పవర్‌లూమ్స్‌పై పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్న ఇతని పేరు మామిడాల సమ్మయ్య. సిరిసిల్లలోని విద్యానగర్‌కు చెందిన సమ్మయ్య నిత్యం 12 సాంచాలపై పనిచేస్తూ పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. సమ్మయ్యకు వారానికి రూ.2,500 కూలి వస్తుంది. ఇలా ఒక్క సమ్మయ్యనే కాదు.. సిరిసిల్లలో 5 వేల మంది కార్మికులు శ్రమిస్తున్నారు.
జాతీయ జెండాల తయారీపని చేస్తున్న వీరు సిరిసిల్లకు చెందిన మహిళలు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు అవసరమైన జెండాలను సిరిసిల్లలో సిద్ధం చేస్తున్నారు. సిరిసిల్లలో జెండాలు తయారుచేసే పది మంది వ్యాపారులు ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలకు జెండాలను సరఫరా చేస్తున్నారు.
సిరిసిల్ల: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రజల్లో దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా.. మహనీయు ల త్యాగాలు.. పోరాటఫలాలు నేటి తరానికి తెలిసేలా ప్రతి ఇంటిపై జాతీయజెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15కి ముందు వారం, తరువాత మరో వారం రోజులు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తెలంగాణవ్యాప్తంగా 1.20 కోట్ల జాతీయ జెండాలు అవసరం ఉండగా.. పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కోద్వారా కొ నుగోలుచేసి, ఆ వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి, మూడు రంగుల జెండాలను తయారుచే యాలని నిర్ణయించారు. ఈ మేరకు సిరిసిల్ల నేతన్నల వద్ద 30 లక్షల మీటర్ల వస్త్రాన్ని కొ నేందుకు టెస్కో ఆర్డర్లు ఇచ్చింది.
సిరిసిల్లలో 30 లక్షల మీటర్ల వస్త్రం కొనుగోలు..
తెలంగాణవ్యాప్తంగా 38,588 పవర్‌లూమ్స్ ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 28,494 పవర్‌లూమ్స్ ఉన్నాయి. 4,116 సాంచాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. అతి తక్కువ సాంచాలతో (18) సంగారెడ్డి జిల్లా చివరిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, వరంగల్, భువనగిరి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కో కొనుగోలు చేస్తోంది. సిరిసిల్లలోనే 30 లక్షల మీటర్లు కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వస్త్ర నాణ్యత, పొడవు, వెడల్పును బట్టి రూ.13 నుంచి రూ.16 వరకు ఒక్కో మీటరుకు చెల్లించాలని నిర్ణయించారు.
సిద్ధమవుతున్న జెండాలు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సిరిసిల్లకు ఆర్డర్లు వచ్చాయి. దీంతో జెండాలు తయారుచేసే వ్యాపారులు బిజీగా మారా రు. ఇక్కడి పది మంది వ్యాపారులకు 50 లక్షల జెండాల తయారీ ఆర్డర్లు వచ్చాయి. వీటి ద్వారా 1,200 మంది మహిళలు జెండాలు కుడుతూ ఉపాధి పొందుతున్నారు.
ఇది అనుకోని ఆర్డర్
టెస్కో ద్వారా పాలిస్టర్ వస్త్రాన్ని కొనుగోలు చేస్తారని తెలియదు. ఇది అనుకోని ఆర్డర్. నాకు 52 సాంచాలు ఉన్నాయి. నా వద్ద నిల్వ ఉన్న 50 వేల మీటర్ల వస్త్రాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నా. టెస్కో కొనుగోలు చేయడం ఆనందంగా ఉంది.
– కోడం విజయ్, వస్త్రోత్పత్తిదారుడు, సిరిసిల్ల
ఢిల్లీకి 5 లక్షల జెండాలు ఇస్తున్నా..
నాకు ఢిల్లీ నుంచి జూలై 10న ఐదు లక్షల జెండాల ఆర్డర్లు వచ్చాయి. కొంచెం ముందుగా ఆర్డర్లు వస్తే ఇంకా బాగుండేది. ఇప్పుడు చాలా రాష్ట్రాల ఆర్డర్లు వస్తున్నాయి. కానీ సమయం సరిపోదు. నా వద్ద ఓ 50 మంది ఉపాధి పొందుతున్నారు.
– ద్యావనపల్లి మురళి, వ్యాపారి, సిరిసిల్ల
నెలకు రూ.6 వేలు సంపాదిస్తున్న
నేను బీడీలు చేసిన. ఆ పని కష్టంగా ఉండటంతో జెండాలు కుట్టడం, ప్యాకింగ్ చేయడం చేస్తున్న. నెలకు రూ.6వేలు సంపాదిస్తున్న. మా ఆయన సాంబశివ సాంచాలు నడుపుతారు. మాకు ఇద్దరు పిల్లలు. ఈ పని బాగుంది. నాలాగే చాలా మంది ఈ పని చేస్తున్నారు.
– వెల్దండి శైలజ, సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment