సాక్షి, హైదరాబాద్: ట్రబుల్ షూటర్ దిగ్విజయ్‌సింగ్ తెలంగాణకు వచ్చి వెళ్లాక పార్టీలో ఏం జరుగుతుందనే ఆసక్తి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. టీపీసీసీలో నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం అధిష్టానం దూతగా వచ్చిన ఆయన ఏం చేస్తారన్నది ఇప్పుడు కాంగ్రెస్ కేడర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రానుంది. దిగ్విజయ్ పర్యటన అనంతరం హైలెవల్ కమిటీ ఆయనతో సమావేశమవుతుందని, ఆ సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి రాష్ట్ర నేతలను ఒప్పించాకే దిద్దుబాటు చర్యలు ప్రారంభమవుతాయని సమాచారం.
అయితే అందరినీ మూకుమ్మడిగా రమ్మంటారా? లేక విడివిడిగా పిలిచి మాట్లాడతారా? అన్నదానిపై స్పష్టత రాలేదు. మొత్తంమీద త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్‌లో దిద్దుబాటు చర్యలు ప్రారంభమవుతాయని, మొదటగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ స్థానంలో కొత్తగా సీనియర్ నాయకుడిని పంపిస్తారనే చర్చ జరుగుతోంది.
ఆ మాటల ఆంతర్యమేంటో?
కాంగ్రెస్ అధిష్టానం దిగ్విజయ్‌కు పెద్ద బాధ్యతే అప్పగించిందని ఆయన మాట్లాడిన మాటలను బట్టి అర్థమవుతోంది. ఎవరూ పార్టీ విషయాలను బహిరంగంగా మాట్లాడితే ఎంత పెద్ద నాయకుడినైనా ఉపేక్షించేది లేదని దిగ్విజయ్ హెచ్చరించడంపై పలు చర్చలు జరుగుతున్నాయి.
సీనియర్లను కంట్రోల్ చేయడంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా జరుగుతోంది. ఇక పీసీసీ అధ్యక్ష పదవిని సమర్థంగా నిర్వహించడం గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవిని నిర్వర్తించడంలో వయసుతో పనిలేదని, అనుభవం లేకపోయినా అందరినీ కలుపుకొని వెళ్తే విజయవంతం కావచ్చని ఆయన ఇచ్చిన సలహా రేవంత్ వ్యవహారశైలిని ఉద్దేశించి చేసిందేనని కాంగ్రెస్ నేతలంటున్నారు.
ఉన్నతస్థాయి కమిటీకి దిగ్విజయ్ నివేదిక!
తన రెండు రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితులను అవగాహన చేసుకున్న దిగ్విజయ్‌సింగ్... పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. పలు రాష్ట్రాల్లోని అంతర్గత అంశాలను పరిష్కరించేందుకు ఏఐసీసీ ఏర్పాటు చేసుకున్న ఉన్నత స్థాయి కమిటీకి ఆయన నివేదిక ఇస్తారని తెలుస్తోంది.
హైదరాబాద్ రావడానికి ముందే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ ముఖ్య నేతలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌తోపాటు ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ వచ్చాక 54 మందికిపైగా నేతలను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి దిగ్విజయ్ ఇచ్చిన నివేదికలో ఆయన పలు సిఫారసులు కూడా చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సిఫారసుల అమలుపై చర్చించడం కోసమే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులను త్వరలో ఢిల్లీకి పిలిచే అవకాశముందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment