హైదరాబాద్, మే 25, 2024: ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన 18 నెలల పాప ప్రమాదవశాత్తు ఆలౌట్ సీసా మొత్తం తాగేసింది. ఆమె ఊపిరి అందక ఇబ్బంది పడుతుండటంతో తొలుత స్థానికంగా ఉన్న ఆస్పత్రికి, తర్వాత అక్కడి నుంచి రాయ్‌పూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వెంటిలేటర్ అమర్చారు. వెంటిలేటర్ సపోర్ట్ ఉన్నా ఆమె పరిస్థితి బాగుపడకపోగా, ఊపిరితిత్తులు పాడయ్యాయి. ఆమెకు సరిగా ఊపిరి అందలేదు. దాంతో రాయ్‌పూర్ ఆస్పత్రి వర్గాలు హైదరాబాద్ కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రిని సంప్రదించాయి.
ఇక్కడి నుంచి ఇద్దరు ఇంటెన్సివిస్టులు, ఒక పెర్ఫ్యూజనిస్టు, ఒక కార్డియాక్ సర్జన్, ఐసీయూ నర్సు కలిసి రాయ్‌పూర్‌కు విమానంలో వెళ్లారు. అక్కడ పరీక్షించిన తర్వాత పాపకు ఆలౌట్‌లోని హైడ్రోకార్బన్ల వల్ల కెమికల్ న్యూమోనైటిస్ అనే సమస్య తీవ్రంగా వచ్చిందని తెలిసింది. పాప శరీరానికి తగినంత ఆక్సిజన్ అందించడానికి వెంటిలేటర్ సరిపోకపోవడంతో, ఆమె కుడివైపు గుండె కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. దాంతో పాపకు ఎక్మో పెట్టి, ఆమె పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఎక్మోను రెండు విధాలుగా అమరుస్తారు. సాధారణంగా, కుడి తొడ వెయిన్ను తొలగించి, డీ-ఆక్సిజనేటెడ్ రక్తాన్ని తీసుకుంటారు, ఆపై ఎక్మో ద్వారా ఆక్సిజనేషన్ తర్వాత కుడి ఇంటర్నల్ జుగులర్ వెయిన్ ద్వారా ఊపిరితిత్తులను బైపాస్ చేస్తారు. గుండె కూడా దెబ్బతింటే, అంతర్గత జుగులర్ వెయిన్ నుంచి డీ-ఆక్సిజనేటెడ్ రక్తం తీసుకుని, దాన్ని ఎక్మో ద్వారా ఆక్సిజనేట్ చేస్తారు. మొత్తం శరీరానికి సరఫరా చేయడానికి అయోటా ఆర్క్ ద్వారా తిరిగి ప్రవేశపెడతారు. సాధారణంగా, ఫెమోరల్ వెయిన్ నుంచి రక్తం తీసుకుని, దాన్ని శుద్ధిచేసి ఫెమోరల్ ఆర్టెరీకి తిరిగి పంపుతారు. ఇది కొంత సులభం. అయితే, ఈ సందర్భంలో, పాప బరువు కేవలం 10 కిలోలు మాత్రమే ఉన్నందున, ఎక్మోను మెడ వద్ద అమర్చారు. ఇది ఊపిరితిత్తులు, గుండె రెండింటినీ బైపాస్ చేస్తుంది. ఈ విధానం చాలా అరుదు.
ఈ ప్రొసీజర్ తర్వాత పాపను తొలుత రోడ్డు మార్గంలో రాయ్‌పూర్‌కు విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి కొండాపూర్లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపను 9 రోజుల పాటు వీఏ-ఎక్మో మీద పెట్టాక పరిస్థితి మెరుగుపడింది. అప్పుడు మరో ఐదారు రోజులు వెంటిలేటర్ మీద ఉంచారు. అనంతరం హైఫ్లో, లోఫ్లో ఆక్సిజన్ పెట్టారు. ఈ మధ్యలో ఇన్ఫెక్షన్ రావడంతో యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేశారు. 18 రోజుల చికిత్స తర్వాత పాప పూర్తిగా కోలుకుంది. అన్ని రకాలుగా బాగుండటంతో గురువారం ఆమెను డిశ్చార్జి చేశారు.
వీఏ లేదా వీవీ ఎక్మోపై పిల్లలను పెట్టి ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం అత్యంత అరుదు. అందులోనూ ముఖ్యంగా మెడ వద్ద కాన్యులా పెట్టి తరలించడం భారతదేశంలోనే అత్యంత అరుదైనది. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా నమోదైన ఇలాంటి అతి కొద్ది కేసుల్లో ఇదొకటి. గుండె శస్త్రచికిత్సలు చేసిన తర్వాత పిల్లలకు ఎక్మో పెట్టడం కొంత సులభం. కానీ ఈ కేసులో మాత్రం పాపకు ఊపిరితిత్తులు, గుండె కూడా కొంత దెబ్బతిన్నాయి. పాప వయసు బాగా తక్కువ. దాంతో మెడ వద్ద కాన్యులేషన్ ద్వారా ఎక్మో పెట్టడం, ఎలాంటి సమస్యలు లేకుండా రాయ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానం ద్వారా తరలించడం చాలా సంక్లిష్టమైనది, సవాళ్లతో కూడుకున్నది. ఇది మొత్తం వైద్య బృందానికి ఉన్న అసాధారణ నైపుణ్యం, కచ్చితత్వాలకు నిదర్శనం.
ఈ సందర్భంగా కొండాపూర్లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రి పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విభాగాధిపతి డాక్టర్ 'పరాగ్ శంకర్రావు డెకాటే' మాట్లాడుతూ.. బాలికకు ఇచ్చిన చికిత్స వల్ల ఆమె గుండె, ఊపిరితిత్తులకు తగినంత మద్దతు లభించింది. కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాలు, అత్యున్నత నైపుణ్యం కలిగిన వైద్యబృందం వల్ల మాత్రమే ఆమెను ఎక్మో పెట్టి రాయ్‌పూర్ నుంచి విమానంలో హైదరాబాద్‌కు విజయవంతంగా తీసుకురాగలిగాం.
అనుభవజ్ఞులైన కార్డియాక్, వాస్క్యులర్ సర్జన్లు ఉండటంతో రక్తనాళాల్లోకి కాన్యులేషన్ సరిగ్గా జరిగింది. ఇప్పటివరకు ఈ ఆస్పత్రిలో ఇలా మెడ ద్వారా కాన్యులేషన్ పెట్టి వీఏ-ఎక్మో పెట్టిన కేసులు ఆరు ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో ఈ-పీసీఆర్ కూడా చేయగలరు. అంటే రోగిని ఎక్మో మీద పెట్టి, అదే సమయంలో కార్డియో రెస్పిరేటరీ మసాజ్ ఇవ్వగలరు. గడిచిన మూడేళ్లలో మొత్తం 15 సార్లు ఎక్మో పెట్టాము. ఇది భారతదేశంలోనే ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించి అత్యంత ఎక్కువ సార్లు. మెరుగైన ఫలితాల కోసం రక్తనాళాలను కూడా పునరుద్ధరించగలం. కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో చాలా అందుబాటు ధరల్లోనే ఎక్మో సేవలు అందుతాయి. లిటిల్ వన్ అనే ఫౌండేషన్ ద్వారా పేద రోగులకు ఆర్థిక సాయం కూడా అందిస్తాం. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అన్ని రకాల రోగులకు అత్యున్నత స్థాయి చికిత్సలు అందుతాయనడానికి ఈ కేసు ఒక నిదర్శనం” అని ఆయన చెప్పారు.
రాయ్‌పూర్ నుంచి పాపను తీసుకొచ్చిన బృందంలో పీఐసీయూ అధినేత డాక్టర్ పరాగ్ డెకాటే, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్టులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ అవినాష్ రెడ్డి, కార్డియాక్ సర్జన్ డాక్టర్ సందీప్ జనార్ధన్, పెర్ఫ్యూజనిస్టు దయాకర్, మేల్ నర్సు దీపుమోనే, సర్జికల్ సిస్టర్ నాగశిరీష ఉన్నారు. ఇక్కడకు తీసుకొచ్చిన తర్వాత పాపకు కిమ్స్ కడల్స్ పీఐసీయూ బృందం, నర్సులు, ఇతర సిబ్బంది సాయంతో సమగ్ర చికిత్సలు అందినట్లు డాక్టర్ పరాగ్ డెకాటే వివరించారు. ఈ వైద్య నిపుణులందరి సమిష్టి కృషి వల్ల, ఐకాట్ సంస్థ అందించిన ఎయిర్ అంబులెన్స్ సేవల వల్ల, తల్లిదండ్రులు సహకారం వల్ల పాప పూర్తిగా కోలుకోగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment