రామగుండం క్రైం: రోడ్డుపై వంద రూపాయలు దొరికితే.. ఎవరూ చూడకుండా టక్కున జేబులో పెట్టుకునే ఈ రోజుల్లో రామగుండం పారిశ్రామిక ప్రాంత ఆటోడ్రైవర్లు నిజాయితీకి మారుపేరుగా నిలుస్తున్నారు. ప్రయాణికులు హడావుడిలో తమ వాహనాల్లో మరిచిపోయిన సొమ్మును తిరిగి వారికి అప్పగిస్తున్నారు. నగదు, ఆభరణాలు కళ్ల ముందే ఉన్నా కాజేయాలనే ఆలోచన చేయకుండా వాటిని పోగొట్టుకునేవారు పడే బాధను పెద్ద మనసుతో అర్థం చేసుకుంటున్నారు. ఆటో యూనియన్ నాయకులు, పోలీసుల సహకారంతో సొత్తును అప్పగిస్తూ అటు బాధితుల ప్రశంసలు.. ఇటు పోలీసుల అభినందనలు అందుకుంటున్నారు. గతంలో ఈ ప్రాంత ఆటోడ్రైవర్లు అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడేవారనే అపఖ్యాతి ఉండేది. ఇప్పుడు అది చెరిగిపోయింది. క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం చాటుకుంటూ హ్యాట్సాఫ్ అనిపించుకుంటున్నారు.
12 తులాల బంగారు ఆభరణాలు..
గోదావరిఖని తిలక్‌నగర్ డౌన్‌కు చెందిన హలీమా శుక్రవారం పనిమీద బస్టాండ్ కాలనీకి వెళ్లింది. అక్కడ 12 తులాల బంగారు ఆభరణాలు బ్యాగులో వేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు మున్సి పల్ ఆఫీస్ వద్ద ఆటో ఎక్కింది. తర్వాత బ్యాగును ఆటోలోనే మరిచిపోయి ఇంటికి వెళ్లింది. కాసేపటికి గుర్తించిన ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే తన ఆటోలో బ్యాగు ఉన్న విషయం గుర్తించిన రమేశ్‌నగర్ ఆటో అడ్డాకు చెందిన ఆటోడ్రైవర్ మహమ్మద్ అజ్గర్ ఉరఫ్ అజ్జు అడ్డా వద్దకు చేరుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన క్రైమ్ పార్టీ పోలీసుల సాయంతో బ్యాగును పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. పోలీసులు దాన్ని శనివారం ఆటోడ్రైవర్ చేతుల మీదుగా బాధిత మహిళకు అందించారు. నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్‌ను సీఐ రమేశ్‌బాబు, ఆటో యూనియన్ నాయకులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నరసరావు పేటకు చెందిన బంగారం వ్యాపారులు తమ వ్యాపారం నిమిత్తం గత నెల 23న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి కారులో బయలుదేరారు. రామగుండం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్యాలపల్లి రైల్వే బ్రిడ్జి కింద మూలమలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. 108 సిబ్బంది వారిని గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది తోట రాజేందర్, ఎండీ.చాంద్‌పాషాలు క్షతగాత్రుల వద్ద లభించిన సుమారు కేజీ బంగారాన్ని పోలీసులకు అందించారు. వారిని సీఐ కరుణాకర్, ఎస్సై మామిడి శైలజ అభినందించారు.
పెళ్లికి వస్తూ నగలు మరిచిపోయి..
2020 డిసెంబర్ 3న కొత్తగూడెం గౌతమీపూర్‌కు చెందిన కల్లేపల్లి లింగయ్య గోదావరిఖనిలో ఉంటున్న సోదరుడి కూతురు పెళ్లి కోసం వచ్చాడు. తన వెంట బంగారు ఆభరణాలు, నగదు తీసుకొచ్చాడు. ఉదయం గోదావరిఖని బస్టాండ్‌లో బస్ దిగి గాంధీనగర్‌కు ఆటోలో వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగ్ ఆటోలో మరిచిపోయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు బస్టాండ్‌కు వెళ్లి, సీసీ పుటేజీ ఆధారంగా గొల్ల శ్రీనివాస్ ఆటోగా గుర్తించారు. అతడిని ఫోన్‌లో సంప్రదించగా, బ్యాగ్ గురించి తనకు తెలియదని.. తన తమ్ముడి ఆరోగ్యం బాగా లేక కరీంనగర్ వచ్చానని తెలిపాడు. ఎందుకైనా మంచిది ఆటోలో సీటు వెనక ఒకసారి చెక్ చేయాలని పోలీసులు సూచించాడు. వారు సీటు వెనక చూడగా 35 గ్రాముల బంగారం, రూ.54 వేలు ఉన్న బ్యాగు దొరికింది. దీంతో బాధితులు కరీంనగర్ వెళ్లి బ్యాగు తీసుకున్నారు. నిజాయితీగా సొత్తు అప్పగించిన ఆటోడ్రైవర్ శ్రీనివాస్‌ను అభినందించారు.
బంధువుల ఇంటికి వస్తూ..
హైదరాబాద్‌కి చెందిన ఆవుల అజయ్ ఫ్యావిులీతో గోదావరిఖనిలో బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి హాజరయ్యేందుకు 2018 ఫిబ్రవరి 23న సికింద్రాబాద్–కాగజ్‌నగర్ రైలులో వచ్చారు. రాత్రి రామగుండం రైల్వేస్టేషన్‌లో దిగి, ఎండీ.తహరొదీ్దన్ ఆటో ఎక్కి గోదావరిఖని బస్టాండ్‌లో దిగారు. ఈ క్రమంలో బ్యాగును అందులోనే మరిచిపోయినట్లు ఇంటికెళ్లాక గుర్తించారు. అందులో 6 తులాల బంగారు ఆభరణాలు, ఖరీదైన దుస్తులు ఉండటంతో వెంటనే ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నీలారపు రవికి సమాచారం ఇచ్చారు. అయితే ఆటోడ్రైవర్ తహరొద్దీన్ మరునాడు ఉదయం ఆటోలో బ్యాగును గుర్తించి, యూనియన్ ప్రెసిడెంట్‌కు తెలిపాడు. వెంటనే ఇద్దరూ ఆటోడ్రైవర్లతో కలిసి బ్యాగుతో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పోలీసులకు అప్పగించారు. బ్యాగును తనిఖీ చేసిన బాధితులు అన్నీ సరిగా ఉన్నాయని చెప్పడంతో ఆటోడ్రైవర్‌ను పోలీసులు అభినందించారు.
ఊరికి వెళ్లే తొందరలో..
గోదావరిఖని అశోక్‌నగర్‌కు చెందిన కాసర్ల భారతి 2020 జూలై 8న కరీంనగర్ వెళ్లేందుకు గోదావరి ఖని బస్టాండ్‌కు రావడం కోసం గాంధీ చౌరస్తాలో ఆటో ఎక్కింది. బస్టాండ్‌లో పాయింట్ వద్ద బస్సు సిద్ధంగా ఉండటంతో ఊరికి వెళ్లాలనే తొందరలో ఆటో దిగుతుండగా ఆమె పర్సు అందులోనే పడిపోయింది. బస్సు ఎక్కిన తర్వాత పర్సు కనిపించకపోవడంతో వెంటనే దిగి ఆటో డ్రైవర్ కోసం గాలి ంచింది. అతను కనిపించకపోవడంతో ట్రాఫిక్ పో లీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాసేపటికి ఆటోడ్రైవర్ బస్టాండ్ ఆటో అడ్డా యూనియన్ ప్రెసిడెంట్ కనుకుంట్ల నారాయణకు తనకు పర్సు దొరికిందని తీసుకెళ్లి ఇచ్చాడు. ఇద్దరూ దాన్ని ఓపెన్ చేయకుండానే పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పోలీసులకు అప్పగించా రు. ప్రయాణికురాలి ముందు పర్సు ఓపెన్ చేయగా అందులో తులం బంగారం, రూ.5 వేలు ఉన్నా యి. భారతి అవి తనవే అని చెప్పడంతో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్ల సమక్షంలో బాధితురాలికి అందజేశారు. నారాయణను పోలీసులు, బాధితురాలు అభినందించారు.
మహిళ ప్రాణాలు కాపాడి...
గోదావరిఖని శివారులోని గోదావరి వంతెన పైనుంచి మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ఓ మహిళ నదిలో దూకింది. ఆ సమయంలో గోదావరిఖని నుంచి ప్రయాణికులను తీసుకొని ఆటోడ్రైవర్ రహ్మత్‌బేగ్ మంచిర్యాల వైపు వెళ్తున్నాడు. వంతెన వద్ద జనం గుమిగూడి ఉండటంతో ఏం జరిగిందని అక్కడి వారిని ఆరా తీయగా.. మహిళ నదిలో దూ కిందని చెప్పారు. వెంటనే ఆటో దిగి, నదిలో మహిళ కొట్టుకోవడం గమనించాడు. ఆలస్యం చేయకుండా ప్రాణాలకు తెగించి దూకేశాడు. వెంటనే పైన ఉన్నవారు వేసిన తాడు సాయంతో ఈదుకుంటూ మహి ళ దగ్గరకు వెళ్లి కాపాడాడు. తర్వాత పడవ ఎక్కించాడు. అయితే అంతలోతు నీటిలో ఆమెను కాపాడటంతో తాను కూడా అలసిపోయానని బేగ్ తెలి పాడు. చివకు బాధితురాలిని ప్రాణాలతో బయటకు తీసుకురావడం సంతోషంగా ఉందని చెప్పాడు.
ఒకప్పుడు భయపడేవారు..
రామగుండం పారిశ్రామిక ప్రాంత ఆటోడ్రైవర్లు అంటే ప్రయాణికులు ఒకప్పుడు భయపడేవారు. కానీ ఇప్పుడు నిజాయితీకి మారుపేరుగా నిలవడం సంతోషంగా ఉంది. పోలీసులు మాకు కౌన్సెలింగ్ ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, సూచనలు ఇస్తున్నారు. డ్రైవర్లు మా యూనియన్ నాయకులకు, యూనియన్‌కు మంచి పేరు తీసుకురావడం గర్వంగా ఉంది. – నీలారపు రవి, ఆటో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment