
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటింది. అలాగే రోజురోజుకూ ఈ టెస్టులు భారీగా పెరుగుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్ మేరకు.. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా టెస్టులు 10,21,054 జరిగాయి. అందులో సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో అత్యధికంగా 52,933 పరీక్షలు నిర్వహించారు. దీంతో ప్రతీ 10 లక్షల జనాభాకు చేసిన నిర్ధారణ పరీక్షల సంఖ్య 27,502కు చేరింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 1,08,670 మందికి కరోనా సోకింది. అందులో 84,163 మంది కోలుకోగా, 770 మంది మరణించారు. ప్రస్తుతం 23,737 యాక్టివ్ కేసులున్నాయి. వాటిల్లో 17,226 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
ఇక సోమవారం నిర్వహించిన పరీక్షల్లో 2,579 కరోనా కేసులు బయటపడ్డాయి. అలాగే మరో 9 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 1,752 మంది కోలుకున్నారు. ఇదిలావుండగా మొత్తం రాష్ట్రంలో కోలుకున్నవారు 77.44 శాతం ఉండగా, మరణాలు 0.70 శాతంగా ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో మొత్తం 16 చోట్ల ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష చేస్తుండగా, 1,076 చోట్ల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. ఇక ప్రైవేట్‌లో 31 చోట్ల ఆర్‌టీ–పీసీఆర్ టెస్టులు చేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 295 కేసులు..
సోమవారం నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 295 ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 186, ఖమ్మంలో 161, వరంగల్ అర్బన్‌లో 143, నిజామాబాద్‌లో 142, నల్లగొండలో 129, కరీంనగర్‌లో 116, మేడ్చల్‌లో 106, మంచిర్యాలలో 104, జగిత్యాల జిల్లాలో 98 కరోనా కేసులు నమోదయ్యాయి.