సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం మేలైన మార్గమైతే.. ఆ తర్వాత కూడా మాస్కు వేసుకోవడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం అత్యవసరమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నా రు. కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్యుల్లో వ్యాధిపై మరింత అవగాహన పెంచే లక్ష్యంతో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సీసీఎంబీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, జాతీయ పోషకాహార సంస్థలు సంయుక్తంగా బుధవారం ఆన్‌లైన్ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కరోనాపై పలు సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశాయి.
టీకా లభ్యతపై..
ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్ మాత్రమే అందుబాటులో ఉన్నా.. మే 10–15 మధ్య సమయానికి రష్యా తయారుచేసిన స్పుత్నిక్–వీ అందుబాటులోకి వస్తుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. క్యాడిల్లా ఫార్మా తయారు చేస్తున్న సెప్సివ్యాక్ కూడా ప్రభుత్వ అనుమతులు పొందే అవకాశముందని పేర్కొన్నారు. కుష్టు వ్యాధి కోసం అభివృద్ధి చేసిన సెప్సివ్యాక్.. రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెప్పారు. కాగా, కోవాగ్జిన్ తయారీకి అవసరమైన ముడిపదార్థాల కొరత లేదని, రసాయనాలను దేశీయంగానే తయారు చేసుకుంటున్నామని డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. కోవి షీల్డ్ ముడిపదార్థాల కొరత కూడా త్వరలోనే తీరుతుందని పేర్కొన్నారు. ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ సోకితే లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటోందని చెప్పారు.
వ్యాక్సినేషన్ నత్తనడకపై..
వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడక సాగడానికి వ్యాక్సిన్ ఉత్పత్తిలోని లోటుపాట్లు కొంతవరకు కారణమైనా.. తొలి దశ వ్యాక్సినేషన్‌లో వైద్యులు, సిబ్బందిలో వేచి చూద్దామన్న ధోరణి వల్లే టీకా కార్యక్రమం వేగం తగ్గిందని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత అభిప్రాయపడ్డారు. సెకండ్ వేవ్ కరోనా కేసుల్లో 85 శాతం మంది తక్కువ స్థాయి లక్షణాలతో బయటపడుతున్నారని తెలిపారు. తొలి దశతో పోలిస్తే రెండో దశలో సైటోకైన్ స్టార్మ్, న్యుమోనియా వంటివి తక్కువగా ఉన్నాయని తెలిపారు. తొలి డోసు టీకా తీసుకున్న 7 రోజులకే శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నా రోగ నిరోధక వ్యవస్థ స్పందించేందుకు 2,3 వారాల సమయం పడుతుందని వివరించారు.
మ్యూటెంట్ల గురించి..
కరోనా వైరస్‌తో పాటు ఏ వైరస్ అయినా కాలక్రమంలో రూపాంతరం చెందుతుంది కాబట్టి.. బ్రెజిల్, యూకే, దక్షిణాఫ్రికా, డబుల్, ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్‌ల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో ఎన్.మధుసూదనరావు స్పష్టం చేశారు. తొలి దశతో పోలిస్తే రెండో దశలో ప్లాస్మా ట్రీట్‌మెంట్ ప్రభావం కొంత తగ్గినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కొందరికి తప్పుగా నెగెటివ్ రావడంపై మాట్లాడుతూ.. శాంపిల్‌ను ఎంత సమర్థంగా తీయగలరు? ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే యంత్రాలు తదితర అంశాలూ ప్రభావం చూపుతా యని తెలిపారు. ధూమపానం చేసేవారు, శాఖాహారులు, ఫలానా గ్రూపు రక్తం ఉన్న వారిలో కరోనా తీవ్రత తక్కువగా ఉందనేందుకు ఆధారాల్లేవని చెప్పారు.
మహిళల్లో నిరోధకత ఎక్కువ?
పురుషులతో పోలిస్తే మహిళల రోగ నిరోధక వ్యవస్థ కొంచెం మెరుగ్గా ఉంటుందని, ఆరోగ్య సమస్యల నుంచి కోలుకునే వేగం కూడా ఎక్కువని, కోవిడ్–19 విషయంలోనూ ఇదే జరుగుతోందని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ ఆర్.హేమలత తెలిపారు. నెలసరి సమయంలో వ్యాక్సిన్ తీసుకోరాదన్నది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. పాలిచ్చే తల్లులు టీకా తీసుకోవడం అపాయమేమీ కాదని, కోవిడ్–19 విషయంలో ప్రభావంపై ఇంకా తెలియదని చెప్పారు. కరోనా బారిన పడ్డవారు తగిన పౌష్టికాహారం తీసుకోవడం అత్యవసరమని తెలిపారు. రోజువారీ ఆహారంలో కనీసం సగం పండ్లు, కాయగూరలు ఉండేలా చూసుకోవాలని వివరించారు. విటమిన్–డి తక్కువగా ఉన్న వారిలో వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, మరణాల రేటూ ఎక్కువని, ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు కూడా ఇదే చెబుతున్నాయని పేర్కొన్నారు.
ఇంట్లోనూ మాస్కు అవసరమా?
రెండో దఫా కేసులు ప్రబలుతున్న తీరును చూస్తే ఇళ్లలోనూ మాస్కులు ధరించాలన్న కేంద్ర ప్రభుత్వ అధికారుల సూచన సరైందేనని భావిస్తున్నట్లు ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శిష్ట్లా రామకృష్ణ తెలిపారు. గాలి, వెలుతురు సరిగా లేని ప్రాంతాల్లో ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉంటే.. తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని కోరారు. కరోనా వైరస్ నోరు, ముక్కు, కళ్లద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఆరడుగుల దూరం పాటించాలని, ప్రజలు వీటిని సరిగ్గా పాటించి ఉంటే సెకండ్‌వేవ్ కేసులు ఈ స్థాయిలో పెరిగేవి కావేమోనని అభిప్రాయపడ్డారు. ఆ రెండే కరోనా నుంచి మనల్ని కాపాడుతాయి..
Comments
Please login to add a commentAdd a comment