సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మకంగా ఫార్ములా ఈ-రేస్ నిర్వహించనున్న నేపథ్యంలో నగరంలోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. అంతేకాదు.. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ట్యాంక్‌బండ్‌పై సందర్శక ప్రాంతాలను మూసేయనున్నారు.
ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులను ఈ నెల 18(శుక్రవారం) నుంచి బంద్ చేయనున్నారు. ఈ మూసివేత 20వ తేదీ వరకు ఉంటుంది. తిరిగి 21వ తేదీ నుంచి వాటిని తెరుస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్‌కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది.
ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. సాగర తీరాన ట్రాక్ పనులు, గ్యాలరీ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలను 16వ తేదీ రాత్రి పది గంటల నుంచి 20వ తేదీ రాత్రి పది గంటల వరకు అమలు చేస్తామని ఇది వరకే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు మొదలయ్యాయి. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఖైతరాబాద్ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కంపౌండ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయం రూట్, ట్యాంక్‌బండ్ పరిసరాలలో వెళ్లవద్దని ట్రాఫిక్ జాయింట్ సీపీ వాహనదారులకు సూచించారు. అనసవసరంగా ఆ రూట్‌లలో వెళ్లి ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment