ద్రోణాచార్య పురస్కారానికి ఎంపికైన గవర్నర్ తమిళిసై భర్త డాక్టర్ సౌందరరాజన్‌ను సత్కరిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో గవర్నర్ తదితరులు
సాక్షి, హైదరాబాద్ : ద్రోణాచార్య పురస్కారానికి ఎంపికైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భర్త డాక్టర్ సౌందరరాజన్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. ఈమేరకు శుక్రవారం రాజ్‌భవన్‌ను సందర్శించిన సీఎం.. ఆయనకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. మూత్రపిండాల వైద్య విభాగం (నెఫ్రాలజీ)లో 35 ఏళ్ల పాటు బోధనలు, పరిశోధనలు, వైద్య సేవలు అందించినందుకుగాను ‘సీనియర్ ఢిల్లీ నెఫ్రాలజిస్టుల ఫోరం’ఆయనకు ఇటీవల ఈ పురస్కారాన్ని ప్రకటించిన విష యం తెలిసిందే. సౌందరరాజన్ సాధించిన విజయాలు యావత్ తెలంగాణ సమాజానికి గర్వకారణమని ఈ సందర్భంగా సీఎం ప్రశంసించారు.
సౌందరరాజన్ తమిళనాడు వైద్య కాలేజీలో వైద్య అధ్యాపకుడిగా 15 ఏళ్లు, రామచంద్రా వైద్య కాలేజీలో 20 ఏళ్ల పాటు నెఫ్రాలజీ విభాగాధిపతిగా సేవలందించారు. తన సర్వీసులో 1,200 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. అలాగే ప్రపంచంలోనే తొలిసారిగా పాముకాటుతో మరణించిన వ్యక్తి నుంచి సేకరించిన మూత్రపిండాలను విజయవంతంగా మార్పిడి చేశారు. రజినీకాంత్, జానకి, ఎంజీఆర్, కరుణానిధి వంటి ప్రముఖులకు వైద్య సేవలందించారు. జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో 200కిపైగా వైద్య పరిశోధన పత్రాలను ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment