సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బైక్‌ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఆరునెలల్లోగా రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. పర్యటనలు, ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలన్న జాతీయ నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా వీటిని ఖరారు చేశారు.
ఈ నెల 21న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఈ ర్యాలీలను ప్రారంభించనున్నారు. ఆయన కూడా ర్యాలీలో పాల్గొననున్నారు. మొదటివిడతగా ప్రతీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రెండేసి అసెంబ్లీ స్థానాల్లో 15 రోజులపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత కొన్నిరోజులు విరామం ఇచ్చి రెండోవిడత బైక్‌ర్యాలీలు చేపట్టనున్నారు. మొత్తంగా నాలుగు దశల్లో యావత్ రాష్ట్రం చుట్టివచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.
ఆగస్ట్ 2 నుంచి సంజయ్ ఆధ్వర్యంలో ‘ప్రజా సంగ్రామయాత్ర–3’, ఆ తర్వాత పాదయాత్ర–4ను కొనసాగిస్తూనే, బైక్ ర్యాలీలను కొనసాగించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకు ఈ ర్యాలీలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు సాగిన 2 విడతల పాదయాత్రలో చోటు లభించని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముందుగా ఈ ర్యాలీలను నిర్వహించాలని నిర్ణయించారు.
అన్ని గ్రామాలను సందర్శించేలా...
ఈ బైక్ ర్యాలీల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలను సందర్శించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఒక్కో బైక్‌ర్యాలీకి ఒక సీనియర్ నేత నాయకత్వం వహిస్తారు. ఆ నేతతోపాటు ఇతర ప్రాంతానికి చెందిన మరోనేత, సంబంధిత నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్న నాయకుడు లేదా గతంలో పోటీచేసిన అభ్యర్థి, ఇతర నేతలు, కార్యకర్తలు కలిసి కనీసం వందమంది బైక్‌లతో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు .
Comments
Please login to add a commentAdd a comment