ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట గెలవకున్నా రచ్చ గెలిచిన వారున్నారు. హైదరాబాద్ నగరంలో రెండు రకాల వాళ్లూ ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్‌గా తొలి అడుగు వేసి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. వీరిలో కార్పొరేటర్‌గా గెలిచిన వారూ, ఓడినవారూ ఉన్నారు. అయినప్పటికీ ఉన్నతపదవులు పొందారు. గతంలో రాజకీయ ప్రముఖుల ఎదుగుదలలో బల్దియాకార్పొరేటర్ పదవి ఎంతో కీలకంగా పని చేసింది. చాలా మంది నేతలు గల్లీ స్థాయి నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగారు. కార్పొరేటర్ ఎన్నికల్లో తొలి అడుగు వేసి.. అనంతరం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా ఎదిగిన నేతలు నగరంలో చాలా మందే ఉన్నారు. వారిలో మంత్రి తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, రాజాసింగ్, తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, రేణుకాచౌదరి తదితరులు ఉన్నారు. ఎంఐఎం వ్యవస్థాపకుడు.. సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ సైతం నగరపాలకసంస్థ కార్పొరేటర్‌గా పనిచేశారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్
మంత్రివర్గ ప్రముఖుల్లో ఒకరిగా ఉన్నారు. ఎంతటివారికైనా సవాల్ విసరడంలో దిట్ట. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి క్షేత్రస్థాయి టూర్ ఏర్పాటు చేయడం తెలిసిందే. హిస్సాంగంజ్ మోండా నుంచి 1986లో కార్పొరేటర్‌గా మొదటి ప్రయత్నంలో ఓడిపోయినప్పటికీ, మలి ప్రయత్నంలో 1994లోటీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. మంత్రి పదవి సైతం పొందారు. 2014లో టీడీపీ నుంచే గెలిచినప్పటికీ అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. తొలుత సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బరిలో దిగగా ప్రస్తుతం సనత్‌నగర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సుధీర్‌రెడ్డి
తొలుత అక్బర్‌బాగ్ డివిజన్ నుంచి సుధీర్‌రెడ్డి కార్పొరేటర్‌గా గెలిచారు. రెండు పర్యాయాలు కార్పొరేటర్‌గా నెగ్గిన ఆయన ఆతర్వాత పీసీసీలో ముఖ్య పదవుల్లో కొనసాగారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుడా చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎల్‌బీనగర్ ఎమ్మెల్యేగా, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
పద్మారావు గౌడ్
తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై 1986లో కాంగ్రెస్ నుంచి గెలిచి కార్పొరేటర్‌గా నెగ్గారు. అనంతరం 2002లోనూ టీఆర్‌ఎస్ నుంచి మరోమారు కార్పొరేటర్‌గా గెలిచి, 2004లోఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో కూడా గెలిచి ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉండటం తెలిసిందే. విచిత్రమేమిటంటే ఒకప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి నెగ్గిన శ్రీనివాస్‌యాదవ్ సనత్‌నగర్‌కు మారారు. సనత్‌నగర్‌లో ఓడిన పద్మారావు, సికింద్రాబాద్ నుంచి గెలిచారు.
రేణుకా చౌదరి రాజకీయ ప్రయాణం
కేంద్రమంత్రిగా, రాజ్యసభసభ్యు రాలిగా పనిచేసిన రేణుకాచౌదరి రాజకీయ ప్రయాణం కార్పొరేటర్ నుంచే మొదలైంది. 1986లో బంజారాహిల్స్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి, టీడీపీలో క్రమేపీ ఉన్నతస్థాయి కెదిగారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు.
మీసం తిప్పిన తీగల కృష్ణారెడ్డి
1986లో కార్పొరేటర్‌గా ఓటమి చవిచూసినా, టీడీపీ హయాంలో మూడు పర్యాయాలు హుడా చైర్మన్‌గా పనిచేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నగర మేయర్‌గా విజయఢంకా మోగించారు. టీడీపీ నగర అధ్యక్షునిగా మూడుసార్లు పనిచేశారు. అనంతరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఇంకా..పలువురు
♦ 1986లో కార్పొరేటర్‌గా ఓటమిచెందిన జి.సాయన్న అనంతరం టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌లోనూ ఎమ్మెల్యేగా ఎన్నికవడం తెలిసిందే.
♦ 1986లో కార్పొరేటర్‌గా గెలిచిన ముఠా గోపాల్ ఆర్టీసీ రీజినల్ చైర్మన్‌గా, టీడీపీ నగరశాఖ అధ్యక్షునిగా మూడు పర్యాయాలు పనిచేశారు. ప్రస్తుతం ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
♦ తొలుత 1986లో పాతబస్తీలోని అలియాబాద్ నుంచి సి.కృష్ణయాదవ్ కార్పొరేటర్‌గా గెలిచి సత్తా చాటారు. తర్వాత హిమాయత్‌నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి గెలిచారు. గెలవడమేకాక పశుసంవర్ధకశాఖ మంత్రిగా, కార్మికశాఖ మంత్రిగా, విప్‌గా పనిచేశారు.
♦ఎంఐఎం వ్యవస్థాపకుడు.. సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ సైతం నగరపాలకసంస్థ కార్పొరేటర్‌గా పనిచేశారు. మల్లేపల్లి డివిజన్‌నుంచి ఆయన కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఎంఐఎం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ముంతాజ్ అహ్మద్‌ఖాన్, సయ్యద్ పాషాఖాద్రీ, అహ్మద్‌బలాలా , జాఫర్ హుస్సేన్, కౌసర్ మొహియుద్దీన్, బీజేపీ నుంచి కార్వాన్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ సైతం కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగిన వారే.
Comments
Please login to add a commentAdd a comment