Telangana: వందే భారత్‌ ఎప్పుడొచ్చేనో!.. రైలు ప్రత్యేకతలివీ..   | Delay Vande Bharat Express Telugu states causing frustration to passengers | Sakshi
Sakshi News home page

Telangana: వందే భారత్‌ ఎప్పుడొచ్చేనో!.. రైలు ప్రత్యేకతలివీ..  

Published Fri, Dec 30 2022 7:30 AM | Last Updated on Fri, Dec 30 2022 4:01 PM

Delay Vande Bharat Express Telugu states causing frustration to passengers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇదిగో వచ్చేస్తుందన్నారు. త్వరలోనే ప్రధాని చేతుల మీదుగా పట్టాలెక్కుతుందన్నారు. కానీ ఏడాది గడిచింది. తెలుగు రాష్ట్రాల మధ్య దూరాన్ని మరింత దగ్గర చేసే వందేభారత్‌ రైలుపై ఇప్పటి వరకు ఎలాంటి కదలికా లేదు. ఈ నెలలోనే పట్టాలెక్కుతుందని భావించినా.. ఈ రైలు కొత్త సంవత్సరం జనవరి నెలలోనైనా పట్టాలెక్కుతుందా?  లేదా?  అనే అంశంపై సందేహం నెలకొంది.

సికింద్రాబాద్‌ నుంచి కాజీపేట మీదుగా విజయవాడ వరకు రాకపోకలు సాగించనున్న ఈ స్పీడ్‌ రైలుకు తగ్గట్లుగా ఇప్పటి వరకు ట్రాక్‌ సామర్థ్యం పెంచకపోవడం వల్లే జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో వందేభారత్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈ నెల 30న  పశ్చిమ బెంగాల్‌లో మరో రైలును ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ  క్రమంలో  తెలుగు రాష్ట్రాల్లో  వందేభారత్‌పై జాప్యం నెలకొనవడం ప్రయాణికులను నిరాశకు గురి చేస్తోంది. 

ట్రాక్‌ సామర్థ్యం పెంపు.. 
ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వరకు కాజీపేట మీదుగా గంటకు  130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు  నడుస్తున్నాయి. వందేభారత్‌ రైళ్లు గంటకు 160 నుంచి 180 కిలోమీటర్ల వరకు పరుగులు  తీస్తాయి. ఈ మేరకు ఈ మార్గంలో  ట్రాక్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. కానీ ఇప్పటి వరకు  పనులు పూర్తిచేయకపోవడం వల్లనే  వందేభారత్‌ రైలు రాక ఆలస్యమైనట్లు ఒక అధికారి వివరించారు.

ట్రాక్‌ సామర్థ్యం పెంచిన వెంటనే  వందేభారత్‌  ప్రారంభించే అవకాశం ఉందన్నారు. మరోవైపు జనవరితో  ఈ ఆర్థిక సంవత్సరం ముగిసి ఫిబ్రవరిలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇది అందుబాటులోకి వస్తుందా లేక  మరో సంవత్సరం ఎదురు చూడాల్సి వస్తుందా? అనే అంశంపై సందేహం నెలకొంది. 

తగ్గనున్న  దూరం... 
ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వరకు ఇంటర్‌సిటీ రైళ్లతో పాటు  విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 20కిపైగా రైళ్లు నడుస్తున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు, ఇతర రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ రైళ్లకు భారీ డిమాండ్‌ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే వందేభారత్‌  రైళ్లను సైతం ఈ రూట్‌లోనే  ప్రవేశపెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అనంతరం దశలవారీగా విశాఖ, తిరుపతి, తదితర మార్గాలకు విస్తరించే అవకాశం ఉంది.  

వందేభారత్‌  రైలు ప్రత్యేకతలివీ..  
►గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగం  
►సీసీ కెమెరాలతో ప్రత్యేక భద్రత వ్యవస్థ 
►మెట్రో రైలు తరహాలో ఆటోమేటెడ్‌ డోర్‌ సిస్టమ్‌ 
►వీల్‌చైర్లు, రీడింగ్‌ లైట్లు  అందుబాటులో   
►ఇండియన్, వెస్టర్న్‌ మోడల్‌లో బయో వాక్యూమ్‌ టాయ్‌లెట్లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement