గ్రీన్‌హౌస్ పద్ధతిలో సాగుతో బతుకు పూల బాట అవుతుందని, పూలు, కూరగాయల సాగు సిరులు కురిపిస్తుందని భావించారంతా. కానీ ఈ ఏడాది రాష్ట్రంలో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి గ్రీన్‌హౌస్ (పాలీహౌస్) పద్ధతిలో సాగు చేపట్టిన రైతులు కోలుకోలేని విధంగా కుదేలయ్యారు. ప్రపంచాన్ని అన్ని విధాలా అతలాకుతలం చేసిన కరోనా గ్రీన్‌హౌస్ రైతులనూ కాటేసింది. భారీ నష్టాల్లోకి నెట్టేసింది. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారింది. సబ్సిడీ సొమ్ము సైతం రాకపోవడంతో అప్పుల ఊబిలో మునిగిపోయారు. అప్పులు తీర్చేందుకు కొందరు ఇంట్లో బంగారం అమ్ముకుంటే మరికొందరు భూములే అమ్మేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమంది గ్రీన్‌హౌస్ సాగుకే స్వస్తి పలుకుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: సాధారణ సాగు పద్ధతులతో ఆదాయం అంతంత మాత్రమే. ఏ పంట వేసినా కాలం కలసివస్తేనే బతుకు. లేకుంటే నష్టాలపాలే. ఈ నేపథ్యంలో 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌ను ప్రోత్సహించింది. ప్రత్యేకంగా నిర్మించిన షెడ్ల వంటి వాటి కింద ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ, చీడపీడలకు తావుండని ఈ పద్ధతిలో రైతులు పంటలు పండిస్తే రైతులు ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంటుందని భావించింది. గ్రీన్‌హౌస్‌కు అయ్యే ఖర్చులో ఎక్కువ శాతం సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఏకంగా 95 శాతం, ఇతర వర్గాల రైతులకు 75 శాతం సబ్సిడీ ఇచ్చారు. దీంతో అనేకమంది రైతులు గ్రీన్‌హౌస్ పద్ధతిలో సాగుకు ముందుకు వచ్చారు. ఎకరా స్థలంలో గ్రీన్‌హౌస్ చేపట్టాలంటే రూ. 33.76 లక్షలు వ్యయం కాగా, అందులో ఎస్సీ, ఎస్టీలకు రూ. 32.07 లక్షలు సబ్సిడీ లభిస్తుంది.
ఇతర వర్గాలకు రూ. 25.32 లక్షలు సబ్సిడీ వస్తుంది. ఈ మేరకు 2014–15లో రూ. 250 కోట్లు, 2015–16లో మరో రూ. 250 కోట్లు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. మొదటి ఏడాది (2014–15లో) 71 మంది రైతులు 108 ఎకరాల్లో గ్రీన్‌హౌస్ నిర్మాణాలు చేపట్టారు. ఆ తర్వాత 2015–16లో ఏకంగా 419 మంది రైతులు వీటిని చేపట్టారు. ప్రస్తుతం వీరి సంఖ్య 988కి చేరింది. 2020–21లో 1,210 ఎకరాల్లో గ్రీన్‌హౌస్ సాగు జరిగింది. మొదటి ఐదేళ్లూ బాగానే సాగింది. ఈ ఏడాది కరోనా రూపంలో విధి వంచించింది.
కరోనా దెబ్బతో విలవిల
రాష్ట్రంలో పూలు, కూరగాయల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర అవసరాల్లో కేవలం 30 నుంచి 40% మేరకే స్థానికంగా లభ్యమవుతాయి. మిగతా అవస రాలకు ఇతర ప్రాంతాలపైనే ఆధారపడుతున్నాం. పూలు, కూరగాయల సాగుకు గ్రీన్‌హౌస్‌లు ఎక్కువ అనుకూలమైనవి కావడంతో రాష్ట్ర రైతులు వాటిని సాగు చేయడం ప్రారంభించారు. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది 600 ఎకరాల్లో జరబెర, 150 ఎకరాల్లో గులాబీ, చామంతి తదితర పూల సాగు చేశారు. మిగిలిన ఎకరాల్లో కూరగాయల సాగు చేశారు. గతంలో జరబెర వంటి పూల సాగుతో రైతులు మంచి లాభాలు పొందారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి రాష్ట్రాలకు కూడా పూలను ఎగుమతి చేశారు.
కానీ ఈ ఏడాది పూలు కోసి మార్కెట్లోకి తీసుకువచ్చే సరికి లాక్‌డౌన్ మొదలైంది. ఎక్కడికక్కడ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు నిలిచిపోయాయి. పూలను నిల్వ ఉంచడానికి వీలుకాని పరిస్థితుల్లో వందలాది ఎకరాల్లోని క్వింటాళ్ల కొద్దీ పూలు వాడిపోయాయి. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కూరగాయలదీ అదే పరిస్థితి. లాక్‌డౌన్ ఎత్తేసినా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగు పడలేదు. దీంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. మరోవైపు ఉద్యానశాఖ నుంచి రైతులకు అందాల్సిన సబ్సిడీ సొమ్ము నిలిచిపోయింది. 2018–19 వరకు మాత్రమే ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌కు నిధులు కేటాయించింది. ఉద్యానశాఖ లెక్కల ప్రకారం రూ.42 కోట్లు రైతులకు బకాయి ఉంది. గ్రీన్‌హౌస్ నిర్మాణాలకు, ఆ తర్వాత సాగుకు చేసిన లక్షలాది రూపాయల అప్పును తీర్చేందుకు భూములు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు అంటున్నారు.
రూ.18 లక్షలు పెడితే పైసా రాలేదు
నేను ఈ ఏడాది ఆరెకరాల్లో గ్రీన్‌హౌస్ సాగు చేపట్టి చామంతి, జరబెర వేశా. చామంతి కటింగ్ చేస్తున్నప్పుడు లాక్‌డౌన్ వచ్చింది. ఏం చేయడానికీ పాలుపోని పరిస్థితి. రూ.18 లక్షలు పెట్టుబడి పెడితే పైసా రాలేదు. రూ.25 లక్షల విలువైన పూలు మట్టిలో కలిసిపోయాయి. మరోవైపు ఉద్యానశాఖ నుంచి రావాల్సిన సబ్సిడీ సొమ్ము రూ.11.50 లక్షలు కూడా రాలేదు. దీంతో కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోయా. ఇప్పుడు పాలీహౌస్‌లో ఏమీ సాగు చేయడం లేదు. –ఇమ్మడి శ్రీనివాస్, నర్సాపూర్, మెదక్ జిల్లా
గ్రీన్‌హౌస్ పంటలకు గ్యారంటీ లేదు
రెండున్నర ఎకరాల్లో గ్రీన్‌హౌస్ చేపట్టి పూల సాగు చేస్తున్నా. కానీ అనుకున్నంత లాభాలు రాలేదు. ఈ ఏడాది కరోనా దెబ్బకొట్టింది. కీలకమైన సమయంలో పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు జరగకపోవడంతో రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. కరోనా పరిస్థితుల్లో ధైర్యం సరిపోక మళ్లీ జూన్, జూలైల్లో మొక్కలు నాటలేదు. పైగా గ్రీన్‌హౌస్ పంటలకు గ్యారంటీ లేదు. – నవీన్‌కుమార్, నిజామాబాద్
23 లక్షల సబ్సిడీ సొమ్ము రావాలి
రెండెకరాల్లో పాలీ హౌస్ వేశాను. రూ.30 లక్షలు ఖర్చు చేశాను. ఫ్లాంటేషన్ సబ్సిడీ కింద ఉద్యానశాఖ నుంచి నాకు రూ.23 లక్షలు రావాలి. ఏడాదిన్నర నుంచి రాలేదు. మరోవైపు కరోనా వల్ల పూల మార్కెటింగ్ జరగలేదు. దీంతో నాకు రూ.12 లక్షల నష్టం వాటిల్లింది. – రమావత్ తిరుపతి నాయక్, చెన్నారం, కొండమల్లేపల్లి మండలం, నల్లగొండ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment