
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మానవపాడు(మహబూబ్‌నగర్): జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో వెలుగు చూసిన లంకె బిందె వ్యవహారం లింకు దొరికింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న కూలీల నుంచి రూ.4.60 లక్షలు, 12.12 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్ సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... మానవపాడులో రెండు నెలల క్రితం జనార్దన్‌రెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాది తీస్తుండగా కూలీలకు మట్టికుండలో 98 చిన్న బంగారు నాణేలు లభించాయి. వాటిని 9 మంది కూలీలు పంచుకున్నారు.
11 నాణేలు కలిపి దాదాపు 3 తులాల వరకు ఉంటాయి. నాణేలను బంగారు దుకాణాల్లో అమ్మేసి, ఎవరికి వారు ఆభరణాలు తయారు చేయించుకున్నారు. కొందరేమో డబ్బులు తీసేసుకున్నారు. ఈ విషయం ఇంటి యజమానికిగానీ, అధికారులకుగానీ తెలియదు. ‘జూలై 28న పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపాం. కూలీలను పిలిపించి మాట్లాడాం. వారి నుంచి 12.12 తులాల బంగారం, రూ.4.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. తొమ్మిది మందిని అరెస్టు చేశాం’ అని సీఐ తెలిపారు.