ఏఈఈ నిఖేష్‌ అక్రమార్జనపై ఏసీబీ ఫోకస్‌.. బినామీగా వ్యవహరించాడా? | ACB Custody Taken By AEE Nikesh Kumar Over Money Laundering Case | Sakshi
Sakshi News home page

ఏఈఈ నిఖేష్‌ అక్రమార్జనపై ఏసీబీ ఫోకస్‌.. బినామీగా వ్యవహరించాడా?

Published Thu, Dec 12 2024 12:44 PM | Last Updated on Thu, Dec 12 2024 2:58 PM

 ACB Custody Taken By AEE Nikesh Kumar Over Money Laundering Case

సాక్షి, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖకు చెందిన ఏఈఈ నిఖేష్‌ కుమార్‌ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేష్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేయడంతో ఆయన ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. కస్టడీలో భాగంగా నాలుగు రోజుల పాటు ఆయనను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. విచారణ కోసం గురువారం నిఖేష్‌ను ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

నిఖేశ్ కుమార్ భారీ అక్రమార్జనపై కూపీలాగే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, అతను మరెవరికైనా బినామీగా వ్యవహరించాడా? అనే విషయాన్నీ తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవానికి పదేళ్ల క్రితమే నిఖేష్‌ కుమార్ ఉద్యోగంలో చేరినా గండిపేట ఏఈఈగా పోస్టింగ్ వచ్చాకే అతడి అక్రమార్జన ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కీలకమైన ఇబ్రహీంపట్నం, మేడ్చల్, గండిపేట ఏఈఈగా పోస్టింగ్ దక్కడంతో వసూళ్లే ధ్యేయంగా పనిచేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. నిఖేష్‌ కుమార్ అక్రమ దందా వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల ప్రాథమిక విచారణలో రోజుకు తక్కువలో తక్కువ రూ.2 లక్షలకుపైగా సంపాదించినట్లు గుర్తించారు. ఉద్యోగంలో చేరిన కొద్దిరోజుల్లోనే అక్రమార్జనకు అలవాటు పడిన నిఖేశ్ కుమార్‌తోపాటు సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు చేసిన దాడిలో బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. రూ.17.73 కోట్ల అక్రమాస్తులు, ఒక లాకర్‌లోనే కిలోన్నర బంగారు ఆభరణాలు. వీటన్నింటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లపైమాటే. వీటన్నింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన స్నేహితుడి బ్యాంకు లాకర్లో ఉన్న డబ్బులను కూడా అధికారులు తీసుకున్నారు.

నీటి పారుదల శాఖలో 2013లో చేరిన నిఖేష్‌కుమార్ మొదట వరంగల్ జిల్లాలో పనిచేసి తర్వాత వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యాడు. మూడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాకు వచ్చాక నాలాలు, జలాశయాల పరిధిలో ఎఫ్​టీఎల్​, బఫర్‌జోన్లలో అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డాడు. దరఖాస్తులను ఫార్వర్డ్‌ చేసేందుకు, వాటిని క్లియర్ చేయించేందుకు భారీగా వసూళ్లు చేసి ఉన్నతాధికారుల తరపున వాటాలనూ సేకరించి, ముట్టజెప్పినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఉన్నతాధికారుల పాత్రపైనా ఏసీబీ ఆరా తీస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement