బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు, కోలాం సంఘం నాయకులు
ఆదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు కిసాన్ క్రెడిట్ ఖాతాలోకి ఏకంగా రూ. 60 కోట్ల డబ్బులు జమయ్యాయి. మరో ఇద్దరి ఖాతాల్లో రూ. లక్షల్లో డబ్బు వచ్చి చేరింది. ఈ మొత్తం సొమ్ములోంచి ఓ సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు, రైతులు దాదాపు రూ. 1.28 కోట్లు విత్‌డ్రా చేశారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు విత్‌డ్రా చేసిన డబ్బులను రివకరీ చేయడం.. దీంతో రైతులు, సంఘాలు శనివారం ఆందోళన చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సాంకేతిక సమస్య వల్ల..
ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న సల్పలగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ కోలాం రైతులైన కొడప భీంరావు, రమాబాయి, గంగాదేవిలకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆదిలాబాద్ బ్రాంచ్‌లో కిసాన్ క్రెడిట్ ఖాతాలున్నాయి. ఇందులో భీంరావు ఖాతాలో రూ. 60 కోట్లు, మరో ఇద్దరి ఖాతాల్లో రూ. లక్షల్లో డబ్బులు జమయ్యాయి. వీళ్లు ఓసారి డబ్బులు తీసుకునేందుకని పక్కనే ఉన్న మామిడిగూడ గ్రామంలోని కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్పీ)కు వెళ్లగా చాలా డబ్బులు ఉన్నట్టు తెలిసింది. దీంతో ఈ 3 ఖాతాల నుంచి కలిపి ఏకంగా రూ.కోటీ 28 లక్షలను సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు రమేశ్ విత్ డ్రా చేశాడు.
భీంరావుకు రూ.5.20 లక్షలు, గంగాదేవికి రూ.1.50 లక్షలు, రమాబాయికి రూ.9.50 లక్షలు ఇచ్చి మిగతా సొమ్మంతా తన దగ్గర పెట్టుకున్నాడు. 3 నెలల నుంచి ఈ తతంగం జరుగుతున్నా బ్యాంకు అధికారులు గుర్తించలేదు. తాజాగా గ్రామీణ బ్యాంకు హైదరాబాద్ అధికారులు విషయం తెలుసుకొని జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ ఖాతాలెవరివి, డబ్బు ఎక్కడి నుంచి డ్రా అవుతోందని గుర్తించారు.
సర్వీస్ పాయింట్ నిర్వాహకుడు, రైతుల గ్రామాలకు వెళ్లి నిర్వాహకుడి నుంచి రూ.80 లక్షలు, రైతుల నుంచి బంగారం తదితర వస్తువులను పట్టుకొచ్చారు. దీంతో రైతులు, ఆదివాసీ కోలాం సంఘం నాయకులు ఆదిలాబాద్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మెయిన్ శాఖ ముందు ఆందోళనకు దిగారు. దీనిపై మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ వివేక్‌ను వివరణ కోరగా సాంకేతిక సమస్యల వల్ల రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రికవరీ చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment