సాక్షి, హైదరాబాద్: ఆల్ఫా, బీటా, డెల్టా, గామా, కప్పా, ల్యామ్డా.. ఇవి ఇప్పటివరకు ప్రాచుర్యం పొందిన కరోనా రూపాంతరితాలు. వీటిలో డెల్టా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికించే స్థాయికి చేరుకుంది. ఒకవైపు భారత్‌లో మూడోసారి కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతుండగా.. అమెరికాలో కూడా దీని కారణంగా నమోదవుతున్న కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ఒకే ఒక్క నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డెల్టాను వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ (వీవోఐ) స్థాయి (జాగురుకతతో వ్యవహరించాల్సిన స్థాయి) నుంచి వేరియంట్‌ఆఫ్ కన్సర్న్ (వీవోసీ) స్థాయి (ఆందోళన కలిగించే స్థాయి)కి చేర్చేసింది. ఒకరకంగా రెండో ప్రమాద హెచ్చరిక అన్నమాట. అదృష్టవశాత్తూ ఇంతకంటే తీవ్రమైన లక్షణాలు కలిగించే, టీకాలకు లొంగని కొత్త రూపాంతరితమేదీ ఇంతవరకు బయటపడలేదు. కానీ డెల్టా ఒక హెచ్చరిక మాత్రమేనని.. భవిష్యత్తులో మరిన్ని రూపాంతరితాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
డెల్టా తొలి మజిలీయే..
ఒకవైపు డెల్టా రూపాంతరితం వేగంగా విస్తరిస్తూంటే, ఇంకోవైపు చాలా దేశాల్లో కోవిడ్ నిబంధనల సడలింపు కూడా అంతే వేగంగా జరిగిపోతోంది. అయితే ఈ విషయంలో మరికొంత జాగురుకతతో వ్యవహరిస్తే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరిస్తోంది. వైరస్ పరిణామ క్రమంలో డెల్టా తొలి మజిలీ మాత్రమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. కేసులు పెరిగిపోతుండటం, నిబంధనల సడలింపులు, టీకా వేగం తగ్గుతుండటం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సిద్ధం చేసిన మోడలింగ్ ప్రకారం.. ప్రస్తుత పరిస్థితులు కొత్త రూపాంతరితాలు మరిన్ని పుట్టుకొచ్చేందుకు అనువైనవన్నది వీరి తాజా అంచనా. అమెరికాలో ఆరు వారాల వ్యవధిలో డెల్టా కారణంగా వచ్చిన కేసులు పది శాతం నుంచి ఏకంగా 83 శాతానికి పెరిగిపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.
టీకాలు వేసుకున్న వారిపైనా..
కోవిడ్ నుంచి రక్షణకు తయారు చేసుకున్న టీకాలు ఇప్పటివరకు మెరుగైన రక్షణ కల్పిస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో కొన్నిచోట్ల టీకాలు వేసుకున్న వారికీ వైరస్ సోకుతుండటం ఎక్కువ అవుతోంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్–వీ, ఫైజర్, మోడెర్నా వంటి పలు కంపెనీలు సిద్ధం చేసిన వ్యాక్సిన్లు డెల్టాను సైతం సమర్థంగా అడ్డుకోగలవని ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వస్తోందంటే.. వైరస్ కొద్దోగొప్పో బలపడుతున్నట్లుగానే పరిగణించాలని శాస్త్రవేత్తలు అంటున్నారు.
భారత్‌లో లక్ష్యానికి దూరంగా..
ఈ ఏడాది చివరికల్లా అర్హులైన దేశ జనాభా మొత్తానికీ వ్యాక్సిన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జనవరి 16వ తేదీ టీకా కార్యక్రమం మొదలు కాగా ఇప్పటివరకు మొత్తం 47.2 కోట్ల మందికి టీకాలిచ్చారు. ఇందులో రెండు డోసులు పూర్తి చేసుకున్న వారి సంఖ్య కేవలం 10.40 కోట్లు మాత్రమే. అంటే జనాభాలో కోవిడ్ నుంచి పూర్తిస్థాయి రక్షణ పొందిన వారు కేవలం 7.6 శాతం మంది మాత్రమే. జూలై నుంచి మొదలుపెట్టి డిసెంబర్ వరకు టీకాలు బాగా అందుబాటులో ఉంటాయని, రోజుకు కోటిమందికి టీకాలివ్వాలన్న లక్ష్యాన్ని అందుకోగలమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ముందుగా అంచనా వేసినట్లు భారత్ బయోటెక్ తన ఉత్పత్తి లక్ష్యాలను అందుకోలేకపోవడం వల్ల టీకా కార్యక్రమం మందగించిందని, జాతీయ టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.
చదవండి: థర్డ్‌వేవ్: పిల్లలపై ప్రభావం ఎలా ఉండొచ్చు?
ప్రపంచ వ్యాప్తంగానూ ఇంతే..
ప్రపంచవ్యాప్తంగానూ టీకా కార్యక్రమం ఏమంత గొప్పగా సాగడం లేదు. అగ్రరాజ్యం అమెరికాలో సగం జనాభా పూర్తిస్థాయిలో టీకాలు పొందింది. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇది 35 శాతంగా ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో 60 శాతానికిపైబడి ఉంది. ఈ నేపథ్యంలోనే అవసరమైతే మళ్లీ కోవిడ్ నిబంధనలు విధించాల్సిన పరిస్థితి రావచ్చునన్న హెచ్చరికలు అక్కడ వినపడుతున్నాయి. ఇక పేదదేశాల్లో చాలా తక్కువమంది టీకాలు వేయించుకున్నట్లు తెలుస్తోంది.
అయినా.. వారి కంటే 25 రెట్లు తక్కువే
ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఆసుపత్రి పాలయ్యేందుకు, తీవ్రమైన లక్షణాలు ఎదుర్కొనేందుకు ఉన్న అవకాశాలు టీకాలు వేయించుకోని వారి కంటే 25 రెట్లు తక్కువ. అయితే ఈ రక్షణ ఎంతమందికి కల్పించామన్న అంశంపై కొత్త రూపాంతరితాలు పుట్టుకొచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. జనాభాలో కనీసంఅరవై శాతం మందికి టీకాలిస్తేనే కొత్తవి పుట్టుకొచ్చే అవకాశాలు తగ్గుతాయని సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ఒకటి చెబుతోంది.
వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్
వ్యాధి వ్యాప్తి, లక్షణాల తీవ్రత, గుర్తింపు, చికిత్సలకు లొంగకపోవడం వంటి అనేక అంశాలను ప్రభావితం చేయగల జన్యుపరమైన మార్పులు ఉన్న రూపాంతరితాలను వీవోఐలుగా పరిగణిస్తారు. టీకా లేదా గతంలో సోకిన వైరస్‌ల కారణంగా ఉత్పత్తి అయిన యాంటీబాడీల ప్రభావం కొంచెం తక్కువగా ఉండే రూపాంతరితం. కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగేందుకు కారణమనేందుకు సాక్ష్యాలున్నా ఈ కోవకే చెందుతుంది.
వేరియంట్ ఆఫ్ కన్సర్న్
కేసుల సంఖ్య గణనీయంగా పెరగవచ్చు. లక్షణాలు తీవ్రంగా ఉండి.. ఆసుపత్రి బారిన పడేవారి సంఖ్య, మరణాలు ఎక్కువవుతాయన్న అంచనాలు ఉన్న రూపాంతరితాలను వీవోసీలుగా పరిగణిస్తారు. టీకా లేదా గతంలో సోకిన వైరస్‌ల కారణంగా పుట్టిన యాంటీబాడీల ప్రభావం చాలా తక్కువగా ఉన్న రూపాంతరితాలు కూడా ఈ కోవకి చెందుతాయి. వైరస్ నియంత్రణకు ఇస్తున్న చికిత్స తక్కువ ఫలితాలు ఇస్తున్నా.. వైరస్‌ను గుర్తించే పరీక్షలు విఫలమవుతున్నా దాన్ని ప్రమాదకరమైన రూపాంతరితంగా గుర్తిస్తారు.
వేరియంట్ ఆఫ్ హై కాన్‌సీక్వెన్స్
విపరీత పరిణామాలకు తావివ్వగల రూపాంతరితాలను వేరియంట్ ఆఫ్ హై కాన్‌సీక్వెన్స్ అని పిలుస్తారు. అదృష్టవశాత్తూ కోవిడ్–19 కారక వైరస్‌లలో ఇప్పటివరకు ఇలాంటిది ఒకటి కూడా లేదు. వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌కు ఉన్న లక్షణాలు అన్నీ ఉండి.. అదనంగా ఆసుపత్రులపై విపరీతమైన భారం మోపగల అవకాశం ఉన్న రూపాంతరితాలు ఈ కోవకు చెందుతాయి. అంతేకాకుండా వైరస్‌ను గుర్తించేందుకు ప్రస్తుతం చేస్తున్న ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు పూర్తిగా విఫలమయ్యే అవకాశం ఉన్నా, టీకా సామర్థ్యం గణనీయంగా తగ్గినా, టీకాలేసుకున్నా ఎక్కువమందికి వ్యాధి సోకినా, టీకా వేసుకున్నా తీవ్రమైన వ్యాధి లక్షణాలు కనిపించినా దాన్ని విపరీత పరిణామాలకు అవకాశమున్న రూపాంతరితంగా గుర్తిస్తారు. ఇలాంటి రూపాంతరితాలను గుర్తిస్తే... ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ విషయాన్ని నోటిఫై చేయాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు 4 వీవోఐ, 4 వీవోసీ
ఏడాదిన్నర కాలంలో కోవిడ్ కొన్ని వేల రూపాల్లోకి మారి ఉంటుంది. వీటిల్లో అత్యధికం పెద్దగా అపాయం లేనివే. ఒకవేళ ప్రమాదం ఉందని అనుకుంటే.. దాని తీవ్రత, లక్షణాలను బట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అన్న రెండు వర్గాలుగా విభజిస్తుంది. తాజాగా అమెరికా ఇంకో అడుగు ముందుకేసి వేరియంట్ ఆఫ్ హై కాన్‌సీక్వెన్స్ (వీవోహెచ్‌సీ) (విపరీత పరిణామాలకు కారణమయ్యేది) అని ఇంకో వర్గాన్ని జోడించింది. అయితే తొలి రెండు వర్గాల రూపాంతరితాలకు మాత్రమే గ్రీకు అక్షరమాలలోని అక్షరాలు ఆల్ఫా, బీటా, గామా వంటి పేర్లను కేటాయిస్తారు.
తొలిసారి వైరస్‌ను గుర్తించిన దేశం పేరుతో పిలవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని డబ్ల్యూహెచ్‌ఓ ఈ ఏర్పాటు చేసింది. గ్రీకు అక్షరమాలలో మొత్తం 24 అక్షరాలు ఉంటే.. ఇప్పటివరకు 11 రూపాంతరితాలకు పేర్లు పెట్టారు. వీటిల్లో నాలుగు వీవోఐ కాగా.. నాలుగు వీవోసీ ఉన్నాయి. ఎప్సిలాన్, జెటా, తీటా పేర్లు కొంత కాలం క్రితం మూడు వేరియంట్లకు కేటాయించినప్పటికీ, ప్రమాదం తక్కువని తరువాత స్పష్టమైంది. ఈ లెక్కన ఇంకో పదమూడు పేర్లు కొత్త రూపాంతరితాలకు పెట్టేందుకు అవకాశం ఉందన్నమాట.
పేరు | శాస్త్రీయ నామం | తొలిసారి గుర్తించింది | డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు |
ఈటా | బి.1.525 | డిసెంబర్ 2020, పలుదేశాల్లో | 17, మార్చి 2021 |
అయోటా | బి.1.526 | నవంబర్ 2020, అమెరికాలో | 24, మార్చి 2021 |
కప్పా | బి.1.617.1 | అక్టోబర్ 2020, భారత్‌లో | 04, ఏప్రిల్ 2021 |
ల్యామ్డా | సి.37 | డిసెంబర్ 2020, | పెరులో 14, జూన్ 2021 |
Comments
Please login to add a commentAdd a comment