సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ మరో వారం రోజుల కస్టడీ కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలకృష్ణ ఆమోదించిన ఫైల్స్, బినామీ ఆస్థులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. మరోవైపు.. బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలను అధికారులు వెల్లడించారు.
కాగా, లేఅవుట్ అనుమతుల కోసం బాలకృష్ణ భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు. అప్లికేషన్లలో తప్పులు ఉన్నాయని లాభాలు పొందినట్టు తెలిపారు. ప్లాట్స్ నిర్మాణాల్లో విల్లాలను సైతం లంచంగా బాలకృష్ణ తీసుకున్నాడు. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగినట్టు స్పష్టం చేశారు. హెచ్‌ఎండీఏలోని మూడు జోన్లపై బాలకృష్ణకు మంచిపట్టు ఉందని గుర్తించారు. ఇక, హెచ్‌ఎండీఏలోని కీలక పోస్టులో బాలకృష్ణ సుదీర్ఘంగా పనిచేశారు. మరోవైపు.. బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నాక ఏసీబీ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనుంది. ఇదే సమయంలో బాలకృష్ణకు సహాయం చేసిన అధికారులపై కూడా విచారించనున్నారు.
ఇదిలా ఉండగా.. వట్టి నాగులపల్లిలో ప్రభుత్వ భూముల యాజమాన్యం, వినియోగ హక్కుల మార్పిడిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్రమాలు జరిగిన భూముల ఫైల్స్‌పై సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. వట్టి నాగులపల్లిలో ఎలక్షన్ కోడ్‌కు కొద్దిరోజుల ముందే పెద్ద ఎత్తున భూ వినియోగ మార్పిడి జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా లేకపోయినా ఫైల్స్ ఆమోదంలో బాలకృష్ణ పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇక, హెచ్ఎండీఏ నుండి ఆరు నెలల క్రితమే బదిలీ అయి తెలంగాణ రేరా సెక్రటరీగా బాలకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో, బాలకృష్ణ హయాంలో ఇచ్చిన అక్రమ అనుమతులపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. అయితే, బాలకృష్ణ తన దగ్గరి బంధువులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించుకుని అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. కొందరు పొలిటికల్ లీడర్లు కూడా అక్రమాలకు మధ్యవర్తులుగా వ్యవహరించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment