ఊసే లేని సబ్‌ప్లాన్
నేడు జాతీయ మైనారిటీ సంక్షేమ దినోత్సవం
హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన ‘మైనారిటీ డిక్లరేషన్’ఎప్పుడు అమలు చేస్తారని మైనారిటీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మైనారిటీల సంక్షేమం, అభివద్ధికి ప్రత్యేక మైనారిటీ సబ్‌ప్లాన్ అమలు చేస్తుందని ప్రకటించింది. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్, సీడబ్యుసీ సభ్యులు నాసీర్, షకీల్ అహ్మద్, కర్ణాటక మంత్రి జమీరుద్దీన్ అహ్మద్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీతో కలిసి హైదరాబాద్‌లో మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మైనారిటీలపై హమీల వర్షం గుప్పించారు. అధికారంలోకి వచ్చి సరిగ్గా 11 నెలలు దాటినా.. ఏ ఒక్కటి కూడా ఊసెత్తక పోవడంతో మైనారిటీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
⇒ మైనారిటీ సంక్షేమ బడ్జెట్ రూ.4,000 కోట్లకు పెంచుతామని ప్రకటించినా.. మొదటి ఏడాది 2024–25లో కేవలం రూ. 3,003 కోట్లకు పరిమితమైంది.
⇒ నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడానికి సంవత్సరానికి ప్రత్యేకంగా రూ.1,000 కోట్లు కేటాయిస్తామని డిక్లరేషన్‌లో వెల్లడించినా మొత్తం బడ్జెట్‌లోనే వాటా కేవలం రూ.432 కోట్లకు పరిమితమైంది.
⇒ అబ్దుల్ కలాం తౌఫా–ఎ–తలీమ్ పథకం కింద ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, ఇతర మైనారిటీ యువతకు అందించాల్సిన ఆర్థికసాయం కాగితాలకు పరిమితమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్పెషల్ ఉర్దూ డీఎస్సీ ప్రకటించండి
కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ హమీ మేరకు ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ–2024లో ఉర్దూ మీడియానికి మొత్తం 1,183 పోస్టులు కేటాయించినా, ఎస్సీ, ఎస్టీ ఇతరత్రా రిజర్వేషన్ కేటగిరి కారణంగా అర్హులైన అభ్యర్ధుల లేక సుమారు 666 పోస్టులు భర్తీకి నోచుకోలేదని విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎప్పటి మాదిరిగానే ఈసారి డీఎస్సీలో కూడా ఉర్దూ మీడియం రిక్రూట్‌మెంట్‌లో సగానికి పైగా పోస్టులు బ్యాక్‌లాగ్‌లో పడిపోయాయి. ప్రభుత్వం డీఎస్సీలు నిర్వహిస్తున్నా, ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఖాళీల భర్తీ మాత్రం పూర్తిస్థాయిలో జరగడం లేదన్న విమర్శలు వ్యక్తవుతున్నాయి. దీంతో ఉర్దూ మీడియం బ్యాక్‌లాగ్ పోస్టులన్నింటిని డీ–రిజర్వేషన్ ద్వారా ఓపెన్ కేటగిరీ కింద చేర్చి, ఖాళీలతో కలిపి స్పెషల్ డీఎస్సీ తక్షణమే ప్రకటించాలంటున్నారు. మరోవైపు డీఎస్సీ–2024 మెరిట్ అభ్యర్ధులు మాత్రం రెండవ జాబితా ప్రకటించి బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నేడు రవీంద్రభారతిలో అవార్డుల అందజేత
భారతరత్న, తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబు ల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఉర్దూ అకాడమీ, టెమ్రీస్ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో జరగనున్న మైనారిటీ సంక్షేమ దినోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ నేషనల్ అవార్డు 2019– 2023, మగ్దూమ్ అవార్డు–2024, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు 2021–23 లను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పాల్గొంటారు.
పెండింగ్‌లో గౌరవ వేతనాలు
డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా మసీదుల ఇమామ్, మౌజమ్‌లు, దర్గాల ఖాదీమ్‌లు, చర్చిల పాస్టర్ల గౌరవ వేతనాల పెంపు సంగతేమోగానీ ...వేతనాల పెండెన్సీ పెరిగిపోతుందని వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే నిధులు విడుదల చేయాలని ఇమామ్, మౌజమ్‌లు డిమాండ్ చేస్తున్నారు. వక్ఫ్‌బోర్డు పరిరక్షణ, ఆక్రమణకు గురైన ఆస్తుల స్వా«దీనం, ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్, ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి కేటాయిస్తామన్న హాదమీ కనీసం ప్రణాళికలను కూడా నోచుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment