పోలీసులతో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వాగ్వాదం
హనుమకొండ/హసన్‌పర్తి: ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న ప్రజల వైపా? లేదా కబ్జాలకు పాల్పడుతున్న ల్యాండ్ మాఫియా వైపా? అనేది తేల్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూకబ్జాదారుల వైపు నిలబడితే, తాము చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పేదల తరఫున తుపాకులు పట్టుకొని పోరాడేందుకు కూడా సిద్ధమన్నారు.
వరంగల్ నగరంలోని ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలు తొలగించడాన్ని నిరసిస్తూ నారాయణ ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వరంగల్, హనుమకొండ కలెక్టరేట్లకు ర్యాలీగా బయల్దేరారు. ర్యాలీని కాళోజి కూడలి వద్ద పోలీసులు అడ్డుకోగా.. మరోసారి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.
నారాయణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావుతో పాటు నాయకుల బృందం వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని అందుబాటులో ఉన్న అధికారులకు వినతిపత్రం అందించారు. అంతకుముందు ధర్నాలో నారాయణ మాట్లాడుతూ గుడిసెవాసుల జోలికి వస్తే తాటతీస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయన గుండ్లసింగారంలో గుడిసెవాసులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బర్రె పేడను బద్దలు కొట్టనోడు.. పీఎం అవుతాడట’ అంటూ ఆయన సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చినపుడు తానే స్వయంగా కూర్చుని రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి ఏళ్లవుతున్నా ఇప్పటివరకు ఒక్క ఇంటినీ పేదలకు ఇవ్వలేదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment