సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (పాతబస్తీ మినహా) గెలుపోటములపై ప్రభావితం చూపించే మైనార్టీ ఓట్లపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. గతంలో సాంప్రదాయక ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలు చాలా మంది బీఆర్‌ఎస్ వైపు మళ్లిన నేపథ్యంలో వారిని తిరిగి తమ ఖాతాలో వేసుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.
ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని యోచిస్తోంది. దీనిపై టీపీసీసీ ఇప్పటికే తాత్కాలిక షెడ్యూల్‌ను రూపొందించగా, పూర్తిస్థాయి వివరాలను పంపాలని అధిష్టానం కోరినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన దిగ్విజయ్ సింగ్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టాలా? మరేదైనా రూపంలో కార్యక్రమాన్ని చేపట్టాలా అన్న దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.
ఆ రెండు పార్టీలూ ఒకటే
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముస్లింలతో పాటు ఇతర మైనార్టీ వర్గాల ఆలోచనలో కూడా మార్పు వచ్చినట్టు పలు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. గతంలో ఎంఐఎంతో పాటు కాంగ్రెస్‌కు అండగా ఉన్న ఈ వర్గాలు చాలా వరకు ఎంఐఎంతో పాటు బీఆర్‌ఎస్ వైపు మళ్లినట్టు అర్థమవుతోంది. గత పదేళ్లుగా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారానికి దూరంగా ఉండడంతో మైనార్టీ వర్గాలు పార్టీ నుంచి కొంత దూరమయ్యాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని మైనార్టీలకు సంబంధించిన రెండు ప్రధాన డిమాండ్లతో ఆ వర్గాల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల కల్పన, మైనార్టీలకు స్వయం ఉపాధి కోసం రుణాల మంజూరు అనే అంశాలను తీసుకుని ప్రజల్లోకి వెళ్లనుంది. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీగా, దేశ స్థాయిలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ వైపు మైనార్టీలు వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది.
ముఖ్యంగా బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు అంతర్గతంగా ఒక పార్టీకి మరోపార్టీ సహకరించుకుంటున్నాయనే విషయాన్ని మైనార్టీ వర్గాల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా ఆ వర్గాలను ఆకర్షించాలనేది కాంగ్రెస్ పార్టీ యోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మైనార్టీల పక్షాన యాత్ర లేదంటే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని, జనవరి 26 నుంచి జరగనున్న హాత్‌సే హాత్ జోడో కార్యక్రమం సమయంలోనే ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment