చిన్నచిన్న అనారోగ్య కారణాలు సాకుగా చూపుతూ విధులకు డుమ్మా. వీరిలోనూ ఉన్నత విద్యావంతులే అధికం.. ఒక్క వకీల్‌పల్లిగనిలోనే 60 మంది దాకా గైర్హాజరుతో ఉద్యోగాలు కోల్పోవద్దంటున్న అధికారులు
గోదావరిఖని: సింగరేణి భూగర్భగనుల్లో పనిచేసేందుకు యువత ఎక్కువగా మక్కువ చూపడం లేదు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందినవారే గైర్హాజరు అవుతున్న వారిలో అధికంగా ఉన్నారు. బీటెక్, ఎంటెక్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ లాంటి ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం వచ్చిన ఉద్యోగాన్ని నామోషిగా భావించేవారు
కొందరయితే, ఇక్కడ వర్క్ కల్చర్ ఇష్టం లేక, సిగరేణి ఆఫీసుల్లో అవకాశం రాక, లైట్ జాబ్‌ల కోసం పరుగులు తీసేవారు మరికొందరు.
మూడు షిఫ్ట్‌ల విధానానికి ఇష్టపడినవారు ఇంకొందరు. సింగరేణిలో చేరిన కొద్దిరోజులకే విధులకు డుమ్మా కొట్టేవారి సంఖ్యా క్రమక్రమంగా పెరుగుతోంది. పలువురు కుటుంబసభ్యులు,తల్లిదండ్రుల అనారోగ్య కారణాలు సాకుగా చూపుతూ గైర్హాజరవుతున్నారు. ఒక్క వకీల్‌పల్లిగనిలో గైర్హాజరు అయిన వారు 60 మంది దాకా ఉన్నారు.
ఆర్జీ–1 ఏరియా జీడీకే–11గనిలో ఓ యువ కార్మికుడు 2022 ఏప్రిల్‌లో ఉద్యోగంలో చేరాడు. 15 నెలల్లో 19రోజులు మాత్రమే డ్యూటీ చేశాడు. గైర్హాజర్ కౌన్సెలింగ్‌కు హాజరై తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేక డ్యూటీకి రావడం లేదని కారణంగా చెప్పాడు. దీంతో గైర్హాజర్ కార్మికుల జాబితాలో ఆయన చేరాడు.
జీడీకే–11గనిలో బదిలీ వర్కర్‌గా 2015లో సింగరేణి విధుల్లో చేరాడు. ఐదేళ్ల నుంచి కనీసం వంద మస్టర్లు చేయలేదు. దీంతో ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసే పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగోలేకే తాను డ్యూటీకి రావడం లేదని చెబుతున్నాడు.
‘ఆర్జీ–2 ఏరియా వకీల్‌పల్లిగనిలో పనిచేస్తున్న యువ కార్మికుడు 2015లో కారుణ్య నియామకం ద్వారా సంస్థలో చేరాడు. డిగ్రీ పూర్తి చేసిన యువకుడికి సంబంధించి గడిచిన 8 ఏళ్లలో వంద మçస్టర్లు మాత్రమే నమోదయ్యాయి. తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే డ్యూటీకి రాలేకపోతున్నానని అంటున్నాడు.
..ఆర్జీ–2 లో వకీల్‌పల్లిగనికి చెందిన ఒకరు 2018లో ఉద్యోగంలో చేరారు. కనీసం అతను 60 డ్యూటీలు కూడా చేయలేదు. దీంతో సింగరేణి యాజమాన్యం గైర్హాజర్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. ఇటీవల గనిలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు.
కారుణ్య నియామకాలు ఇలా
సింగరేణిలో పనిచేసే కార్మికుడు మెడికల్ ఇన్వాలిడేషన్ (అనారోగ్య కారణం)తో విధుల నుంచి తప్పుకుంటే వారి స్థానంలో కొడుకుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇస్తున్నారు. తెలంగాణ వచ్చాక 2015 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటివరకు 11,541మంది యువత ఉద్యోగాల్లో చేరారు. విధుల్లో చేరిన నాటి నుంచి మూడేళ్ల పాటు పనిచేస్తే వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. అయితే సింగరేణిలో 12 ఏరియాల్లో గత మూడేళ్లలో కనీసం 100 మస్టర్లు కూడా చేయని కార్మికులు 1377 మంది ఉన్నారు.
పూర్తిస్థాయి యాంత్రీకరణ ఉన్నా..
పదేళ్ల కిందట అయితే భూగర్భగనిలోకి దిగి పైకి ఎక్కడమే ఎంతో శ్రమగా ఉండేది. తట్టాచెమ్మస్ పూర్తిగా కనుమరుగైపోయింది. సెమీ మెకనైజ్‌డ్, ప్రస్తుతం పూర్తిస్థాయి యాంత్రీకరణ కొనసాగుతోంది. మ్యాన్‌రైడిండ్, చైర్‌కార్, చైర్‌లిఫ్ట్‌లాంటి విధానం ద్వారా భూగర్భగనిలోని పనిస్థలాల వద్దకు కార్మికులను తీసుకెళ్లి, తిరిగి తీసుకొస్తున్నారు. దీంతో కార్మికులకు నడక శ్రమ చాలా తగ్గింది. అయినా చాలామంది యువ కార్మికులు ఆఫీస్ కార్యాలయాలు, ఓసీపీలు, గనిపైన ఉన్న లైట్‌జాబ్ కోసం పైరవీలు చేస్తున్నారు.
ఏటా వంద మస్టర్లు తప్పనిసరి
సంస్థలో బదిలీ వర్కర్లుగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు ఏటా భూగర్భ గనుల్లో అయితే 190 మస్టర్లు, సర్‌ఫేజ్‌లో అయితే 240 మస్టర్లు ఉండాలి. అవి ఉంటేనే వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. ఏటా వంద మస్టర్ల చొప్పున మూడేళ్ల పాటు 300 మస్టర్లుంటే ఉద్యోగానికి గ్యారెంటీ. లేనిపక్షంలో యాజమాన్యం నిబంధనల ప్రకారం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తుంది.
వాస్తవ కారణాలు ఉంటే సంస్థ సహకరిస్తుంది
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఏర్పడింది. సింగరేణిలో చేరిన యువత చిన్నకారణాలతో విధులకు గైర్హాజరవుతూ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. ఏవైనా వాస్తవ కారణాలుంటే సంస్థ కూడా సహకరిస్తుంది. సంస్థలో యువకార్మికులు పెరుగుతున్న క్రమంలో సంస్థ మరింత లాభాల బాటలో పయనించాలి. కారణాలేవైనా సంస్థ ఉద్యోగం పోగొట్టుకుని ఉద్యోగితో పాటు కుటుంబం వీధిన పడటం సరికాదు. –బలరాం, డైరెక్టర్(పా), సింగరేణి
Comments
Please login to add a commentAdd a comment