భగత్‌ను గెలిపిస్తే అభివృద్ధి చూపిస్తా: సీఎం కేసీఆర్‌ | CM KCR Speech At Public Meeting In Haliya | Sakshi
Sakshi News home page

భగత్‌ను గెలిపిస్తే అభివృద్ధి చూపిస్తా: సీఎం కేసీఆర్‌

Published Wed, Apr 14 2021 6:42 PM | Last Updated on Thu, Apr 15 2021 9:03 AM

CM KCR Speech At Public Meeting In Haliya - Sakshi

సాక్షి ప్రతినిధి నల్లగొండ: ‘ఎన్నికలొచ్చాయని ఆగమాగం కావొద్దు. అభివృద్ధి మీ కళ్ల ముందే ఉంది. విచక్షణతో ఆలోచించండి. గాడిదలకు గడ్డి వేస్తే.. ఆవులకు పాలు రావు. ముళ్లచెట్లు పెట్టి పండ్లు రావాలంటే వస్తాయా? పండ్ల చెట్లే పెట్టాలి.. అభివృద్ధి చూసి ఓటెయ్యండి..’ అని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగ సభలో ఆయన  ప్రసంగించారు. ‘గతంలో హాలియా సభలో మీకు చెప్పా. ఎవరేం చేశారో ఊళ్లకు వెళ్లి చర్చించమని. ఎవరికి ఓటేస్తే బాగుంటుందో ఆలోచించమని. ఇప్పుడూ అదే చెబుతున్నా. మీరంతా ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. ఎవరు గెలిస్తే నియోజక వర్గం అభివృద్ధి చెందుతుందో నిర్ణయించుకుని ఉంటారు’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఈ గాలి 17 దాకా ఉండాలి
‘నోముల నర్సింహయ్యను కోల్పోవడం నాకూ బాధగానే ఉంది. ఆయన వామపక్ష పార్టీలో, అనేక ఉద్యమాల్లో పనిచేశారు. అదే స్థాయిలో పనిచేస్తడని, ఆయన కుమారుడు భగత్‌ను మీ ముందుకు తెచ్చిన. ఇప్పటికే ఆయన పేరు చెప్పగానే మీరు ఈలలు వేస్తున్నారంటే గాలి బాగానే ఉంది. అది 17వ తేదీ దాకా ఉండాలి. ఓటు రూపంలో ఉండాలి. మీ ఓట్లు దునికినట్లే నెల్లికల్లు లిఫ్ట్‌ ద్వారా నీళ్లు దునుకుతాయి. అలంపూర్‌లో లిఫ్ట్‌ విషయంలో కాంగ్రెస్‌ పట్టించుకోలేదని, అక్కడ నేను లిఫ్ట్‌ను పూర్తి చేస్తానని, ఓట్లు దుంకినట్లే నీళ్లు దుంకుతాయని చెప్పా. 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అదే తరహాలో నెల్లికల్లు లిఫ్ట్‌ కూడా పూర్తి చేస్తాం. ఏడాదిన్నరలో నెల్లికల్లు లిఫ్ట్‌ పూర్తికాపోతే తన మంత్రి  పదవికి రాజీనామా చేస్తానని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించడాన్ని నేను సమర్థిçస్తున్నా. ఆయన సవాల్‌లో ధైర్యం, నిజాయితీ ఉంది. వందశాతం ఆయన కరెక్ట్‌గానే చెప్పిండు. భిక్షమెత్తి అయినా నెల్లికల్లు లిఫ్ట్‌ పూర్తి చేస్తా..’ అని హామీ ఇచ్చారు. 


నందికొండకు డిగ్రీ కాలేజీ
‘జానారెడ్డి 30 ఏళ్ల చరిత్ర, 60 ఏళ్ల చరిత్ర అంటడు.. ఇన్నాళ్లూ నందికొండ అటు మున్సిపాలిటీ కాదు.. గ్రామపంచాయతీ కాక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. టీఆర్‌ఎస్‌ వచ్చాక మున్సిపాలిటీగా ఏర్పాటు చేశాం. అక్కడ ప్రాజెక్టు భూములు ఆక్రమించుకొని కొందరు బంగ్లాలు కట్టుకున్నారు. కానీ పేదలను పట్టించుకోలేదు. భగత్‌ గెలిచాక నేను స్వయంగా వచ్చి సర్టిఫికెట్లు ఇస్తా. సాగర్‌లో బీసీ గరుకులం ఉంది. ఇప్పుడు నందికొండకు డిగ్రీ కాలేజీ కూడా మంజూరు చేస్తా. 30 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకుంటున్న జానారెడ్డి హయాంలో డిగ్రీ కళాశాలకు దిక్కులేకుండా పోయింది. నర్సింహయ్య వెంటపడితే హాలియాలో డిగ్రీ కాలేజీ మంజూరు చేసిన. ఇప్పుడు సాగర్‌కు కూడా మంజూరు చేస్తున్నా..’ అని ప్రకటించారు. 

కాంగ్రెస్‌ సక్కగుంటే గులాబీ జెండా ఎందుకు ఎగిరేది?
‘కేసీఆర్‌కు సీఎం పదవి ఎవడి బిక్షో కాదు. తెలంగాణ ప్రజలైన మీరు పెట్టిన భిక్ష. వీళ్లు పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. ఆ రోజు నేను డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెలంగాణ జెండా ఎత్తాను. వస్తే రాష్ట్రం రావాలి.. పోతే ప్రాణం పోవాలని, వెనుకడుగు వేస్తే రాళ్లతో కొట్టమని చెప్పాను. అసలు కాంగ్రెస్‌ నేతలు సక్కగుంటే గులాబీ జెండా ఎందుకు ఎగిరేది? పదవుల కోసం తెలంగాణను కాంగ్రెస్‌ నాయకులు వదిలేస్తే, తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ పదవులను వదిలేసింది. ఇదంతా ప్రజల కళ్ల ముందు జరిగిన చరిత్ర. ఇదంతా ఆలోచించి విజ్ఞతతో ఓటేయాలి. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు గతంలో ఎక్కడివి. రైతు చనిపోతే రూ.50 వేల సాయం చేయడానికి నానా తిప్పలు పెట్టేవారు. గీకెటోడు.. గోకెటోనికి పోను చేతిలో రూ.10వేలు పెట్టేవారు. ఇప్పుడు ఒక గుంట భూమి ఉన్నా రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా సొమ్ము నేరుగా అకౌంట్‌లో పది రోజుల్లో పడుతోంది. అప్పటిలాగా ఇప్పుడు గీకేటోడు గోకేటోడు లేడు. పైరవీలు లేకుండానే డబ్బులు నేరుగా అకౌంట్లలో జమ అయి సెల్‌ఫోనుకు మెసేజ్‌ వస్తుంది. కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు తేడా ఇదే. ధరణి పోర్టల్‌ లేకముందు ఒకరి భూములను ఒకరు గుంజుకునే పరిస్థితి ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు..’ అని కేసీఆర్‌ చెప్పారు. 

అరవై ఏళ్ల పాలనలో ఆగమాగం చేసిండ్రు
‘నల్లగొండ మీద నేనే పాట రాసినా. ‘ఏమాయేను నల్లగొండ.. నీ గుండెనిండా ఫ్లోరైడు బండ..’ అని ఫ్లోరైడ్‌పై పాట రాశా. ఫ్లోరిన్‌ గోస గురించి మీకు తెలియంది కాదు. ఇప్పుడు మిషన్‌ భగీరథ నల్ల నీళ్లల్ల కేసీఆర్‌ కనిపించడంలేదా? అరవై ఏళ్లు ఆగమాగం చేసిండ్రు. కరెంటు సమస్య ఆనాడు ఎట్ల ఉండె.. ఈనాడు ఎట్లుంది? పాముకాట్లు, తేలుకాట్లు లేవు. ఇవి ఒట్టిమాటలు కావు. రూ.25 వేల కోట్లు ఖర్చు చేసినం. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కష్టపడి పనిచేశారు. కరెంటు ఎట్ల వస్తుందో ఇప్పుడు మీకు తెలుసు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు సాగు మీదనే మా దృష్టి. కాళేశ్వరంతోటి అక్కడి ప్రజలు కేరింతలు కొడుతున్నారు. ఇక్కడ కూడా నెల్లికల్లు లిఫ్ట్‌ పూర్తయి మీరు ఆ నీళ్లల్లో కేరింతలు కొట్టాలి. గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కృష్ణాలో తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇబ్బందులు జరిగే సందర్భంలో గోదావరి నీళ్లు వాడుకునేలా పెద్దదేవులపల్లికి నీళ్లు తెస్తాం..’ అని స్పష్టం చేశారు. 

గులాబీ జెండా పుట్టకముందు తెలంగాణ అనాథ
‘దేశంలోనే అత్యధిక వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 52.79 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశాం. ఏపీ మూడో స్థానంలో ఉంది. తలసరి ఆదాయం పెరిగింది. తలసరి విద్యుత్‌ వినియోగం పెరిగింది. గులాబీ జెండా పుట్టకముందు తెలంగాణ అనా«థ. అడిగేవారు లేరు.. నిలదీసేవారు లేరు. మీరంతా తెలిసీ తెలియనట్లు ఉండొద్దు. అర్థమై అర్థంకానట్లు ఉండొద్దు. ఆలోచించాలి. కులమతాలకు అతీతంగా అందరినీ ఆదరిస్తున్నాం. మంచి చేసేవారిని ఆదరిస్తే మంచి జరుగుతుందని ప్రజలు గమనించాలి. హాలియాలో షాదీఖానా కావాలని, మసీదును రిపేర్‌ చేయాలని కోరుతున్నారు. వీటిని పూర్తి చేయించే బాధ్యత నాది..’ అని సీఎం భరోసానిచ్చారు. 

జానారెడ్డి గిరిజనులకు చేసిందేమీ లేదు
‘చెరువులను బాగుచేశాం. శ్మశానవాటికలు నిర్మించడంతో పాటు, ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు ఇచ్చాం. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాల రూపురేఖలు మారిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాకముందు 30 సంవత్సరాల చరిత్ర చెప్పుకునే జానారెడ్డి గిరిజనుల కోసం చేసిందేమీ లేదు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తండాలను, గూడేలను పంచాయతీలుగా చేయడంతో వారే పాలకులయ్యారు. నిజంగా అభివృద్ధి చేసిన వారిని ఆదరించండి. గతంలో గొర్రెలను మేసిండ్రు. మేం యాదవులకు గొర్రెలు ఇచ్చినం. ఈసారి కూడా 3 లక్షల యూనిట్లు ఇవ్వనున్నాం. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ గొర్రెల యూనిట్ల సబ్సిడీ పెంచాలని కోరుతున్నారు.. ’ అని తెలిపారు. 

‘పోడు సమస్య’ సాగర్‌లో ఉండే పరిష్కరిస్తా
‘నాగార్జునసాగర్‌లో అభివృద్ధి కొనసాగాలి. ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్య బాగా పనిచేస్తున్నారు. భగత్‌ను ఎమ్మెల్యేగా గెలిపించండి. కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తా. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్త. 15 రోజుల్లో సాగర్‌కు వస్తా. నియోజకవర్గంలో అందరినీ పిలిపించి చర్చిస్తా. పెన్షన్లు, రేషన్‌కార్డులు కొన్ని ఆగిపోయాయి. త్వరలో వాటిని కూడా మంజూరు చేస్తా. గిరిజనుల పోడు భూముల సమస్య రాష్ట్రమంతటా ఉంది. ఆ సమస్య పరిష్కారానికి నాగార్జునసాగర్‌ నుంచే శ్రీకారం చుడతా. రెండ్రోజులు సాగర్‌లో ఉండి ప్రజాదర్బార్‌ పెట్టి నియోజకవర్గంలో గిరిజనుల పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తా. నెల్లికల్లు ఒక్కటే కాదు.. ఇటీవల దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో మంజూరు చేసిన ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయకుంటే ఓట్లు అడగం..’ అని కేసీఆర్‌ ప్రకటించారు. బహిరంగసభలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement