హైదరాబాద్: ఏపీ మాజీమంత్రి పొంగూరు నారాయణపై ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యం భార్య కృష్ణప్రియ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 29 ఏళ్లుగా నారాయణ, భర్త సుబ్రహ్మణ్యం అలియాస్ మణి తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని ఆదివారం ఉదయం రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తాను ఎదుర్కొన్న అనుభవాలను పోస్టు చేశానని, రాజకీయంగా వారికి ఇబ్బంది కలుగుతోందని భావించి తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌ను మూసివేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం గచ్చి బౌలిలోని బాంబూస్ మీనాక్షి విల్లాస్ ఎదుట కృష్ణప్రియ మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. పెళ్లయిన రెండో రోజు నుంచే బావ నారాయణ లైంగిక వేధింపులు మొదలుపెట్టాడు. ఆయనకు లొంగకపోవడంతో 29 ఏళ్లుగా ఆయన పెట్టే బాధలు భరిస్తున్నాను. ఆయన స్త్రీలోలుడు. నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే కొందరు మహిళలు ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. సోదరి వరుసైన వారు స్నానం చేస్తున్నప్పుడు బాత్‌రూమ్‌లోకి తొంగి చూసేవాడు. ఈ విషయం మొదట్లో వాళ్ల వాళ్లే చెప్పారు. నేను లొంగకపోవడంతో వేధింపులు ప్రారంభించాడు.
నాకు మానసిక సమస్య ఉన్నట్లుగా నా భర్త తప్పుడు సర్టిఫికెట్లు చూపించి యూట్యూబ్ వేదికగా ప్రచారం చేయడం చాలా బాధేసింది. నారాయణ మెడికల్ కాలేజీలో పనిచేసే డాక్టర్ శేషమ్మ నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావడం వారికి పెద్ద సమస్య కాదు. అలాగే, నారాయణ పిల్లలకు మానసిక సమస్యలు ఉన్నాయి. డాక్టర్ విరించి వారికి చికిత్స చేస్తున్నారు. విరించి నుంచి కూడా సర్టిఫికెట్ తేవడం పెద్ద కష్టమేమి కాదు.
ఒకరోజు మా నాన్నపై అరుస్తుంటే గుంటూరులో ఓ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. నిద్రలేమితో నిద్రమాత్రలు వేసుకుంటున్నట్లు డాక్టర్‌కు చెప్పాను. మానసిక ఒత్తిడితోనే నిద్రలేమి సమస్య ఉండవచ్చని డాక్టర్ చెప్పారు. నేను ఇటీవల ఏఐజీ ఆస్పత్రిలో చేరిన విషయం నిజమే. ఇక రక్త సంబంధం ఉంది కాబట్టే నారాయణకు నా భర్త పెట్‌గా మారాడు.
కేసు నమోదు చేయలేదు: సీఐ
కృష్ణప్రియ ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని రాయదుర్గం సీఐ మహేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment