సాక్షి, మెదక్: ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు అనేది ఓటర్లు నిర్ణయిస్తారు. కాని ఈసారి ఎన్నికల్లో కమలనాథులు తెలంగాణలో ప్రయోగాలు చేస్తున్నారు. గులాబీ పార్టీలో పెద్ద నాయకుల మీద పోటీ చేయడానికి వినూత్న ప్రయోగాలు ప్రారంభించారు. ఇప్పటికే కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో కమలం పార్టీ తరపున ఈటల రాజేందర్ బరిలో నిలుస్తున్నారు. మరి కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో బీజేపీ నుంచి ఆయన ప్రత్యర్థి ఎవరు? సిరిసిల్లలో బీజేపీ ఎవరిని నిలుపుతోంది?
సిరిసిల్లలో కల్వకుంట్ల తారక రామారావుకు ప్రత్యర్థి ఎవరైనా.. గులాబీ కార్ స్పీడ్‌కు ఎవరూ బ్రేకులు వేయలేరనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్‌ను ఓడించే దమ్మున్న నేత ఎవరూ లేరనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులుగా ఎవరు తలపడినా గెలిచేది మాత్రం తారక రాముడే అని చెబుతున్నారు. ఈ విషయం తెలిసి కూడా బీజేపీ మాత్రం ఒక వినూత్న ప్రయోగం చేసింది. కేటీఆర్‌ను ఓడించలేకపోయినా.. ఆయన ఉపన్యాసాలకు ధీటుగా బదులివ్వగలిగే.. కేటీఆర్‌కు కౌంటర్లు ఇవ్వగలిగే మహిళా నేతను బరిలో దింపారు కమలనాథులు. పైగా ఆ మహిళా నేత సిరిసిల్ల వాసి కాదు..కనీసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు చెందిన రాణి రుద్రమరెడ్డిని సిరిసిల్లకు తీసుకువచ్చి బరిలో దింపారు.
బీజేపీ ఈసారి సిరిసిల్లలో చేసిన ఈ ప్రయోగంపై భిన్నరకాల చర్చలు జరుగుతున్నాయి. మీడియాలో పనిచేసిన అనుభవంతో పాటు..గతంలో సిరిసిల్ల ఇంఛార్జ్ గా కూడా వ్యవహరించడం.. అంతకు ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బరిలోకి నిలవడం వంటి అనుభవాలున్న రాణీరుద్రమ అయితే కేటీఆర్‌కు పోటీ ఇవ్వగలుగుతామని బీజేపీ నేతలు భావించారు. సిరిసిల్లలో కేటీఆర్ పై నిల్చునేందుకు రాణిరుద్రమ ముందుకు రావడమే ఓ విజయమనే చర్చ కూడా జరుగుతోంది. ఎవర్నడిగినా వెనుకడుగు వేసేవారే కనిపిస్తున్న నేపథ్యంలో... ఓ బలమైన నేతను దింపాలన్న బీజేపీ యోచనకు రాణీరుద్రమ సరిగ్గా సూటైందన్నది ఇప్పుడు ఇక్కడ వినిపిస్తున్న టాక్. పైగా కేటీఆర్ ను గట్టిగా సవాల్ చేయగల్గినా.. అవగాహనతో ఆయనకు కౌంటర్స్ విసరగల్గినా.. అది రాణీరుద్రమ వంటివారికే సాధ్యమనే ఆలోచనతోనే బీజేపీ ఈ ప్రయోగం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.
సిద్ధిపేట నియోజకవర్గంలో హరీష్ రావుపై పోటీ చేయాలని విజయశాంతిని బీజేపీ పెద్దలు కోరినా.. ఆమె అందుకు ససేమిరా అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేటీఆర్ వంటి నేతపై రాణీరుద్రమ పోటీ చేయడానికి ఒప్పుకుని అటు బీజేపీ పెద్దల దృష్టితో పాటు.. ఇటు తెలంగాణా ప్రజల దృష్టినీ ఆకర్షించి ఇప్పుడు వార్తల్లో వ్యక్తవుతున్నారనేది నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. పైగా ప్రత్యర్థులకు అదిరిపోయే కౌంటర్స్ ఇచ్చే కేటీఆర్.. రాణీరుద్రమను తన ప్రత్యర్థిగా అసలు భావిస్తారా... భావిస్తే ఎలాంటి కౌంటర్స్ ఉండబోతున్నాయన్న ఓ క్యూరియాసిటీ ఇప్పుడు సిరిసిల్ల ఎన్నికల యుద్ధంలో కనిపిస్తోంది.
అయితే రాణీరుద్రమ అనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ నాయకురాలిని సిరిసిల్లకు తీసుకొచ్చి నిలబెట్టడాన్ని స్థానిక నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న లగిశెట్టి శ్రీనివాస్ వంటి పద్మశాలి నేత బీజేపీ రెబల్ గా సిరిసిల్ల నుంచి బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరోవైపు బీజేపీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసిన ఆవునూరి రమాకాంతరావు కూడా రాణీరుద్రమ రాకతో కమలదళానికి రాజీనామా చేసి.. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పద్మశాలీలు బలంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఆ వర్గం వారికి టిక్కెట్ కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో... సిరిసిల్లలో కేటీఆర్ పై రాణీరుద్రమ ప్రయోగం విఫలమే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఫలితం ఎలా ఉంటుందో ముందే ఊహించడం సరికాదని...ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందు ముందు తెలుస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు.
ఇప్పటికే తన రాకతో పలువురు కీలక నేతలు బీజేపీకి దూరమవుతున్న నేపథ్యంలో.. స్థానికేతర నేతగా రాణీరుద్రమ క్యాడర్ ను, ఇతర లీడర్స్ ను ఎలా కలుపుకుపోగల్గుతుందనే చర్చ మొదలైంది. పటిష్టమైన కేడర్ బలంతో..బీఆర్ఎస్‌లో అగ్రనేతగా ఉన్న కేటీఆర్‌ను సిరిసిల్లలో మొదటిసారిగా ఎదుర్కొంటున్న రాణిరుద్రమ పోరాటం ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం మీద సిరిసిల్ల ఎలక్షన్ ఫైట్ అన్ని నియోజకవర్గాల కంటే ఆసక్తికరంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment