ప్రతీకాత్మక చిత్రం
నల్లగొండ టూటౌన్, మిర్యాలగూడ టౌన్, దేవరకొండ : ఎక్కడ పడితే అక్కడే కోతలు.. ఎవరి ఇష్టం ఉన్నవి వారు ఎక్కడైనా కోసేసుకోవచ్చు.. అవి రోగాలు ఉన్నవా.. లేనివా చూసి పరీక్షించే వారులేరు. అవి ఆడవా.. మగవా అనేది కూడా ఎవరికీ తెలియదు. శుభ్రం ఉండదు. నీరు సక్రమంగా ఉండవు. ఇదీ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో జంతు వధలు సాగుతున్న పద్ధతి. వీటన్నింటికీ ప్రధాన కారణం వధశాలలు లేకపోవడమే.
దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూ డ, దేవరకొండలో రోడ్లపైనే మటన్ విక్రయాలు సా గుతున్నాయి. గొర్రెలు, మేకల ద్వారా అంత్రాక్స్ వ్యాధులు వస్తున్నాయనే ప్రచారం సాగిన సమయంలో అధికారులు మటన్‌షాపుల వద్దకు వచ్చి హాల్‌చల్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కనీసం మటన్‌షాపు నిర్వాహకులు కోస్తున్న గొర్రెలు, మేకలను ఆరోగ్యంగా ఉంటున్నాయా లేదా అనేది పరీక్షించే అధికారి జాడ కూడా లేకుండా పోయింది. మున్సిపల్ శానిటరీ విభాగం అధికారులు మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు మాంసం కొనాలంటే హడలిపోతున్నారు.
(చదవండి: Vikarabad: ఇక్కడ డీజిల్ లీటర్ రూ.95, కర్ణాటకలో రూ. 85)
నల్లగొండలో రోడ్డు వెంట సాగుతున్న వధ
ధ్రువీకరించాకే వధించాలి..
వధించే గొర్రెలు, గొర్రె పొట్టేళ్లు, మేకలు, మేక పోతులు తదితర వాటిని అక్కడ పశువైద్యులు పరిశీలించి ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించిన తరువాత మాత్రమే వాటిని కోయాలి. వధశాలలు ఉంటే అక్కడ ప్రభుత్వ నిబంధనలు పక్కాగా అమలయ్యే అవకాశం ఉండేది. వధశాలలు లేకపోవడంతో నిబంధనలు ఏవీ పాటించకుండా ఇష్టానుసారంగా బహిరంగ ప్రదేశాల్లోనే జీవాలను వధిస్తూ మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించకుండానే వినియోగదారుల చెంతకు మాంసం చేరిపోతోంది. అంతే కాకుండా వాటి వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తుండడంతో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నల్లగొండలో శిథిలావస్థలో వధశాల
నీలగిరి పట్టణంలో జంతు వధశాల 40 ఏళ్ల కిందటి వరకు లైన్‌వాడిలో ఉన్నట్లు మాంసం వ్యాపారులు చెబుతున్నారు. దాని స్థానంలో కొత్త భవనం నిర్మించాలని పనులు మొదలు పెట్టగానే అక్కడ మార్కెట్ వద్దంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో నాలుగేళ్ల కిందటనే పనులు నిలిచిపోయాయి. దీని గురించి అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ సరిగా పట్టించుకోకపోవడంతో కోర్టు కేసు పరిష్కారం కాక మార్కెట్ పనులకు మోక్షం కలగడంలేదు. పానగల్ బైపాస్ రోడ్డులో జంతు వధశాల నిర్మాణం చేపట్టాలని భావించినా సాధ్యపడలేదు. దీంతో రోడ్ల వెంటే మాంసం విక్రయాలు సాగుతున్నాయి. పట్టణంలో మాంసం విక్రయించే వారు 40 మంది వరకు ఉండగా, ఇక ఆదివారం మాత్రం దాదాపు 200 మంది జంతు వధ చేసి వ్యాపారం చేస్తున్నారు.
(చదవండి: Vikarabad: కారుతో ఢీకొట్టి పరార్.. ప్రమాదమా? హత్యాయత్నమా?)
నిరుపయోగంగా ఉన్న స్లాటర్ హౌస్
దేవరకొండలో.. రోడ్లపైనే విక్రయాలు
ప్రతి ఆదివారం దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 500 కేజీల వరకు మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ వధశాల లేకపోవడంతో రోడ్ల వెంటే మాంసం విక్రయాలు సాగుతున్నాయి. అధికారుల తనిఖీలు లేకపోవడంతో బక్కచిక్కిన, అనారోగ్యం పాలైన జీవాలను కూడా కొంతమంది వ్యాపారులు వధించి విక్రయిస్తున్నారు. దీంతో డబ్బులు పోసి జబ్బులు తెచ్చుకోక తప్పడం లేదని ప్రజలు మాంసాహార ప్రియులు వాపోతున్నారు. పట్టణంలో వధశాలనిర్మించి సంబంధిత అధికారులు ధ్రువీకరించిన తర్వాతనే మాంసం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వధశాల ఉన్నా.. నిరుపయోగమే
పారిశ్రామికంగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడపడితే అక్కడే మటన్ షాపులు వెలుస్తున్నాయి. పట్టణంలో సుమారు 100–200 వరకు మటన్ షాపులుండగా ఏ ఒక్క దుకాణం వద్ద కూడా మున్సిపల్ అధికారులు పరిశీలించి ముద్ర వేసిన దాఖలాలు లేవు. పట్టణంలోని తడకమళ్ల రోడ్డులోని తాళ్లగడ్డ సమీపంలో నిర్మించిన స్లాటర్ హౌజ్ (కబేళా కేంద్రం) నాలుగేళ్లుగా కోర్టు వివాదంలో ఉండడంతో అది నిరుపయోగంగా మారింది. దీంతో వినియోగదారులు నాణ్యమైన మాసం పొందలేకపోతున్నారు.
జంతు వధశాల నిర్మించాలి
జంతు వధశాల లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ కోస్తున్నారు. వధశాల నిర్మాణం చేపడితే వ్యాపారులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. మటన్ మార్కెట్ నిర్మాణం నిలిచిపోయినా పట్టించుకోవడంలేదు. జంతు వధశాల పెడితే నాణ్యమైన మాంసం వినియోగదారులకు అందుతుంది. వ్యాపారులకు కూడా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
– మహ్మద్ ఆజం, మాంసం వ్యాపారి, నల్లగొండ
ఆరోగ్యమా.. అనారోగ్యమా తెలియదు
ప్రతి వారం మటన్ తీసుకెళ్తాను. వారు కోసేది ఆరోగ్యంగా ఉన్నదా.. అనారోగ్యంగా ఉన్నదా ఎవరికీ తెలియదు. మటన్‌షాపులు పెరుగుతున్నాయి కానీ క్వాలిటీ లేకుండా పోతోంది. వెటర్నరీ, మున్సిపల్ అధికారులు ధ్రువీకరించిన తరువాతనే గోర్రెలు, మేకలు, పొటేళ్లు కోయాలి. కానీ, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. రెగ్యులర్‌గా వచ్చిన వారికి మాత్రమే మంచి మటన్ ఇస్తున్నారు తప్ప కొత్తవారికి ఇబ్బందులు తప్పవు.
– నల్లగుంట్ల నరేష్‌కుమార్, ఇస్లాంపుర, మిర్యాలగూడ
బహిరంగ ప్రదేశాల్లో వధించకూడదు
బహిరంగ ప్రదేశాల్లో జీవాలు (గొర్రె, మేక)లను వధించకూడదు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటాం. దేవరకొండ పట్టణంలో స్లాటర్ హౌస్ నిర్మాణానికి సంబం ధించి స్థలాన్ని పరిశీలిస్తున్నాం. వ్యాపారులు నాణ్యమైన మాంసాన్ని మాత్రమే విక్రయించాలి. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పడేయకూడదు. ఎప్పటికప్పుడు సంబంధిత పశు సంవర్థక శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేపడుతాం.
– వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్, దేవరకొండ
Comments
Please login to add a commentAdd a comment