సాక్షి, హైదరాబాద్:సోషల్‌మీడియాలో తన వీడియోల ద్వారా రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న ఓల్డ్ మలక్‌పేటకు చెందిన యువకుడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. చాదర్‌ఘాట్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన అబ్దాహు ఖాద్రీ అలియాస్ కసఫ్ తన ట్విట్టర్ ఖాతాలో తరచూ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా, శాంతికి భంగం కలిగించేలా పోస్ట్‌లు పెట్టేవాడు. ఈనెల 22, 23న బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న అతను రెచ్చగొట్టేలా నినాదాలు చేశాడు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతడి చర్యల వల్ల నగరంలో పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. పోలీసు వాహనాలపై, వేటు వ్యక్తుల వాహనాలపై పలువురు దాడులు జరిగాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కసఫ్‌పై గతంలోనూ నగరంలోని మీర్‌చౌక్, చాదరఘాట్, సీసీఎస్‌లో కేసులు ఉన్నట్లు తెలిపారు. అతడి విద్వేష పూరిత, రెచ్చగొట్టే వీడియోలు, నినాదాలు ప్రజల భద్రతపై ప్రభావాన్ని చూపిస్తాయని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి!
ఈ నేపథ్యంలో నగర కమిషనర్ ఆదేశాల మేరకు అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంగళవారం చాదర్‌ఘాట్ పోలీసులు భారీ బందోబస్తు మధ్య అతడిని అదుపులోకి తీసుకుని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. కసఫ్ గతంలో ఎంఐఎం సోషల్‌మీడియా కన్వీనర్‌గా పని చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే వీడియోలు పెడుతున్న కారణంగా పార్టీ అతడిని దూరంగా పెట్టినట్లు తెలిసిందని ఇన్‌స్పెక్టర్ సతీష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment