కృష్ణా: మునీరాబాద్-మహబూబ్‌నగర్ రైల్వేలో భాగంగా దేవరకద్ర నుంచి కృష్ణా వరకు ఉన్న 66 కిలోమీటర్ల దక్షిణ మధ్య రైల్వేలైన్ పనులు పూర్తి కావడంతో ఇటు తెలంగాణ ప్రజలతో పాటు కర్నాటక, గోవా రాష్ట్రాల మధ్య రాకపోకలకు, వర్తక, వాణిజ్యపరంగా ఎంతో ఉపయోగకరంగా మారనుంది. మొట్టమొదట 2017లో దేవరకద్ర నుంచి జక్లేర్ గ్రామం వరకు 28.3 కిలోమీటర్లు రూ.943 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి చేశారు.
తర్వాత జక్లేర్ నుంచి మక్తల్ వరకు 11.5 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులను 2020లో, ఆ తర్వాత మక్తల్ నుంచి మాగనూర్ వరకు ఉన్న 13.3 కిలోమీటర్లను 2022 మార్చిలో, మాగనూర్ నుంచి కృష్ణా వరకు ఉన్న 12.7 కిలోమీటర్లను 2023లో పూర్తి చేశారు. ఈనెల 6న సికింద్రాబాద్, గుంతకల్ డీఆర్‌ఎంలతో పాటు కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి ప్రణవ్ సక్సేనా ఆధ్వర్యంలో ట్రయల్‌రన్ నిర్వహించారు. దేవరకద్ర నుంచి కృష్ణా వరకు ఉన్న 66 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ పూర్తి కావడంతో ఇక మీదట అన్నిరకాల రైళ్లు నడిపించేందుకు అవకాశం ఉంటుందని నిర్ధారించారు. గతంలో 6గంటలపాటు ప్రయాణించి హైదరాబాద్ చేరేవారు, ప్రస్తుతం 3గంటల్లోనే చేరుకునే అవకాశం ఏర్పడనుంది.
త్వరలోనే కాచిగూడ– కృష్ణా రైలు..
కాచిగూడ నుంచి కృష్ణా వరకు రైలును త్వరలోనే ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి కర్నాటకలోని రాయచూర్, బళ్లారి, గుంతకల్, హుబ్లి, గోవాకు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. వర్తక, వాణిజ్యపరంగా, ప్రజా రవాణాలకు ఈ దారి ఎంతో ఉపయోగంగా మారనుంది. నిత్యం వందల సంఖ్యలో రాయచూర్ నుంచి హైదరాబాద్ వరకు వాణిజ్య వాహనాలు, ప్రజా రవాణా వాహనాలు రోడ్డు ద్వారా రాకపోకలు సాగిస్తున్నాయి. మక్తల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేందుకు రైల్వేలైన్ అందుబాటులోకి రావడం ఎంతో తోడ్పడనుంది. ఇక్కడి రైతులు పండించే ధాన్యం, కూరగాయలు, పండ్లు అటు హైదరాబాద్, ఇటు కర్నాటకలోని రాయచూర్‌కు తరలించేందుకు వీలు కలుగనుంది.
అభివృద్ధికి తోడ్పాడు..
మునీరాబాద్ రైల్వే లైన్ పూర్తి కావడంతో మక్తల్ నియోజకవర్గం అన్ని రకాలుగా వేగంగా అభివృద్ధి చెందనుంది. ఈ ప్రాంతం నుంచి ఎటు వెళ్లాలన్నా తక్కువ సమయంలో గమ్యం చేరుకునేందుకు వీలు కలుగుతోంది. మా తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నా హయాంలో పూర్తికావడం ఆనందంగా ఉంది.
– చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment