అన్నింటా అభివృద్ధి సాధిస్తూ.. | Eight Years Of Telangana: Govt To Highlight Key Schemes | Sakshi
Sakshi News home page

అన్నింటా అభివృద్ధి సాధిస్తూ..

Published Wed, Jun 1 2022 2:07 AM | Last Updated on Wed, Jun 1 2022 2:07 AM

Eight Years Of Telangana: Govt To Highlight Key Schemes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం సమగ్ర విశ్లేషణ నివేదిక విడుదల చేసింది. పలు రంగాల్లో సాధించిన అభివృద్ధిని గణాంకాలతో సహా ఈ నివేదికలో పేర్కొంది. ఆ నివేదిక వివరాలు ఇలా ఉన్నాయి.      

13.31 లక్షల మందికి ఆరోగ్యశ్రీ.. 
ఆరోగ్యశ్రీ పథకం అమలుకు ఈ ఎనిమిదేళ్లలో రూ.5,817 కోట్లు వెచ్చించింది.  
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 13.31 లక్షల మంది బాధితులు ఆరోగ్యశ్రీ కింద వైద్యచికిత్సలు పొందారు.  
అత్యధికంగా 2015–16లో 1.88 లక్షల మంది పేదలు.. 3.31 లక్షల మంది ఉద్యో గులు, జర్నలిస్టులు చికిత్సలు పొందగా, దీనికోసం రూ.1,346 కోట్లు ఖర్చు చేశారు.  
ఆరోగ్యశ్రీ కార్డులున్న కిడ్నీరోగులు 73,378 మందికి డయాలసిస్‌ జరిగింది.  

పేదింట్లో ‘కల్యాణ’కాంతులు 
ఆడబిడ్డ వివాహం ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో తలపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ సరికొత్త రికార్డును సృష్టించాయి.  
11.45 లక్షల కుటుంబాలు ఆర్థిక సాయాన్ని అందుకున్నాయి.  
పథకం తొలిరోజుల్లో రూ.50,116 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించింది. తర్వాత ఏడాది రూ.75,116కి పెంచింది. మూడోసారి రూ.1,00,116కు పెంచింది.  

దళిత‘బంధు’.. 
దళిత కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన దిశగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలన్న లక్ష్యం తో 2021 నుంచి దళితబంధును అమల్లోకి తెచ్చింది.  
ఈ పథకం కింద రూ.22,141 కోట్లు ఖర్చు చేసింది. తాజా బడ్జెట్‌లో నిర్దేశించిన లక్ష్యాలతో కలిపితే ఈ పథకం కింద 2 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.  

ఇంటింటికి ‘భగీరథ’ జలం.. 
ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో మిషన్‌ భగీరథ తాగునీటి పథకాన్ని ప్రారంభించింది.  
మిషన్‌ భగీరథతో గ్రామాల్లోని ప్రతీ ఒక్కరికి రోజుకు 100 లీటర్లు, మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, కార్పొరేషన్ల పరిధిలో 150 లీటర్ల తాగునీరు సరఫరా చేయడమే లక్ష్యం.  
2014 సెప్టెంబర్‌ 5న సీఎం కేసీఆర్‌ దీని ప్రణాళికను ఆవిష్కరించగా, ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్‌ వంటి పనులు చేపట్టి 2020లో పథకాన్ని పూర్తిచేశారు. 

‘పల్లె ప్రగతి’తో అంతా పరిశుభ్రం.. 
తెలంగాణలోని ప్రతి పల్లె, దేశంలోనే ఆదర్శంగా నిలవాలనేది 2018లో ప్రారంభించిన ‘పల్లె ప్రగతి’ ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలనేది లక్ష్యం.
2019 సెప్టెంబర్‌ నుంచి 2022 మే దాకా రూ.9,560.32 కోట్లు, 2022–23లో స్టేట్‌ మ్యాచింగ్‌ గ్రాంట్లలో భాగంగా ప్రభుత్వం రూ.1,396.68 కోట్లు కేటాయించింది. 
12,729 వైకుంఠ ధామాలు, 12,753 డం పింగ్‌ యార్డులు, 12,705 యార్డుల్లో కంపో స్టు ఎరువు తయారీ కేంద్రాలు, 12,759 గ్రామాల్లో విలేజ్‌ నర్సరీలు పూర్తయ్యాయి.

‘మన ఊరు–మన బడి’తో మహర్దశ.. 
స్కూళ్లలో విద్యుత్, తాగునీరు, ఫర్నీచర్‌ వంటి మౌలిక వసతులతోపాటు భవనాల మరమ్మతులు ఇలా 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మూడేళ్లలో 26 వేల స్కూళ్లను తీర్చిదిద్దాలనేది ‘మన ఊరు–మనబడి, మన బస్తీ–మన బడి’ లక్ష్యం. 
ఈ పథకానికి రూ.7,289.54 కోట్లు ఖర్చు చేయనుంది. 9,123 స్కూళ్లను మొదటి దశ లో గుర్తించింది. తొలి ఏడాది రూ. 3,497.62 కోట్ల మేర అంచనాలు సిద్ధం చేసింది.  
 2022–23 నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతులకు ఆంగ్ల మాధ్యమ బోధన అందు బాటులోకి రాబోతోంది.  

సాగునీటితో సిరుల పంట.. 
సాగునీటి రంగానికి ఏడేళ్లలో రూ.1.52 లక్షల కోట్లను పెట్టుబడి వ్యయంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.  
శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఐదు దశల్లో లిఫ్టు చేసి 12.30 లక్షల ఎకరాల సాగునీటిని అందించడానికి 
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది.  
గోదావరి నది నుంచి నీటిని తరలించి  6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి సీతారామ ప్రాజెక్టును చేపట్టింది. ఇదే తరహాలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని సైతం చేపట్టింది.  
గోదావరి జలాలను 90 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తులోకి లిఫ్టు చేయడానికి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కాళేశ్వ రం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి పూర్తి చేసింది. ఇందులో భాగంగా మూడు బ్యారేజీలు, 20 భారీ లిఫ్టులు, 21 పంప్‌ హౌస్‌లు, 18 రిజర్వాయర్లు, 1,832 కి.మీ.ల పొడవున సొరంగాలు, పైప్‌లైన్లు, కాల్వలతో కూడిన నెటవర్క్‌ను 36 నెలల రికార్డు సమయంలో నిర్మించింది. ఈ ప్రాజెక్టు 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకూ సాగునీరు అందిస్తుంది.
చెరువుల పునరుద్ధరణకు మిషన్‌ కాకతీ య పథకాన్ని చేపట్టి అద్భుత ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో 46,531 చెరువులుం డగా, 27,625ను రూ.5 వేల కోట్లతో పూడిక తొలగించి పునరుద్ధరించారు.  

గొర్రెలు, చేపల పెంపకం.. 
సబ్సిడీపై గొర్రెల పంపిణీ, జలవనరుల్లో ఉచితంగా చేప, రొయ్య విత్తనాలను పోయడం ద్వారా లక్షల సంఖ్యలో ఈ జీవాల ఉత్పత్తి పెరిగింది.  
2013–14లో రాష్ట్రంలోని జంతు సంపద విలువ రూ.24,878 కోట్లు కాగా, 2021–22 నాటికి అది రూ.94,400 కోట్లకు చేరింది.  

పెట్టుబడికి రైతుబంధు.. 
అన్నదాతలకు ఆర్థిక సాయంగా ప్రతీ సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున ఇస్తోంది.  
2018–19లో రైతుబంధు పథకం ప్రారం భించిన నాటి నుంచి రూ.50,447 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది.  
2018–19లోనే రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతు ఎవరైనా ఏదైనా కారణంతో చని పోతే, ఆ కుటుంబానికి రూ.5 లక్షలు బీమా అందించేలా ఏర్పాటు చేసింది.  
ఇప్పటివరకు 84,041 మంది రైతులు చనిపోగా, వారిలో 80,861 మందికి రూ.4,043 కోట్ల పరిహారం అందింది.   

ఆపన్నులకు ‘ఆసరా’..  
2014 నవంబర్‌ నుంచి ఆసరా పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తోంది. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ రోగులు, బోధకాలు బాధితులు ఇలా తొమ్మిది కేటగిరీల వారికి పింఛన్లు అందిస్తున్నారు.  
2014–15 నుంచి 2021–22 వరకు రూ.47,423.67 కోట్లివ్వగా, 19,61,307 కొత్త పింఛన్లను మంజూరుచేశారు.  

పారిశ్రామికం పైపైకి.. ఐటీలో మేటి.. 
2015లో కొత్త పారిశ్రామిక విధానం టీఎస్‌ ఐపాస్‌ను రూపొందించడం ద్వారా సులభతర అనుమతులకు వీలుగా నిబంధనలు సవరించింది.  
దీంతో 2015 నుంచి ఇప్పటివరకు రూ.2.34 లక్షల కోట్ల పెట్టుబడులతో 19,837 యూనిట్లకు అనుమతులు ఇవ్వడం ద్వారా 16.56 లక్షల మందికి ఉద్యోగాల కల్పించాలని నిర్ణయించింది.  
15,747 యూనిట్లు రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించి 9.95లక్షల మందికి ఉపాధి కల్పించాయి.  
2014లో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు ఉండగా, 2021–22 నాటికి రూ.1.45 లక్షల కోట్లకు చేరాయి.  
ఐటీ రంగంలో ప్రస్తుతం తెలంగాణలో 6.28 లక్షల మంది పనిచేస్తుండగా, ఏడేళ్లలో ఈ రంగంలో కొత్తగా సుమారు 3 లక్షల మందికి ఉద్యోగాల కల్పన సాధ్యమైంది.  
అమెజాన్, సేల్స్‌ఫోర్స్, గోల్డ్‌మన్‌ సాష్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు క్యాంపస్‌లను ఏర్పాటు చేశాయి.  
వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొం డ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడంపై దృష్టి సారించింది. 

‘విద్యుత్‌’ జిగేల్‌.. 
తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం విద్యుత్‌ రంగం గణనీయ ప్రగతి సాధించింది.  
రాష్ట్ర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 17,234 మెగావాట్లకు పెరిగింది. రోజువారీ గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 17వేల మెగావాట్లకు పెరిగినా, నిరంతర విద్యుత్‌ సరఫరా చేసే సామర్థ్యాన్ని రాష్ట్రం కలిగి ఉందని దీనర్థం.  
వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య 19.03 లక్షల నుంచి 26.6 లక్షలకు, మొత్తం విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య 1.11 కోట్ల నుంచి 1.71 కోట్లకు పెరిగింది.  
వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా, ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్లు, నాయిబ్రాహ్మణులు, ధోభిఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా వంటి పథకాలను అమలు చేస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement