ఇంట్లోనే థియేటర్‌! | Home theater growing trend across the country | Sakshi
Sakshi News home page

ఇంట్లోనే థియేటర్‌!

Published Tue, Dec 26 2023 6:16 AM | Last Updated on Tue, Dec 26 2023 7:22 AM

Home theater growing trend across the country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  భారీ తెర.. 4కే నాణ్యతతో దృశ్యాలు.. నలువైపుల నుంచి ప్రతిధ్వనించే సరౌండ్‌ సౌండ్‌ సాంకేతికత.. చీకటి పరుచుకున్న పెద్ద హాల్లో చల్లగా తాకే ఏసీ గాలి... ఒకేసారి వందలాది మందితో కలసి సౌకర్యవంతమైన సీట్లలో కూర్చొని చూసే వీలు.. దీనికితోడు ఈలలు, చప్పట్లతో హోరెత్తించే అభిమానులు... ఇదీ మల్టీప్లెక్స్‌లు లేదా థియేటర్లలో సినీ వీక్షకులకు కలిగే అనుభూతి. మరి ఇదే భారీతనం ఇంట్లోనే లభిస్తే..! అవును.. ప్రజలు ఇప్పుడు క్రమంగా థియేటర్‌ను ఇంటికే తెచ్చేసుకుంటున్నారు. ఈ హోం థియేటర్‌ ట్రెండ్‌ దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలకూ పాకుతోంది. 

అడ్డంకులు లేని అనుభూతి.. 
మార్కెట్‌లో భారీ తెరల టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆడియో నాణ్యత విషయంలో పరిమితులు నెలకొన్నాయి. కానీ అదే హోం థియేటర్లో ఇటువంటి అడ్డంకులు ఏవీ ఉండవు. నచ్చిన సైజులో స్క్రీన్, ఖరీదైన సౌండ్‌ సిస్టంను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు ఉంటోంది. దీనికితోడు నచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సరదాగా గడుపుతూ థియేటర్‌ ముందు కాలక్షేపం చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇక అనుభూతి అంటారా.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. మీరు ఖర్చు చేసినదాన్నిబట్టి థియేటర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ మారుతుంది. 

పెరిగిన డిమాండ్‌.. 
మూడు గదుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అపార్ట్‌మెంట్లు, విల్లాల్లో నిర్మాణ సంస్థలు సైతం ప్రత్యేకంగా హోం థియేటర్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏటా భారత్‌లో సుమారు 1,25,000 హోం థియేటర్లు ఏర్పాటవుతుండటం విశేషం. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాటా దాదాపు 5,000 యూనిట్లుగా ఉంటోంది. 

ఓటీటీల రాకతో... 
దేశంలో ఓటీటీలకు పెద్దగా ఆదరణ లేనప్పుడు హోం థియే­టర్‌ విభాగం వృద్ధి కేవలం 20 శాతంగానే ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఏకంగా ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇప్పుడు స్థానిక భాషల్లో­నూ ఓటీటీల్లో కంటెంట్‌ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. హోం థియేటర్లో సినిమాలను 50 శాతం మంది చూస్తుంటే స్పోర్ట్స్‌ను 25 శాతం, వెబ్‌ సిరీస్‌లను 25 శాతం మంది వీక్షిస్తున్నారట.  

ఖర్చు ఎంతంటే.. 
మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో సంపన్నులు 15–30 సీట్ల సామర్థ్యంగల లగ్జరీ హోం థియేటర్లను కోరుకుంటున్నా­రు. ఇందుకోసం రూ. 50 లక్షలు మొదలుకొని రూ. 3 కోట్ల వర­కు ఖర్చు చేస్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈ విభాగం వాటా 5 శాతం ఉంటోంది. అలాగే 6–12 సీట్ల సామర్థ్యం ఉ­న్న హోం థియేటర్ల వాటా 25 శాతంగా ఉంది. వాటికి అయ్యే వ్యయం రూ. 15–50 లక్షల శ్రేణిలో ఉంది. ఇక ఎకానమీ విభాగంలో రూ. 5–15 లక్షల వ్యయంలో 4–10 సీట్ల­తో హోం థియేటర్లను ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. 

రూ.7 కోట్ల ఖరీదు చేసే స్పీకర్లు.. 
ప్రస్తుతం డాల్బీ అటా్మస్, ఆరో 3డీ, డీటీఎస్‌ ఎక్స్‌ ఆడియో ఫార్మాట్స్‌ ఉన్నాయి. హోం థియేటర్‌ కోసం ఇళ్లలో స్క్రీన్‌ తప్ప­నిసరి కాదు. కానీ థియేటర్‌ ఫీల్‌ కావాలంటే మాత్రం స్క్రీన్‌ ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేజర్‌ ప్రొజెక్టర్ల వైపు మార్కెట్‌ మళ్లుతోంది. వాటి ధర రూ. 2.5 లక్షలు మొదలుకొని రూ. 1.5 కోట్ల వరకు ఉంది.

మంచి స్పీకర్లు రూ. 50 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు దేశంలో లభిస్తున్నాయి. జర్మనీ బ్రాండ్‌ అయిన టైడల్‌ ఆడియో రెండు స్పీకర్ల ధర రూ. 7 కోట్ల వరకు ఉంది. ఆంప్లిఫయర్‌ ధర రూ. 1.5–20 లక్షలు, ప్రాసెసర్‌ ధర రూ. 50 వేలు మొదలుకొని రూ. 35 లక్ష­ల దాకా పలుకుతోంది. అకౌస్టిక్స్‌ కోసం వాడే మెటీరియల్‌నుబట్టి థియేటర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఆధారపడి ఉంటుంది.

కరోనా తర్వాత పెరిగిన ప్రాధాన్యత
కరోనా వ్యాప్తి తర్వాత ప్రజలు ఎంటర్‌టైన్‌మెంట్‌కు అత్యంత ప్రాధా­న్యత ఇస్తున్నారు. కాబట్టే హోం థియేటర్లకు డిమాండ్‌ పెరిగింది. ప్రైవసీ కోరుకొనే వాళ్లకు హోం థియేటర్‌ చక్కని పరిష్కారం. సంప్రదాయ థియేటర్‌ను మించి హోం థియేటర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఉంటుంది. ఆడియో క్వాలిటీ 100 శాతంపైగా మెరుగ్గా ఉంటుంది. నీటి తుంపర, సీటు కదలడం వంటి స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఇప్పటివరకు 2 వేలకుపైగా హోం థియేటర్లను ఏర్పాటు చేశాం. – ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్‌ సిస్టమ్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement