సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల సమాచారం ఇవ్వాలంటూ ప్రజలను ఒత్తిడి చేయ రాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వ్యవసాయ భూముల వివరాల సేకరణకు సంబం ధించి ఆధార్ నంబర్, కులం వివరాలు సేకరించొ ద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే సేకరించిన కోటి మంది ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని ఆదేశించింది. సమర్థమైన చట్టాలు రూపకల్పన చేయకపోతే ప్రజలకు శాపంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది.
ప్రజల నుంచి ఆస్తులకు సం బంధించి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా సమాచారం సేకరిస్తోందని, సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఆధార్, కులం వివరాలు తప్పనిసరిగా అడుగుతోం దని న్యాయవాదులు ఐ.గోపాల్‌శర్మ, సాకేత్ కాశీ భట్లతో పాటు పలువురు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ‘వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి ప్రజల నుంచి సేకరించిన సమాచారానికి భద్రత ఎలా కల్పిస్తారు? ఏ స్థాయి అధికారి అధీనంలో ఈ సమాచారం ఉంటుంది? ఈ సమాచారాన్ని పరిశీలించే అధీకృత అధికారం ఎవరికి ఉంటుంది? సమాచారం బయటకు వెళ్లకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఏ చట్టం ప్రకారం వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు? ఏ నిబంధన ప్రకారం ఆధార్ నంబర్, కులం వివరాలు అడుగుతున్నారు? వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి యజమానితో పాటు ఇతర కుటుంబసభ్యుల ఆధార్ నంబర్లను ఎందుకు అడుగుతున్నారు? ఈ ప్రక్రియ ప్రజల వ్యక్తిగత విషయాల గోప్యతకు విఘాతం కలిగించేదిగా ఉంది.
ఈ సమాచారాన్ని ఇతరులతో పాటు ప్రభుత్వం దుర్వినియోగం చేయదనే నమ్మకం ఏంటి?’అంటూ ధర్మాసనం ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వం ఇటీవల తెచ్చిన కొత్త చట్టంలోనూ సేకరించిన సమాచార భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయలేదని పేర్కొంది. ఏ అధీకృత అధికారి పర్యవేక్షణలో ఈ సమాచారం ఉంటుందో కూడా చట్టంలో లేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా ఉందంటూ మండిపడింది. కాగా, ఈ వ్యవహారంపై 2 వారాల సమయం ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం.. ఈ నెల 17లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.
ధరణిలాగే మరో నాలుగు యాప్స్...
‘ప్రభుత్వం తీసుకొస్తున్న ధరణిని పోలిన నాలుగు యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏది ప్రభుత్వం నిర్వహిస్తున్నదో తెలుసుకోవడం కష్టంగా ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాచారాన్నే హ్యాక్ చేసినట్లుగా పత్రికల్లో కథనాలు చూశాం. ప్రభుత్వం సేకరించిన సమాచారాన్ని హ్యాకర్స్, ఇతరులు తస్కరించకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఈ సమాచారాన్ని హ్యాక్ చేయరనే భరోసా ఏంటి? ఆధార్ వివరాలను సంక్షేమ పథకాల అమలులో భాగంగా మాత్రమే తీసుకోవాలని సుప్రీం కోర్టు పుత్తస్వామి కేసులో స్పష్టమైన తీర్పునిచ్చింది. అయినా 2020లో తెచ్చిన చట్టంలో పేర్కొనకుండా, సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఆధార్ వివరాలను ఎందుకు సేకరిస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ మా ఇంటికీ వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. అయితే వచ్చిన వారు ప్రభుత్వ అధికారులేనా? వ్యవసాయ భూముల వివరాల సేకరణకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన పట్టాదారు పాస్‌బుక్, భూ హక్కుల చట్టం–2020 వ్యవసాయ భూములకు మాత్రమే. అలాంటప్పుడు వ్యవసాయేతర ఆస్తుల వివరాలు కోరడం చట్టబద్దం కాదు’అంటూ ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.
కర్ణాటకలో కొట్టేశాం..
‘ఉబర్ క్యాబ్స్‌కు సంబంధించి.. క్యాబ్ బుక్ చేసుకున్న వారి ఫోన్ నంబర్‌ను ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా తెలుసుకునేలా కర్ణాటక ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఈ మేరకు ఐటీ, ఇతర చట్టాల మేరకు మార్గదర్శకాలు రూపొందించింది. అయితే అప్పడు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఈ కేసును సుదీర్ఘంగా విచారించి ఆ మార్గదర్శకాలను కొట్టేశాను’అని జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ స్పష్టం చేశారు.
ఇంచు భూమి కూడా రిజిస్ట్రేషన్ చేయరట..
ధరణిలో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోకకపోతే ఇంచు భూమి కూడా ఇతరులకు అమ్ముకోలేరంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా పత్రికల్లో కథనాలు వచ్చాయని సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి నివేదించారు. వ్యవసాయేతర ఆస్తుల సేకరణ చట్ట విరుద్ధమని, ఆధార్, కులం వివరాలు అడగడం సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధమని న్యాయవాది వివేక్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద కోరిన వారికి ఇవ్వాల్సి ఉంటుందని మరో న్యాయవాది సుమన్ పేర్కొన్నారు.
మెరుగైన పాలన కోసమే..
భూ క్రయవిక్రయాల్లో మోసాలను అరికట్టేందుకు, మెరుగైన పాలన కోసమే ప్రజల నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాలు సేకరిస్తున్నామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు తదితర సంక్షేమ పథకాల కోసమే వ్యవసాయేతర ఆస్తుల వివరాలు అడుగుతున్నామని పేర్కొన్నారు. అయితే ఎలాంటి ఆస్తులు లేని వారికే కదా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేది అంటూ ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment