సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ జలాల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది. నాచారం పెద్ద చెరువు, కూకట్‌పల్లి ప్రగతినగర్‌లోని తుర్క చెరువు జలాల్లోనూ వైరస్ ఉనికి ఉన్నట్లు తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ జలాశయాలు మినహా నగర శివార్లు, గ్రేటర్‌కు వెలుపల ఉన్న పలు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో వైరస్ ఆనవాళ్లు లేకపోవడం విశేషం. అయితే కరోనా వైరస్ నీటి ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ (గజియాబాద్)కు చెందిన పరిశోధకుల ఆధ్వర్యంలో ఈ అధ్యయనం సాగింది. నివాస సముదాయాల నుంచి వెలువడుతున్న మురుగు నీరు చేరుతున్న చెరువులపై పరిశోధన చేశారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువులపై దృష్టి సారించారు.
అయితే హుస్సేన్‌సాగర్, నాచారం పెద్ద చెరువు, తుర్క చెరువుల్లో చేరుతున్న మురుగు నీటిలోనే సార్స్ సీవోవీ–2 (కోవిడ్) ఉనికి బయటపడింది. ప్రధానంగా మానవ విసర్జితాల చేరికతోనే ఈ వైరస్ ఉనికి ఉన్నట్లు తేల్చారు. అయితే నగరానికి వెలుపల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని చెరువుల్లో వైరస్ లేదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. కాగా, మురుగు నీరు కలిసిన చెరువుల్లో కోవిడ్ వైరస్ ఆర్‌ఎన్‌ఏ బాగా వృద్ధి చెందుతుందని పేర్కొంటున్నారు. ఈ జలాశయాల్లో తొలి, సెకండ్ వేవ్ సమయంలో వైరస్ లోడ్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
హుస్సేన్‌సాగర్‌లో ఇలా..
హుస్సేన్‌సాగర్ జలాశయంలోకి కూకట్‌పల్లి, ఫాక్స్‌సాగర్ తదితర నాలాల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థజలాలే అధికంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ జలాల్లో కోవిడ్ వైరస్ ఉనికి బయటపడింది. మరోవైపు తుర్క చెరువు, నాచారం పెద్ద చెరువుల్లోనూ సమీప గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థ జలాలు శుద్ధి లేకుండానే చేరుతున్నాయి. దీంతో వైరస్ భారీగా ఉన్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
నేరుగా తాకితేనే వైరస్ హుస్సేన్‌సాగర్, నాచారం పెద్ద చెరువు, తుర్క చెరువుల్లో కోవిడ్ వైరస్ ఉనికి బయటపడినా.. ఈ నీటిని నేరుగా తాకడం, బట్టలు ఉతకడం వల్ల వైరస్ బారిన పడే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. సాధ్యమైనంత మేరకు ఈ జలాశయాల నీటిని చేతితో తాకకూడదని హెచ్చరిస్తున్నారు.
మా దృష్టికి రాలేదు: హెచ్‌ఎండీఏ
హుస్సేన్‌సాగర్ నీటిలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని పేరు చెప్పేందుకు ఇష్టపడని హెచ్‌ఎండీకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. సీసీఎంబీ, ఐఐసీటీ పరిశోధకుల బృందం విడుదల చేసిన అధ్యయన వివరాలను హెచ్‌ఎండీఏకు సమర్పించలేదని పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్ సంరక్షణ, నీటిలో ఆక్సిజన్ మోతాదు పెంచేందుకు హెచ్‌ఎండీఏ విశేషంగా కృషి చేస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment