హైదరాబాద్, సాక్షి: ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్టు అయ్యారు. బుధవారం ఆయన ఇంట్లో చేసిన తనిఖీల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. సోదాలు పూర్తి కావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేపు ఆయన్ని కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి.
‘‘బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నాం. రేపు ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తాం. ఆ తర్వాత కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుంటాం. తనిఖీల సమయంలో కుటుంబ సభ్యులెవరూ మాకు సహకరించలేదు’’ అని ఏసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు శివబాలకృష్ణ ఇంట్లో సోదాలు ముగియగా.. మరో నాలుగు చోట్ల మాత్రం ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇంకోవైపు ఆయన బ్యాంకు లాకర్స్‌ను ఏసీబీ అధికారులు తెరవనున్నారు.
మొత్తం 20 చోట్ల తనిఖీలు చేపట్టిన ఏసీబీ.. భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలకు స్వాధీనం చేసుకుంది. తన పదవిని, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో సన్నిహిత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అంచనా వేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే శివబాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్థుల కేసు నమోదు అయ్యింది.
గుర్తించిన ఆస్తులు ఇవే..
- రూ. 40 లక్షల నగదు, ఐదుకోట్ల విలువైన బంగారం
- భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం
- 70 ఎకరాల భూమి, ఇండ్లు
- 60 ఖరీదైన చేతి గడియారాలు..
- 100 మొబైల్ ఫోన్లు(భారీగా ఐఫోన్లు), నాలుగు కార్లు
- భారీగా ల్యాప్ టాప్స్
వీటితో పాటు ఇంట్లోనే ఆయన క్యాష్ కౌంటింగ్ యంత్రాలు ఉంచుకోవడం గమనార్హం. అలాగే.. ఆయన బ్యాంకు లాకర్లు తెరవడంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు ముగిస్తే మరికొన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శివ బాలకృష్ణతో సంబంధం ఉన్న అధికారులను వదలకుండా ప్రశ్నిస్తామని ఏసీబీ తాజాగా ప్రకటించింది.
ఇక బుధవారం సాయంత్రం వరకు స్వాదీనం చేసుకున్న ఆస్తుల విలువే బహిరంగ మార్కెట్లో రూ.వంద కోట్లకుపైగానే ఉందని తేలింది. ఏసీబీ దాడుల్లో ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడటం ఇదే తొలి సారి అని అధికారులు పేర్కొంటున్నారు.
‘‘బాలకృష్ణ 2018–2023 మధ్య హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా కొనసాగారు. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో శివబాలకృష్ణ భారీగా అవినీతికి పాల్పడి, అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఫిర్యాదులు ఉన్నాయి. భారీ ఎత్తున అతి విలువైన భూముల పత్రాలు దొరికాయి. అవన్నీ బినామీల పేరిట కొనుగోలు చేశారు. వాటిని పరిశీలిస్తున్నాం. బాలకృష్ణ ఇంట్లో రూ.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. ఇంకా బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉంది..’’అని ఏసీబీ డీజీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment