంపిక చేయడం కాదని వ్యాఖ్యానించింది.
నిబంధనల మేరకే నియామకమన్న న్యాయవాది
‘సభ్యులపై వ్యక్తిగతంగా ఎవరికీ అభ్యంతరాలు లేవు. నియామకాలు చట్ట విరుద్ధం. నియమితులైన వారిలో రమావత్ ధన్‌సింగ్ జీహెచ్‌ఎంసీలో ఈఎన్‌సీగా పదవీ విరమణ పొందారు. లింగారెడ్డి ప్రైవేట్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సుమిత్ర ఆనంద్ జెడ్పీ స్కూల్లో తెలుగు టీచరు. ఎ.చంద్రశేఖర్‌రావు ఆయుర్వేదిక్ డాక్టర్. రవీందర్‌రెడ్డి రిటైర్డు డిప్యూటీ తహసీల్దార్. ఆర్.సత్యనారాయణ ఎమ్మెల్సీగా సేవలందించారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర సివిల్ సర్వీసెస్‌లో ఫస్ట్ క్లాస్ గెజిటెడ్ పోస్టుల్లో పని చేసిన వారే అర్హులు’అని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment