
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల పక్షాన భరోసా యాత్ర చేపట్టాలని టీపీసీసీ కిసాన్ సెల్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో రైతాంగ సమస్యలే ఎజెండాగా ఈనెల 19 నుంచి యాత్రను ప్రారంభించనుంది. ఆదిలాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ యాత్ర ఆగస్టు 2న నిజామాబాద్‌లో ముగియనుంది. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాట కార్యాచరణను రూపొందించటంతో పాటు ఆయా జిల్లాల రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందన్న దానిపై స్పష్టత ఇచ్చేందుకు గాను ‘రైతు భరోసా యాత్ర’ను చేపడుతున్నట్టు టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు సుంకెట అన్వేశ్‌రెడ్డి సోమవారం వెల్లడించారు.
యాత్ర షెడ్యూల్ ఇలా..
టీపీసీసీ సోమవారం ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న సాయంత్రం ఆదిలాబాద్‌లో యాత్ర ప్రారంభం కానుంది. 20న ఆసిఫాబాద్, మంచిర్యాల, 21న జగిత్యాల, సిరిసిల్ల, 22న సిద్దిపేట, జనగామ, 23న హనుమకొండ, వరంగల్, 24న పెద్దపల్లి, భూపాలపల్లి, 25వ తేదీన ములుగు, మహబూబాబాద్, 26న కొత్తగూడెం, ఖమ్మం, 27న సూర్యాపేట, యాదాద్రి, 28వ తేదీన రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, 29న వనపర్తి, గద్వాల, 30న మహబూబ్‌నగర్, నారాయణపేట, 31న వికారాబాద్, సంగారెడ్డి, ఆగస్టు1న మెదక్, కామారెడ్డిల మీదుగా ఆగస్టు 2వ తేదీన నిజామాబాద్ జిల్లాలో యాత్ర ముగించనున్నారు. కాగా, రైతు భరోసా యాత్ర ముగింపు సందర్భంగా నిజామాబాద్‌లో భారీ సభ నిర్వహించాలని టీపీసీసీ కిసాన్‌సెల్ నేతలు యోచిస్తున్నారు.