కోదాడరూరల్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 50 వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని, ఈ మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం నూతన సంవత్సరం సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
1994లో ఉన్నత ఉద్యోగాన్ని త్యాగం చేసి కోదాడ రాజకీయాల్లోకి వచ్చానని, 1999 నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలిచినా కోదాడ, హుజూర్‌నగర్, హైదరాబాద్‌ల్లో అద్దె ఇంటిలోనే ఉంటున్నానని తెలిపారు. ప్రస్తుతం ఒక్కసారి గెలిచినవారే కోట్ల రూపాయలు పెట్టి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారంటే వారి అవినీతి, దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. పోలీసులు, తహసీల్దార్, ఎంపీడీవో, జిల్లా అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని, వారు చెప్పిన వారికే పనులే చేస్తున్నారని విమర్శించారు.
అలాంటి అధికారులు, నాయకులు భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో ల్యాండ్, శాండ్, వైన్స్, మైన్స్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల తనపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని( పార్టీ మార్పును ఉద్దేశించి), వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఉత్తమ్ చెప్పారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలు నిరాధారమని కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని నాయకులు, కార్యకర్తలు గందరగోళానికి గురికావద్దని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment