హమ్మయ్య.. టెస్ట్ చేయించుకున్నాం.. నెగెటివ్ వచ్చింది ఇక టెన్షన్ లేదు అనుకునే లోపే లక్షణాలు మొదలవుతున్నాయి.. ఇదేంటి మొన్నే టెస్ట్ చేయించుకున్నాం కదా.. ఇంటి నుంచి కనీసం బయట అడుగు పెట్టలేదు అనుకుంటున్నారు. కానీ నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా మారుతోంది పీహెచ్‌సీ సెంటర్లలోనే అని తర్వాత తెలుసుకుంటున్నారు. టెస్టులు చేయించుకునేందుకు వచ్చిన వారిలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు కూడా ఉండటంతో అందరికీ ఇబ్బంది తప్పడం లేదు.
సాక్షి, బంజారాహిల్స్: మాస్క్ ధరించడం ఎంత ముఖ్య మో.. భౌతికదూరం పాటించడం కూడా అంతే ముఖ్యం.. కానీ జనాలకు అవేవీ పట్టడం లేదు.. ఆస్పత్రికి వచ్చాం కదా.. సేఫ్‌గా వెళ్తాం అనే ధీమాతో.. అతి తెలివితో ఒకే దగ్గర గుంపులుగా గుమిగూడుతున్నారు. వీరిని కట్టడి చేసే యంత్రాంగం పూర్తిగా కరువైంది. అటు పోలీసులు పట్టించుకోకపోగా, ఇటు జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణ కరువై ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్ద భయాంకరమైన వాతావరణం నెలకొంటోంది. ఒకరి నుంచి ఒకరికి కరోనా సోకే అన్ని అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని వైద్యులు, సిబ్బంది మొత్తుకుంటున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు. పాజిటివ్ కేసులతో బాధపడుతున్న వారిని ఆనుకొనే నెగిటివ్ ఉన్న వ్యక్తులు కూడా రాసుకు పూసుకు తిరుగుతున్నారు.
ఎటువంటి రోగం లేని వారు కూడా కరోనా అంటించుకోవాల్సి వస్తోంది. ఒకటి రెండు రోజులు పోలీసులు గస్తీలో ఉన్నప్పటికీ ఈ జనాలను చూసే వారే జంకుతూ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని షౌకత్‌నగర్ ఆరోగ్య కేంద్రం ఇలా చెప్పుకుంటూ దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఇప్పుడు కరోనా పాజిటివ్ స్పాట్‌లుగా మారుతున్నాయి.
బంజారాహిల్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గుంపులుగా జనం
చదవండి: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్
కరువవుతున్న టెస్టింగ్ కిట్లు..
కరోనా పరీక్షలకు బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని బంజారాహిల్స్ ఆరోగ్య కేంద్రానికి నిత్యం 300 మందికిపైగా వస్తున్నారు. అయితే టెస్టులు చేసే కిట్లు మాత్రం కరువయ్యాయి. సరిపడా కిట్లు లేకపోవడంతో చాలా మందిని వెనక్కి పంపించేస్తున్నారు. గురువారం సుమారుగా 300 కిట్లు అవసరం కాగా కేవలం సంబంధిత అధికారులు వంద మాత్రమే సరఫరా చేశారు. 106 మందికి పరీక్షలు నిర్వహించి సంబంధిత అధికారులు చేతులు దులుపుకున్నారు. మరో వైపు ఇక్కడ టెస్టింగ్ చేసే సిబ్బంది కొరత కూడా ఉంది. ఇద్దరు సిబ్బంది నాలుగైదు గంటలకుపైగా పీపీఈ కిట్ వేసుకొని విధులు నిర్వహించడం కష్టంగా మారుతోంది.
బంజారాహిల్స్ ఆస్పత్రిలో 52 పాజిటివ్ కేసులు..
బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని ప్రభుత్వ ఆరో గ్య కేంద్రంలో గురువారం 106 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా రికార్డు స్థాయిలో 52 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు తెలిపారు. ఆస్పత్రి చరిత్రలోనే ఇది అత్యధిక సంఖ్య. బంజారాహిల్స్ రోడ్ నెం.8లోని ఓ టెంట్ హౌజ్‌లో పనిచేస్తున్న 20 మంది బీహార్ కార్మికులకు టెస్టులు చేస్తే 18 మందికి పాజిటివ్‌గా తేలింది.ఇదే రోడ్డులో గురువారం ఒక్క రోజే 35 మందికి పాజిటివ్ రావడం గమనార్హం. ఇక ఫిలింనగర్ ఆరోగ్య కేంద్రంలో 60 మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని షౌకత్‌నగర్ ఆరోగ్య కేంద్రంలో 87 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్‌గా తేలింది.
Comments
Please login to add a commentAdd a comment