డబుల్ డెక్కర్ కారిడార్ నమూనా
సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫాం రోడ్డు వరకు నిర్మాణం
జంట నగరాలు సహా ఐదు జిల్లాల ప్రజలకు ప్రయోజనం
5.32 కిలోమీటర్ల కారిడార్.. రూ.1,580 కోట్ల వ్యయం
మలి దశలో దీనిపైనే మెట్రోరైల్ మార్గం నిర్మాణం
కండ్లకోయ వద్ద శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జంట నగరాలతోపాటు ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రజలకు ప్రయోజనకరమైన ‘డబుల్ డెక్కర్ కారిడార్’ కు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. 44వ నంబర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44)పై దశాబ్దాలుగా వాహనదారులు ఎదుర్కొంటున్న కష్టాలకు దీనితో ఉపశమనం లభించనుంది. రూ.1,580 కోట్లతో 5.32 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. తర్వాత దీనిపైనే మెట్రోరైల్ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు.
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఇలా..
ప్రతిపాది కారిడార్ సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్‌బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ల మీదుగా డెయిరీ ఫామ్ రోడ్డు వద్ద ముగుస్తుంది. మొత్తం కారిడార్ పొడవు 5.32 కిలోమీటర్లుకాగా.. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.65 కిలోమీటర్లు, అండర్‌గ్రౌండ్ టన్నెల్ సుమారు 600 మీటర్ల వరకు ఉంటాయి. మొత్తం 131 పియర్స్ (స్తంభాలు)తో.. ఆరు వరుసల రహదారిని నిర్మిస్తారు. ఈ కారిడార్‌లోకి ప్రవేశించేందుకు, దిగేందుకు బోయినపల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా రెండు చోట్ల (0.248 కిలోమీటర్ వద్ద), (0.475 కిలోమీటర్ వద్ద) ర్యాంపులు నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్ పూర్తయ్యాక దానిపై మెట్రోరైల్ మార్గం నిర్మిస్తారు. దానితో ఇది డబుల్ డెక్కర్ కారిడార్‌గా మారుతుంది.
రోజూ వేలాది వాహనాలు..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో ప్యారడైజ్ జంక్షన్ వద్ద రోజూ సగటున 1,57,105 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్ పర్ డే– పీసీయూ) ప్రయాణిస్తుంటే.. ఓఆర్‌ఆర్ జంక్షన్ సమీపంలో 72,687 వాహనాలు వెళ్తున్నాయి. ప్రస్తుతం ఈ దారి ఇరుగ్గా ఉండటంతో ట్రాఫిక్ స్తంభించిపోతూ.. వాహనదారులు, ఆయా ప్రాంతాల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే ఈ కష్టాలు తీరుతాయి.
ఎలివేటెడ్ కారిడార్ విశేషాలివీ
► మొత్తం పొడవు: 5.320 కిలోమీటర్లు
► ఎలివేటెడ్ కారిడార్: 4.650 కిలోమీటర్లు
► అండర్‌గ్రౌండ్ టన్నెల్: సుమారు 600 మీటర్లు
► సేకరించాల్సిన భూమి: 73.16 ఎకరాలు
► ఇందులో రక్షణశాఖ భూమి: 55.85 ఎకరాలు
► ప్రైవేట్ స్థలాలు: 8.41 ఎకరాలు
► అండర్‌గ్రౌండ్ టన్నెల్ కోసం: 8.90 ఎకరాలు
► మొత్తం ప్రాజెక్టు వ్యయం: రూ.1,580 కోట్లు
ప్రాజెక్టుతో ప్రయోజనాలివీ
► జాతీయ రహదారి–44లో సికింద్రాబాద్‌తోపాటు ఆదిలాబాద్ వైపు జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి.
►హైదరాబాద్ నగరం మధ్య నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్‌ఆర్ వరకు చేరుకునే అవకాశం.
►మేడ్చల్–మల్కాజిగిరి–మెదక్–కామారెడ్డి–నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్‌కు ప్రయాణికులు, సరకుల రవాణా వేగంగా సాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment