సాక్షి, హైదరాబాద్: ప్రజా యుద్ధ నౌక గద్దర్‌పై గతంలో ఐదు రౌండ్లు కాల్పులు జరిగిన ఘటన వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్న విషయం మరోమారు చర్చనీయాంశంగా మారింది. నాటి టీడీపీ ప్రభుత్వం ఎంతోమంది విప్లవకారులను క్రూరంగా హత్య చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ బాహాటంగా ఈ విషయాలు పేర్కొనడం ఆ వాదనలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
ప్రజాగాయకుడు గద్దర్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గద్దర్ మృతికి సంతాపంగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. అందులో గద్దర్‌తో మావోయిస్టు పార్టీ ఉద్యమానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూనే..ఆయనపై కాల్పులు జరపడం ద్వారా చేసిన హత్యాయత్నం గురించి స్పష్టంగా పేర్కొన్నారు. ‘చంద్రబాబు నేతృత్వంలో దోపిడీ పాలకవర్గ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండగా విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి విప్లవ ప్రతిఘాతుక శక్తులతో నల్లదండు ముఠాలను పోలీసుల ద్వారా ఏర్పాటు చేశారు.
ప్రజా సంఘాల్లో క్రియా శీలకంగా పనిచేస్తున్న అనేకమంది విప్లవ కారులను నల్లదండు ముఠాలతో క్రూరంగా హత్యలు చేయించారు. అందులో భాగంగా 1997లో గద్దర్‌పై కూడా నల్లదండు ముఠా, పోలీసులు కలిసి కాల్పులు జరిపారు. ఐదు తూటాలు శరీరంలోకి దూసుకెళ్లినా గద్దర్ ప్రాణాలతో బయటపడ్డారు..’అని వివరించారు. తనపై జరిగిన కాల్పులకు సంబంధించి విచారణ పూర్తి చేసి దోషులను గుర్తించాలంటూ గద్దర్ ఎన్నో ఏళ్లపాటు ప్రభుత్వాలకు వినతిపత్రాలు ఇస్తూ వచ్చారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చి పాత సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూడా.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే తనపై హత్యకు కుట్ర జరిగిందని గద్దర్ చెప్పారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఒక స్పెషల్ టీంను పెట్టి దోషులను అతి త్వరలో పట్టుకుంటామని ప్రకటించినా అది జరగలేదని తెలిపారు. అంతకు ముందు సైతం గద్దర్ పలు వేదికలపై, మీడియా ఇంటర్వ్యూల్లో తనపై కాల్పుల వెనుక చంద్రబాబునాయుడు ప్రభుత్వ కుట్ర ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment