
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే, రాజాసింగ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెడిపోయిన తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని తీసుకొని ఎమ్మెల్యే శుక్రవారం ప్రగతి భవన్ వద్దకు వెళ్లారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ మార్చాలని, లేదంటే ఆ వాహనం మీరు తీసుకోవాలంటూ ప్రగతిభవన్ వద్ద వదిలేసి రాజాసింగ్ వెళుతున్నారు.
ఇది గమనించిన పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మీడియా కంట పడకుండా పూర్తిగా మూసేసిన పోలీస్ డీసీఎంలో అసెంబ్లీకి తీసుకొచ్చారు. కాగా గతంలో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆయనను అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
మొరాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ కారు
కాగా రాజాసింగ్ బుల్లెట్‌ప్రూఫ్ వాహనం మరోసారి మొరాయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ నుంచి గురువారం బుల్లెట్‌ప్రూఫ్ వాహనంలో ఇంటికి వెళ్తుండగా ముందుభాగం టైరు ఊడిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ధూల్‌పేట ప్రాంతంలో వాహనం నుంచి భారీ శబ్దం వచ్చి ముందువైపు టైరు బయటకు రావడంతో డ్రైవర్ చాకచక్యంగా కారును నిలిపాడు.
దీంతో రాజాసింగ్ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. వాహనం నెమ్మదిగా వెళ్లడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూజజ ఈ ఘటన చూసైనా హోంమంత్రి మహమూద్ అలీ, పోలీసు ఉన్నతాధికారులు సిగ్గుపడాలన్నారు. వెంటనే తనకు వాహనం మార్చాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment