
దసరా ఉత్సవాలకు నగరం సన్నద్ధమైంది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో నగరంలో ఆధ్యాతత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. చారిత్రక భాగ్యనగరంలో దసరా సమ్మేళనం వైవిధ్యభరితమైన సాంస్కృతిక ఆవిష్కరణ. వందల ఏళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వివిధ భాషలు, సంస్కృతులకు చెందిన ప్రజలు ఇక్కడ తమ సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రతింబించేవిధంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణంగా గతేడాది వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఈసారి సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అన్ని వర్గాల్లో దసరా జోష్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో దసరా వేడుకలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
శతాబ్దాల చారిత్రక ఉత్సవం...
► నిజాం నవాబుల కాలంలోనే హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వివిధ వర్గాల ప్రజలు దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ కాలంలో ప్రతి పండగకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ప్రజల ఆచార సంప్రదాయాలు గొప్ప ఆదరణ లభించింది. తెలుగువారితో పాటు బెంగాలీలు, కన్నడిగులు, మలయాళీలు తదితర వర్గాల ప్రజలు తమ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా దుర్గామాత వేడుకలను జరుపుకొంటున్నారు.
► బెంగాలీలు దసరా ఉత్సవాల్లో భాగంగా అయిదు రోజుల పాటు దుర్గామాత వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. పంచమి, సప్తమి, అష్టమి, నవమి, దశమి రోజుల్లో పూజలు నిర్వహిస్తారు. బెంగాలీల ఆచారం ప్రకారం దుర్గామాతను తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తారు. ఇంటి ఆడపడచును సాదరంగా ఆహహ్వానించినట్లుగానే దేవిని ఆహహ్వానిస్తారు. దుర్గామాతతో పాటు ఆమె సంతానమైన సరస్వతి, లక్ష్మీ, వినాయకుడు, కార్తికేయుడు వంటి దేవ దేవుళ్లను కొలిచి మొక్కుతారు.
► కన్నడిగులు కూడా దసరా పండగలో భాగంగా నవరాత్రులు దేవీ ఆరాధన చేస్తారు. ఇళ్లలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. కొందరు పది రోజులూ వెలిగిస్తే, మరి కొందరు ఏడు, మరికొందరు అయిదు, కనీసం మూడురోజులు మాత్రం తప్పకుండా వెలిగిస్తారు. చాలా మంది ఇళ్ళల్లో బొమ్మల కొలువును పెడతారు. తొమ్మిది రోజులు ఉపవాసాలు ఆచరిస్తారు. మూలా నక్షత్రం రోజున సరస్వతీ అమ్మవారి ఆవాహన, మరుసటి రోజు సరస్వతి పూజ చేసుకుంటారు. దుర్గాష్టమి రోజు ఆయుధపూజ ఆచరిస్తారు. వంటింటిలో ఉపయోగించే కత్తి,కత్తెర, చాకులాంటి ఆయుధాలను కూడా పూజిస్తారు.
► కన్నడిగులు దసరా వేడుకలను తమ సంప్రదాయ పండగగా సంభ్రమానందాలతో ఆచరిస్తారు.
సరదాల దసరా..
► తెలంగాణలో ఇది సరదాల దసరా. అతి పెద్ద పండగ. ఇంటిల్లిపాదీ నూతన వ్రస్తాలు ధరించి రకరకాల పిండివంటలతో పాటు, నాన్‌వెజ్ వంటకాలతో ఆనందంగా గడిపేస్తారు.
► దసరా తెలంగాణ ప్రాంతంలో పుష్కలంగా పండే మెట్ట పంటలకు ప్రతీక. అందుకే ప్రజలు ఏపుగా పెరిగిన జొన్న కరల్రను జెండాలుగా ఎత్తుకొని.. బ్యాండు మేళాలతో వెళ్లి పాలపిట్టను చూసి విజయోత్సాహంతో కేరింతలు కొడతారు. అక్కడి నుంచి నేరుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేస్తారు.
► జమ్మి ఆకు, జొన్న కంకి, మారేడు పత్రిని (దీనిని బంగారంగా భావిస్తారు) దేవతలకు సమర్పించి ఆ తర్వాత ఒకరికొకరు జమ్మి ఆకు చేతిలో పెట్టుకొని అలయ్ బలయ్ (ఆలింగనం) తీసుకొంటారు.
► మనుషుల మధ్య కల్మషాలన్నింటినీ కడిగి పారేసి ప్రేమ, ఆత్మీయత, అనురాగాలను పంచిపెట్టే పండగ దసరా. గుండెల నిండా ఆర్తిని నింపుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకొనే క్షణాలు మధురానుభూతులు.
వేడుకలకు సిద్ధం..
► దసరా వేడుకల్లో భాగంగా నగరవాసులు జమ్మి చెట్టును సందర్శించి పూజ కోసం జమ్మి ఆకును తెచ్చుకోవడం సంప్రదాయం. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది పెద్ద ఎత్తున జమ్మి మొక్కలు కూడా నాటారు.
► మరోవైపు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఖైరతాబాద్ చింతల్‌బస్తీ రాంలీలా గ్రౌండ్స్, అంబర్‌పేట్ పోలీస్ గ్రౌండ్స్, గోల్కొండ కోట ప్రాంగణం, సీతారాంబాగ్ దేవాలయం, ఆర్‌కే పురం అష్టలక్ష్మీ దేవాలయం, జిల్లెల గూడ వెంకటేశ్వర దేవాలయం, సైదాబాద్ పూసలబస్తీ, ఓల్డ్ మలక్‌పేట్, అక్బర్‌బాగ్ తదితర ప్రాంతాల్లోని దేవాలయాల్లో, నగరంలోని వివిధ ప్రాంతాల్లోని కూడళ్లలలో జమ్మి కొమ్మలకు పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు.