
సాక్షి, హైదరాబాద్: తనపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధకలిగించాయని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలను గౌరవించే సంస్కృతి బీజేపీలో లేనేలేదంటూ మండిపడ్డారామె. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌ఛాట్ నిర్వహించిన ఆమె.. బీజేపీపై విరుచుకుపడ్డారు.
బండి సంజయ్ వాఖ్యలు బాధాకరం. ఆయన మాటలు మంచివి కావు. రాజకీయ పరమైన విమర్శ చేయొచ్చు. కానీ, ఇలా కాదు. మహిళలను అవమానించడం బీజేపీకి కొత్తేం కాదు. మోదీ.. మమతా బెనర్జీని ఎలా అవమానించారో.. ఇక్కడ నన్ను బండి సంజయ్ అలా అవమానిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగురించి కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అసభ్యంగా, అవహేళన చేస్తూ బండి సంజయ్ మాట్లాడారు. ఆయన ఎంపీగా ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ తెలంగాణకు తేలేదు. పన్నెండేళ్ల కష్టంతో బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను పెట్టించాం. కానీ, బీజేపీ, ప్రతిపక్షాలు బతుకమ్మను ఎత్తుకోవడానికే భయపడ్డాయి.
బీఆర్‌ఎస్ వల్ల బీజేపీలో వణుకు పుడుతోంది. అభివృద్ధిలో బీజేపీని కౌంటర్ చేస్తాం. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలతో కలిసి పోరాడతాం. అంతిమంగా బీజేపీని గద్దె దింపడమే మా లక్ష్యం. తెలంగాణ ప్రజలు బీజేపీని సరైన సమయంలో తిప్పి కొడతారు. పసుపు బోర్డు రాకపోవడానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామనే కారణం. హిందీ భాషపై కాదు.. బలహీనపడుతున్న రూపాయి విలువపై మాట్లాడాలి.
బీఆర్ఎస్ కేసీఆర్ మానస పుత్రిక. ఆ పార్టీలో ఏ పాత్ర ఇచ్చిన నేను పోషిస్తా. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్తితులపైనే మా కార్యాచరణ ఉంటుంది. పని చేయడం మాకు కొత్తేం కాదు. జాతీయ ప్రత్యామ్నాయంగానే మా పార్టీ ఉండనుంది. అలాగని జాగృతి ఏమీ సైలెంట్‌గా లేదు. ప్రతి రాష్ట్రంలో మా జాగృతి కార్యక్రమాలు కొనసాగిస్తాం. తెలంగాణలో తెలంగాణ జాగృతి అనే ఉంటుంది. అలాగే.. భారత జాగృతి ఎప్పుడో రిజిస్టర్ అయి ఉంది. దేశ వ్యాప్తంగా భారత జాగృతి పేరుతో, ఇక్కడ తెలంగాణ జాగృతి పేరుతో సాగుతుంది. జాగృతి ద్వారా ఏ రాష్ట్రానికి ఉండే కల్చర్ ఆ రాష్ట్రంలో గౌరవిస్తాం అని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment